Suryaa.co.in

Features

నువ్వు డౌనైతే కౌంట్ డౌనే!

ఇచ్చేసావా మొత్తం నీ సిరి..
ఇక నీ పని సరి..
ఇంకేమి మిగిలున్నా ఇవ్వు..
సలహా మినహా..!

ఆఫీసులో పదవీ విరమణ
ఇంట్లో పెదవీ విరమణ..
విధులకు గుర్తింపుగా పెన్షన్
ఇంట్లో మొదలవును టెన్షన్
అక్కడ చివరి రోజున సన్మానం
ఇక్కడ మొదటి రోజు నుంచే అవమానం..
ఇన్నాళ్లు విధినిర్వహణ…
ఇకపై కష్టసుఖాల
ఆరోహణ అవరోహణ…!

వృద్ధాప్యమంటే మంటే..
పంటి బిగువున బాధ..
కంటిలో కనిపించని ధార..
గుండెల్ని పిండేసే వేదన…
వడలే మోము..కదిలే పళ్లు..
అవయవాలకు తెగుళ్ళు..
మనసుకు పగుళ్లు..
భారంగా గడిచే పగళ్లు..
నిద్రపట్టని రాత్రుళ్ళు..
నెమరువేసుకుంటూ
గతకాలపు స్మృతులు..
అనుభవిస్తూ వర్తమానపు
చేదు అనుభూతులు!

వృద్ధాప్యం..
నీకుగా అనిపించకపోయినా
ఇంట్లో వారు వేసేసే ముద్ర..
ఆపై శాశ్వత నిద్ర..
ఊరు పొమ్మంటుంది
కాడు రమ్మంటుంది..
నరకమో.. స్వర్గమో
అది చేరేలోగానే
ఇంట్లో మొదలయ్యే నరకం
మారే బంధువుల వాలకం..!

మెయిన్ హాలు నుంచి
మూల గదిలోకి మారే
నీ మకాం..
అప్పటి నుంచి
అన్నిటికీ బీ కాం
ఫించను ఠంచనుగా వస్తే ఓకే
లేదంటే కుక్కబ్రతుకే..
ఇన్నాళ్లు నీ వారి కోసం
నువ్వు పెట్టిన పరుగు..
ఇప్పుడేమి మిగిలేను
నిన్ను చూస్తేనే విసుగు…
పనులకైనా
పనికొస్తుందేమో అమ్మ..
నాన్న ఉత్తి దిష్టిబొమ్మ!

వ్యాపారంలో..
మోసాలు సాగినంతకాలం
హవాలా..
అన్నీపోతే దివాలా..
జీవితంలో అంతా
బాగున్నప్పుడు రంగీలా..
లేదంటే గిలాగిలా..
వృద్ధాప్యం కారాదు శాపం..
అనిపించుకోవద్దు
అయ్యో పాపమని..
సంపద ఉంటే తప్పేను ఆపద
ఆపై ఆరోగ్యమే మహాభాగ్యం
ఈ రెండూ కరవైతే
ముసలి కాలం
కష్టనష్టనికృష్ఠాల మిశ్రమం..
అదిగో పిలుస్తోంది వృద్ధాశ్రమం..
నీ జీవిత
చరమకాల ఆరామం!

ఎలిశెట్టి సురేష్ కుమార్
విజయనగరం
9948546286

LEAVE A RESPONSE