Suryaa.co.in

Andhra Pradesh

టీడీపీ మేనిఫెస్టోలో మహిళలకు పెద్దపీట వేయాలి

-మహిళల సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేయాలని మహిళా సంఘాల ఐక్యవేదిక సభ్యుల వినతి

మహిళలపై జరుగుతున్న అరాచకాలు, అకృత్యాల నివారణకు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ప్రాధాన్యమివ్వాలని మహిళా సంఘాల ఐక్యవేధిక నాయకులు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి, మేనిఫెస్టో కమిటీ సభ్యులు గురజాల మాల్యాద్రిని విన్నవించారు.

రాష్ట్రంలో మద్యం విధానం కారణంగా ఎక్కువగా మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. షాపుల్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలి. మండలానికి ఒకటి మాత్రమే ఉండేలా చూడాలి. అదే సమయంలో మద్యం అమ్మకాలపై నియంత్రణ ఉండాలి. మద్య నియంత్రణ కోసం ప్రస్తుత ప్రభుత్వం మద్య విమోచన కమిటీ ఏర్పాటు చేసినా, ఎక్కడా పని చేయడం లేదు. వేలాది బెల్టు షాపులు ఏర్పడి మహిళల జీవితాలు నాశనమవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో మద్యం విధానంపై మేనిఫెస్టోలో మెరుగైన చర్యలు తీసుకోవాలన్నారు.

ఇదే సమయంలో డ్వాక్రా సున్నా వడ్డీ గతంలో రూ.5 లక్షల వరకు అందేది. ప్రస్తుతం రూ.3 లక్షలు మాత్రమే అందుతోంది. దాన్ని రూ.20 లక్షల వరకు అమలు చేయాలి. అప్పుడే మహిళలు స్వతంత్రంగా వ్యాపారాలు చేసుకునేందుకు అవకాశం కలుగుతుంది. ఈ విషయంలో ప్రత్యేకంగా చొరవ చూపాలని కోరారు. అదే సమయంలో డ్వాక్రా మహిళల పొదుపు సొమ్ము విషయంలోనూ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. అదే సమయంలో అభయహస్తం నిధిని కూడా కాపాడాలన్నారు.

ప్రతి డ్వాక్రా మహిళకు అభయహస్తం పథకం ద్వారా పెన్షన్ అందించాలి. అదే సమయంలో వృద్ధాప్య పెన్షన్ కూడా కొనసాగించాలన్నారు.

ఇక మహిళలపై జరుగుతున్న అరాచకాల విషయంలో ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. ప్రతి నియోజకవర్గంలో ఒక కమిటీ ఏర్పాటు చేసి వారిపై జరిగే నేరాలకు కారణాలను అన్వేషించాలన్నారు. ఉన్న చట్టాలపై మరింత అవగాహన కల్పించాలి. పని చేసే ప్రాంతాల్లో, స్కూళ్లు, కాలేజీలు, ఇతర ప్రాంతాల్లో గ్రీవెన్స్ కేంద్రాల ఏర్పాటుకు చొరవ చూపాలన్నారు. మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యమివ్వాల్సిందిగా కోరారు.

కార్యక్రమంలో NFIW రాష్ట్ర కార్యదర్శి పి.దుర్గాభవాని, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి, మహిళా కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మశ్రీ, పి.ఓ.డబ్ల్యూ రాష్ట్ర నాయకులు పి.పద్మ, ఐఫ్వా రాష్ట్ర కార్యదర్శి ఆర్.నాగమణి, వాసవ్య మహిళా మండలి అధ్యక్షురాలు బి.కీర్తి, వాసవ్య మహిళా మండలి కార్యదర్శి జి.రశ్మి, మహిళా సమాఖ్య లీడర్ ధనలక్ష్మి, ప్రగతి నారీ శక్తి నేషనల్ వర్కింగ్ అధ్యక్షురాలు సి.హెచ్.హేమలత, జమాత్ ఇ ఇస్లామి హింద్ నాయకులు ఖానిత సల్మా, డి.బి.ఆర్.సి నాయకులు పి.రమ, రాష్ట్ర లీగల్ సెల్ జనరల్ సెక్రటరీ బి.వి. అరుణాదేవి సహా పలువురు మహిళా నాయకులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE