-దానిపై భర్తకు, అత్తమామలకు హక్కు ఉంటుందా?
-సుప్రీంకోర్టు ఏం చెబుతోంది.!
‘స్త్రీ ధనం’ అంటే ఏమిటి? స్త్రీ ధనంపై భర్తకు హక్కు ఉంటుందా? భరణం, స్త్రీ ధనం ఒక్కటేనా? ఇవన్నీ సాధారణ ప్రజలకు ఉండే సందేహాలు. ఈ సందేహం నివృత్తి కావాలంటే ఈ వివరణ చదవండి. స్త్రీ ధనం ప్రాధాన్యత గురించి ప్రతి ఆడపిల్ల అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉంది.
‘స్త్రీ ధనం’పై ఇటీవల సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. స్త్రీ ధనం అనేది భార్యాభర్తల ఉమ్మడి ఆస్తిగా మారదని, దానిపై భర్తకు హక్కు ఉండదని స్పష్టంచేసింది. పెళ్లి తర్వాత స్త్రీధనాన్ని భర్త లేదా అత్తమామల అదుపులో ఉంచినప్పుడు, వారు కేవలం ధర్మకర్తలుగా వ్యవహరించాలే తప్ప, దాన్ని స్వప్రయోజనాల కోసం వాడుకోకూడదని దేశ సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. మహిళ అడిగిన వెంటనే ఆమెకు చెందిన స్త్రీధనాన్ని తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుందని పేర్కొంది. ఒకవేళ తిరిగి ఇవ్వడానికి నిరాకరిస్తే, నేరపూరిత ఉల్లంఘన కిందికి వస్తుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
భరణం వరకట్నం, స్త్రీ ధనం, భరణం మూడు ఒకటే అని చాలా మంది భావిస్తుంటారు. కానీ ఈ మూడు వేర్వేరు. వరుడు వరకట్నం తీసుకోవడం చట్టవిరుద్ధం. కానీ స్త్రీ ధనం అనేది చట్టబద్ధమైన అంశం. ఇక భరణం అంటే భర్త నుంచి విడాకులు తీసుకున్న తర్వాత, మహిళకు ప్రతినెలా అందే ఆర్థిక చేయూత. పెళ్లికి ముందు, పెళ్లి సమయంలో, మహిళకు ఆమె కుటుంబం, బంధువులు, స్నేహితులు అందించే వస్తువులను స్త్రీధనం అని పిలుస్తారు.
స్త్రీధనం పరిధిలో మహిళకు చెందిన చర, స్థిరాస్తులతో పాటు ఆభరణాలు, బంగారం, వెండి, విలువైన రాళ్లు ఉంటాయి. ఆమెకు పుట్టింటి నుంచి వచ్చిన కారు, పెయింటింగ్‌లు, కళాఖండాలు, గృహోపకరణాలు, ఫర్నీచర్ కూడా స్త్రీధనమే. మహిళ తను సంపాదించిన డబ్బుతో చేసిన ఏవైనా పొదుపులు, పెట్టుబడులు కూడా ఆమెకే దక్కుతాయి.
మహిళ తన భర్త నుంచి విడిపోయే క్రమంలో స్త్రీధనాన్ని క్లెయిం చేయొచ్చు. ఆమె క్లెయింను తిరస్కరించడం కూడా గృహ హింస కిందికి వస్తుంది. ఆమె భర్తతో పాటు అత్తమామలు కూడా క్రిమినల్ ప్రాసిక్యూషన్‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మహిళకు స్త్రీధనంగా వచ్చిన ఆభరణాలు, విలువైన వస్తువులను అత్తమామలు దాచిన సందర్భాల్లో, సదరు మహిళ అడగగానే వాటిని తిరిగి ఇచ్చేయాలి.
లేదంటే భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 406 ప్రకారం ‘నేరపూరిత నమ్మక ఉల్లంఘన’ కేసును పెట్టొచ్చు. దీని ప్రకారం కోర్టు మూడు సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా విధిస్తుంది. భర్త చేసిన అప్పులు తీర్చడానికి మహిళకు సంబంధించిన ఆస్తి ఉపయోగించకూడదు. స్త్రీధన్ అనేది మహిళకు సంబంధించిన సంపూర్ణ ఆస్తి.
ఇవి స్త్రీధనం కిందకు రావు..
పెళ్లి సమయంలో భార్య తల్లిదండ్రులు భర్తకు బహుమతిగా ఇచ్చిన ఉంగరం, బంగారు గొలుసు వంటివి స్త్రీధనం పరిధిలోకి రావు. భార్య పేరిట భర్త ఏదైనా చర, స్థిరాస్తిని కొని బహుమతిగా ఇవ్వకున్నా, ఆ ఆస్తి స్త్రీధనం పరిధిలోకి రాదు. ఎవరైనా వివాహిత తన నెలవారీ సంపాదనలో కొంత మొత్తాన్ని ఇంటి ఖర్చుల కోసం ఉపయోగిస్తే, దాన్ని తిరిగి క్లెయిమ్ చేయడానికి వీలుండదు.జాబితాలు రాసుకోవాలి వీడియోలు దాచుకోవాలి!
మహిళ తనకు స్త్రీ ధనంగా వచ్చిన విలువైన వస్తువులు, కానుకలు, ఆభరణాల జాబితాను రాసుకోవాలి. వాటిని బ్యాంకు లాకర్‌లో భద్రపర్చుకోవాలి. నగదు ఉంటే దాన్ని తన పేరిట బ్యాంకులో డిపాజిట్ చేసుకోవాలి. ఆభరణాలు, విలువైన వస్తువులకు సాక్ష్యంగా పెళ్లి ఫోటోలు, వీడియోలను వాడుకోవచ్చు. విలువైన ప్రతి వస్తువుకు బిల్లులు ఆమె పేరు మీద ఉండేలా చూసుకోవాలి. మహిళ ఒకవేళ జాబ్ చేస్తుంటే, ఆమె పేరు మీద ప్రత్యేక బ్యాంకు అకౌంట్ ఉండాలి.
టి.వాసు