– సీబీఐ ఎదుట షర్మిల హాజరుతో కలకలం
– అవినాష్, భాస్కర్‌రెడ్డి ప్రస్తావనతో నష్టం ఎవరికి?
– గుట్టువిప్పిన షర్మిలకు షాకిచ్చిందెవరికి?
– వెలుగుచూస్తున్న వివేకా హంతకులు
– వివేకా హత్య కేసు చిక్కుముడి వీడుతుందా?
– కుటుంబసభ్యుల వైపే షర్మిల వేళ్లు
– ఎన్నికల ముందు నారాసుర రక్త చరిత్ర ఉత్తిదేనా?
– షర్మిల వాంగ్మూలంతో టీడీపీపై చెరిగిన మరక
– షర్మిల వాంగ్మూలంతో నైతిక సంకటంలో వైసీపీ
– పెదవి విప్పని వైసీపీ పెద్ద తలలు
– గతంలో చేసిన వ్యాఖ్యలపైనా మౌనవ్రతమే
– వైసీపీని ప్రజల ముందు దోషిగా నిలబెట్టిన షర్మిల వాంగ్మూలం
– ఇప్పుడు షర్మిలను నమ్ముతారా? పార్టీ నేతల మాటలు నమ్ముతారా?
– విపక్షాలకు ఆయుధంగా మారిన షర్మిల వాంగ్మూలం
– తన వాంగ్మూలాన్ని ఖండించని షర్మిల
( మార్తి సుబ్రహ్మణ్యం)
గత ఎన్నికల ముందు ఏపీలో సంచలనం సృష్టించిన మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు, చిక్కుముడి వీడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. అది స్పష్టంగా కుటుంబ కలహాల నేపథ్యంలో జరిగిన రాజకీయ హత్యేనంటూ.. ఆ కుటుంబానికే చెందిన వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల, సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలం.. అధికార వైసీపీని రాజకీయంగా షేక్ చేస్తోంది. అసలే సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న సమయంలో.. సీఎం జగనన్న సోదరి షర్మిల, తన చిన్నాయన హత్య గుట్టువిప్పిన వైనం, వైసీపీని ఆత్మరక్షణలో పడేసింది. తాజా పరిణామాలు .. గత ఎన్నికల ముందు వైసీపీ, ఆ పార్టీ అధికార మీడియా ‘నారాసుర రక్తచరిత్ర’ అంటూ చేసిన విమర్శల్లో పసలేదని స్పష్టమయింది. వివేకా హత్య గుట్టు విప్పిన షర్మిల.. అటు సొంత అన్న పార్టీని ఇరుకునపెట్టగా, టీడీపీకి క్లీన్‌చిట్ ఇచ్చినట్టయింది. అంటే ఒకరికి ఖేదం, ఇంకొకరికి మోదమన్నమాట.
వివేకానందరెడ్డి హత్యలో టీడీపీ కుట్ర ఉందంటూ.. గత ఎన్నికల ముందు వైసీపీ అధినేత జగన్ నుంచి ఎంపి విజయసాయిరెడ్డి వరకూ చేసిన ఆరోపణలో పసలేదని.. సీఎం జగన్ సోదరి షర్మిల, సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలం సంచలనంగా మారింది. ఇది రాజకీయంగా టీడీపీకి వెయ్యి ఏనుగుల బలం ఇచ్చినట్టయింది. అదే సమయంలో ఈ హత్య.. తన కుటుంబ రాజకీయ పోరాటంలో భాగమేనంటూ షర్మిల ఇచ్చిన వివరణ, సొంత అన్న జగన్ సారథ్యంలోని వైసీపీని, ప్రజల ముందు నైతికంగా దోషిగా నిలబెట్టినట్టయింది.
కడప మాజీ ఎంపీ అయిన, తన చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య వెనుక.. కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, భాస్కరరెడ్డి ఉన్నారన్నదే తన అనుమానమంటూ వైఎస్ షర్మిల సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలం, రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. అంతకుముందు.. కడప ఎంపీ టికెట్ వివాదమే వివేకా హత్యకు కారణమంటూ మీడియాకు చె ప్పిన షర్మిల, వైసీపీని ఇరుకునపెట్టారు.
ఇప్పుడు నేరుగా ఆ ఇద్దరి పేర్లు ప్రస్తావించడం ద్వారా.. తన జగన్ సారథ్యం వహిస్తున్న వైసీపీని, పూర్తి స్థాయిలో జనం ముందు ముద్దాయిగా నిలబెట్టినట్టయింది. ఢిల్లీకి వెళ్లిన షర్మిల, సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలం మీడియాకు లీక్ కావడంతో, అటు వైసీపీ రాజకీయంగా ఆత్మరక్షణలో పడినట్టయింది. మరోవైపు తాను ఎలాంటి వాంగ్మూలం ఇవ్వలేదని షర్మిల ఇప్పటివరకూ ఖండించకపోవడం చూస్తే, మౌనం అంగీకారంగానే భావించక తప్పని పరిస్థితి.
ప్రతి అంశంపై అనునిత్యం స్పందించి, రాజకీయ ప్రత్యర్ధులపై ఎదురుదాడి చేసే జగన్ విధేయబృందం.. వివేకా హత్యపై మీడియా ముందు షర్మిల చేసిన వ్యాఖ్యలపై మౌనంగా ఉండిపోయింది. దానిపై అప్పట్లో వివేకానంద హత్య సమయంలో.. మీడియాముందు హడావిడి చేసిన ఎంపీ విజయసాయిరెడ్డి గానీ, కడప ఎంపీ అవినాష్‌రెడ్డి గానీ పెదవి విప్పకపోవడం విశేషం.
చివరికి షర్మిల సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలం లీకయినా కూడా, వైసీపీ నేతలు ఆమెపై ఎదురుదాడి చేయడం బదులు, పెదవి విప్పకపోవడం మరో వింత. అదే సమయంలో వివేకా హత్య జరిగిన రోజున, ‘నారాసుర రక్తచరిత్ర’ అంటూ హడావిడి చేసి.. టీడీపీపై టన్నులకొద్దీ బురద చల్లిన వైసీపీ అధికార మీడియా కూడా, షర్మిల వ్యాఖ్యలపై మౌనంగా ఉండటం మరో ఆశ్చర్యం.
తాజాగా వివేకా హత్య వెనుక అవినాష్‌రెడ్డి- భాస్కరరెడ్డి ఉన్నారన్నదే తన అనుమానమంటూ.. షర్మిల ఇచ్చిన వాంగ్మూలం లీకయిన తర్వాత కూడా, వైసీపీ వ్యూహబృందం చడీచప్పుడు లేకుండా ఉండిపోవడం, రాజకీయ వర్గాలను విస్మయపరుస్తోంది. అధినేత జగన్ నుంచి ఎలాంటి ఆదేశాలు రానందుకే, వైసీపీ వ్యూహబృందం మౌనం ఆశ్రయించినట్లు కనిపిస్తోంది.
మరోవైపు వివేకాహత్యపై వైసీపీ వేసిన బురదను, స్వయంగా షర్మిలనే తన వ్యాఖ్యలతో కడిగివేయడంతో, నిన్నటి వరకూ బాధితుడిగా ఉన్న ఇప్పుడు టీడీపీ రెచ్చిపోవడం ప్రారంభించింది. వివేకా కూతురే.. తన చిన్నాన్న హత్యలో ఎవరున్నారో వెల్లడించిన నేపథ్యంలో, జగన్ హత్యారాజకీయాలు గమనించాలంటూ, టీడీపీ కొత్త వ్యూహంతో ఎదురుదాడి మొదలుపెట్టింది. షర్మిల వాంగ్మూలంపై దమ్ముంటే మాట్లాడాలని సవాల్ చేసింది. అయినా వైసీపీ వ్యూహబృందం మౌనంగా ఉందంటే.. షర్మిల వాంగ్మూలం జగన్ పార్టీని, ఏ స్థాయిలో ఆత్మరక్షణలోకి నెట్టిందో స్పష్టమవుతోంది.
వైసీపీ వ్యూహబృందం మౌనానికి, మరో కారణం ఉన్నట్లు కనిపిస్తోంది. కడప ఎంపీ టికెట్ విషయంలో మా కుటుంబంలో గొడవలున్నాయి. బాబాయ్ వివేకాకు గట్టి పోటీ ఉందని షర్మిల, సీబీఐకి వెల్లడించారన్నది జరుగుతున్న ప్రచారం. ‘వివేకాకు టికెట్ ఇస్తే తమకు ఉనికి ఉండదన్న భయంతో, అవినాష్‌రెడ్డి-భాసర్కరెడ్డి మా చిన్నాన్నను చంపించారన్నది మా అనుమానం’ అని షర్మిల ఇచ్చిన వాంగ్మూలంపై.. వైసీపీ నేతలు ఇప్పటివరకూ స్పందించి, ఎదురుదాడి చేయకపోవడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.
నిజానికి దానిపై సీఎం జగన్ లేదా ఎంపీ అవినాష్‌రెడ్డి మాత్రమే స్పందించాలి. ఎందుకంటే ఇది పూర్తిగా జగన్ కుటుంబ వ్యవహారం కావడంతో, విజయసాయిరెడ్డి- సజ్జల- వైవి సుబ్బారెడ్డి స్థాయి నేతలు మాట్లాడినా ప్రజలు విశ్వసించరు. అది కూడా వైసీపీ మౌనానికి ఒక ప్రధాన కారణంగా కనిపిస్తోందని, రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
మరో వైపు వివేకా హత్యపై.. గత నెలరోజుల నుంచి టీడీపీ సంధిస్తున్న ప్రశ్నలు.. చేస్తున్న విమర్శలపై వైసీపీ నేతలెవరూ స్పందించకుండా, మిగిలిన అంశాలపై మాత్రమే ఎదురుదాడి చేస్తుండటాన్ని విస్మరించకూడదు. దానికి కారణం.. వివేకా హత్య అంశం ప్రస్తావించేందుకు, అధినేత జగన్ నుంచి వారికి గ్రీన్‌సిగ్నల్ రాకపోవడమేనని స్పష్టమవుతోంది.
తాజా పరిణామాల నేపథ్యంలో వైసీపీపై, షర్మిల ఆటంబాంబు వేసినట్లుగానే రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అసలు ఆమె సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలం, ఎలా లీకయిందన్న అంశం వైసీపీని ఇంకా షాక్‌లోనే ఉంచింది. దీనిపై నష్టనివారణకు నడుంబిగించాలన్నా, లేక ఎదురుదాడి చేయాలన్నా, జగన్ అనుమతి తప్పనిసరి అని వైసీపీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇదంతా జగన్ కుటుంబ వ్యవహారం కాబట్టి.. మిగిలిన వారు అనుమతి లేకుండా మాట్లాడటం గానీ, జగన్‌కు సలహా ఇవ్వడం గానీ అసాధ్యమని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
ఏదేమైనా షర్మిల వ్యాఖ్యలు.. వైసీపీ ఇమేజీకి దారుణమైన డ్యామేజీనే అని, ఆ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. షర్మిల వాంగ్మూలం వల్ల, వివేకా హత్య కేసులో టీడీపీపై వేసిన అభాండాలు.. అబద్ధమన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయని విశ్లేషిస్తున్నారు. కూతురు వరసయిన షర్మిల నిజాలేమిటో చెప్పిన తర్వాత, ప్రజలు తమ మాటల కంటే, ఆమె చెప్పినవే వింటారని వైసీపీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.