•ప్రజాస్వామ్యంలో సమస్యలు చెప్పడం నేరమా?
•వరద బాధితులను ఆదుకోవాలని కోరితే మహిళలను బూతులు తిడతారా?
•జనసేన వీర మహిళలకు జరిగిన అవమానంపై జాతీయ మహిళా కమీషన్ కు ఫిర్యాదు చేస్తాం
•వీర మహిళల పోరాటం స్ఫూర్తిదాయకం
•చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ రావాలి
•జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్
•వరద బాధితుల సమస్యలపై ధైర్యంగా నిలబడిన వీర మహిళలకు పవన్ కళ్యాణ్
చేతుల మీదుగా సత్కారం
‘ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం విపక్ష పార్టీల కర్తవ్యం. ఆ బాధ్యతను జనసేన పార్టీ ఎప్పుడూ విస్మరించదు. దానిని నిర్వర్తించేందుకు జనసేన పార్టీ వీర మహిళలు వెళ్తే అధికార పక్ష ఎమ్మెల్యే దుర్భాషలాడటం దురదృష్టకరం. 10 రోజుల క్రితం డా.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా, పి.గన్నవరం నియోజకవర్గం, గంటి పెదపూడిలో వరద బాధల్లో ఉన్న నిర్వాసితుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు జనసేన పార్టీ వీర మహిళలు ప్రయత్నిస్తే వారిని అడ్డుకోవడం ప్రభుత్వ సంకుచిత ధోరణిని తెలియచేస్తోంది. వరద ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటన వేళ జనసేన పార్టీ జిల్లా నాయకుల్ని హౌస్ అరెస్ట్ లు చేసినా, ఏ మాత్రం తొణకకుండా వరద బాధితుల సమస్యలను చెప్పడానికి ప్రయత్నించిన జనసేన వీర మహిళలను అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి అసభ్య పదజాలంతో దూషించడం అత్యంత బాధాకరమ’ని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. శనివారం హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గంటి పెదపూడిలో వరద సమస్యలపై అధికార పార్టీ ఎమ్మెల్యేను ధైర్యంతో నిలదీసిన వీరమహిళలకు పవన్ కళ్యాణ్ శాలువాలు కప్పి సత్కరించారు. వారికి వెండి మహిషాసుర మర్దిని అమ్మవారి ప్రతిమలను బహూకరించారు. పవన్ కళ్యాణ్ నుంచి సత్కారం అందుకున్న వారిలో గంటా స్వరూప, ఎమ్. ప్రియా సౌజన్య, చల్లా లక్ష్మీ, కె.నాగ మానస, సుంకర కృష్ణవేణి, మేడిసెట్టి సత్యవాణి, బోడపాటి రాజేశ్వరి, బర్రె లక్ష్మీ, మోటూరి కనకదుర్గ ఉన్నారు. గంటి పెదపూడిలో జరిగిన ఘటనపైనా, వరద బాధితులకు ఎదురైన సమస్యపైనా ఆరా తీశారు.