Suryaa.co.in

Features

మానవుడే మహనీయుడు!

మానవతకు ఓ రోజేంటి..
అది నీ నైజం..
మనిషి ఇజం..
నిన్ను నిన్నుగా నిలబెట్టే
లక్షణం..
కోటానుకోట్ల జీవరాశులున్న
సృష్టిలో మనిషికి మాత్రమే
అబ్బిన సలక్షణం..
అందుకే అతడయ్యాడు
అంత విలక్షణం..!

మానవత..
మనిషే లేనినాడు
ఎక్కడిది ఈ పదం..
మానవతే మనిషి పధం..
అదే అతడి ధర్మం..
మానవ జీవన మర్మం..
నిత్య ఆచరణీయ కర్మం!

అయితే ఇలాంటి
ఓ రోజు అవసరమే..
మనిషి తనలోని
మనీషిని మర్చిపోతున్న వేళ
మానవతకు దూరమై..
ఇహం మరచి…అహం పెరిగి
దుష్టచర్యలపై
మోహం మితిమీరి
మానవుడే దానవుడౌతున్న
తరుణంలో
నీలోని నిన్ను నిద్రలేపి..
నువ్వు మనిషివి సుమాని
గుర్తు చేసేందుకు ఈ దినం..
దీనినే పాటించాలి
నువ్వు అనుదినం..!

ఇక్కడ బోధలకు తావు లేదు
నేనూ మనిషినే..
ఆ తానులో ముక్కనే..
నువ్వెలా అయితే
నేనూ అలాగే..
కొంచెం అటూ ఇటూ..
ఆటు పోటు..
మానవతే విధమైతే
అదే మారని పథమైతే..
మానవుడే మహనీయుడు..!

సురేష్ కుమార్ ఎలిశెట్టి
9948546286

LEAVE A RESPONSE