Suryaa.co.in

Features

కొంతమంది మహిళలు బానిస భాషను, నిస్సిగ్గుగా వాడటమే విషాదం!

స్త్రీల అణచివేత….. భారతీయ సామాజిక నిర్మాణంలో అంతర్భాగం. ఈ దుర్మార్గం చాలామందికి అర్థం కాదు.
అగ్రవర్ణం అని చెప్పుకునే బ్రాహ్మణులలో… సంప్రదాయాల పేరుతో స్త్రీల అణచివేత అత్యంత దారుణం. స్త్రీలు చదువుకోవటానికి కూడా వీళ్లు అంగీకరించలేదు. ఒకవేళ స్త్రీ విద్యావంతురాలు అయినప్పటికీ… పూజారి పాత్ర కు పనికిరాదు. అది పురుషుల సొంతం.
వర్ణ వ్యవస్థలో రెండో స్థానంలో ఉండే క్షత్రియులలో కూడా….. ప్రతిభావంతురాలు అయినప్పటికీ, కూతురికి అధికారంలో వారసత్వం లేదు. కొడుకు అసమర్ధుడైనా… వారసత్వం అతనిదే. ( రాహుల్ గాందీఫెయిల్ అయిన తర్వాతే ప్రియాంక కు అవకాశం)
ఇక మూడో వర్ణమైన వైశ్యుల లో…. స్త్రీలు బయటకు రావడమే చాలా తక్కువ.
పై మూడు వర్ణాల స్త్రీలతో పోలిస్తే…… అణచివేత ఉన్నప్పటికీ….. కొంత స్వేచ్ఛగా బ్రతికే స్త్రీలను శూద్ర కులాల లో చూడవచ్చు.
సూద్ర కులాలలో స్త్రీలు పురుషులతో సమానంగా పని చేస్తారు కాబట్టి, పై వర్ణాల స్త్రీలతో పోలిస్తే కొంత స్వేచ్ఛ గా బతుకుతారు.
అయితే స్థూలంగా చూస్తే……. భారతీయ పితృస్వామిక వ్యవస్థ లో, స్త్రీల అణచివేత ఒక భాగం. చాలా సహజంగా అది జరిగి పోతుంది.
తాము అణచివేతకు గురవుతున్న విషయం కూడా గ్రహించలేని స్థితికి స్త్రీ నెట్టివేయబడుతుంది.
కుటుంబ వ్యవస్థ పేరుతో, సంప్రదాయాల పేరుతో, బాల్యంలో తండ్రి నియంత్రణలో, యవ్వనంలో భర్త నియంత్రణలో, వృద్ధాప్యంలో కొడుకు నియంత్రణలో… బతకటమే స్త్రీకి జీవితం అవుతుంది.
మనుస్మృతి చాలా స్పష్టంగా న స్త్రీ స్వాతంత్ర్య మర్హతి ( ఏ మహిళ కూడా స్వతంత్రానికి అర్హురాలు కాదు) అని బహిరంగంగానే చెప్పింది.
పురుషాధిక్య సమాజంలో… ప్రతిదీ పురుషుడి కోణంలోనే ఏర్పాటు చేయబడుతుంది. అందుకే భారతాన్ని పాండవుల కోణంలో రాస్తారు, రామాయణాన్ని రాముడి కోణంలో రాస్తారు, బుద్ధుడు జీవితంలో ఆయన గొప్పతనాన్ని మాత్రమే చూపిస్తారు. అందుకే మహాభారతంలో ద్రౌపతి అభిప్రాయాలకు, రామాయణంలో సీత మనోభావాలకు, బుద్ధ చరిత లో యశోధర దుఃఖానికి…… ఎలాంటి విలువ ఇవ్వలేదు.
ఎందుకంటే…… ఇవన్నీ…. మగాడి కోణంలో, మగాడి దృష్టితో, మగాడి కోసం, మగాళ్ళు రాసుకున్నవి.
ఈ పురుషాధిపత్య సమాజం భాషలో కూడా….. స్త్రీ అణచివేత ఒక భాగం.
ఇద్దరు పురుషుల మధ్య ఆధిపత్య పోరు జరిగేటప్పుడు…..
వారి సంభాషణ లో… స్త్రీలు ధరించే చీరను, గాజులను… అసమర్ధతకు, చేతకానితనానికి… ఓటమికి…. పర్యాయ పదాలుగా వాడుతారు.
అందుకే….. యుద్ధరంగం నుంచి వెనక్కి వచ్చిన ఖడ్గ తిక్కనకు….. స్నానానికి పసుపు ఇచ్చినట్టు… కథలు కథలుగా చెబుతారు.
ఒక పురుషుడు మరొక పురుషుడిని తిడుతూ… నేను గాజులు తొడుక్కొ లేదు అంటాడు. నేను చీర కట్టుకో లేదు అంటాడు.
విషాదమేంటంటే మేము నాయకులు గా ఎదిగాము అని చెప్పుకుంటున్న, కొంతమంది మహిళలు…… ఈ బానిస భాషను, నిస్సిగ్గుగా వాడటం.

– డాక్టర్ కొలికపూడి శ్రీనివాస రావు

LEAVE A RESPONSE