స రి గ మ ప ద ని
సప్తస్వరాలు..
మానవజీవిత సర్వాలు..
శ్రుతి..లయ..
అదో చిత్రమైన మాయ..!
గమకాలు..హరుడే
జోహారుడయ్యే చమకాలు..
రాగాలు..సరాగాల
పాటలు..
ఆనందానికి బాటలు..
కీర్తనలు..హృదయ నర్తనలు..
కృతులు..
భక్తి తత్పరతకు
ఆకృతులు..!
విభిన్న వాద్యాలు..
సంస్కృతీ సేద్యాలు..
కళామతల్లికి నైవేద్యాలు..
అప్పుడప్పుడూ వైద్యాలు..!
వీణ..చదువులమ్మ హస్తాలంకృత
పులకిత జాణ..
సితార..సుమధుర
స్వరాల ధార..
వాయులీనమైతే
అంతర్లీన భావాల ప్రజ్వల..
వేణువు..
సాక్షాత్ జగన్నాథుడి
అధరామృత సింధువు..
ఢమరుకం..
ముక్కంటి
పదవిన్యాస ఉత్ప్రేరకం..
మరి మృదంగమంటేనే
లయ విన్యాసాల విహంగం..
సంగీత స్రష్టల
పాండితీ వీరంగం..
డోలు,డప్పు..
గోటు,సన్నాయి…
దేనికది శార్వాణి
కొలువున సాలభంజికే..
సంగీత సరస్వతి ప్రియపుత్రికే..
సంగీత దినోత్సవ అభినందనలతో
సురేష్ కుమార్ ఎలిశెట్టి
9948546286