- గిరిజనులకు అన్ని రంగాల్లోనూ అధిక ప్రాధాన్యం
- ఎమ్మెల్సీలు జంగా కృష్ణమూర్తి, డొక్కా మాణిక్య వరప్రసాద్, లేళ్ల అప్పిరెడ్డి
- వైయస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా ఆదివాసీ దినోత్సవం
- ఆదివాసీ మహిళ రాష్ట్రపతి ముర్ముకు మద్ధతు తెలిపిన ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు
తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా డప్పుల మోతలు, గిరిజన, లంబాడీల సాంప్రదాయ నృత్యాలతో పార్టీ కార్యాలయం పూర్తి సందడిగా మారింది. ఆదివాసీ కులదేవతల చిత్రపటంతో పాటు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, గిరిజన సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వైయస్సార్సీపీ గిరిజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరాజ్యోత్ హనుమంతు నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి అయిన గిరిజన మహిళ ద్రౌపది ముర్ముకు మద్ధతు తెలిపిన ముఖ్యమంత్రికి ఏకగ్రీవంగా ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ.. వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆదివాసీల జీవన శైలిలో అనేక అభివృద్ధికరమైన మార్పులు చోటు చేసుకున్నాయన్నారు. అటవీ, మైదాన ప్రాంతాల మధ్య నెలకొన్న వ్యత్యాసాలు కూడా గణనీయంగా తగ్గాయన్నారు. ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని గిరిజనుల చెంతకు చేర్చడం ద్వారా వారి హక్కుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి తెలిపారు.
ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ.. గిరిజనుల సంస్కృతిని కాపాడుతూనే వారికి విద్య, వైద్యం అందుబాటులోకి తేవడంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ పూర్తిస్థాయిలో సఫలమయ్యారన్నారు. మారుమూల గిరిజన తండాలలో కూడా అధునాతన వైద్య సేవలు అందించడం ద్వారా వారికి అత్యంత ముఖ్యమైన ఆరోగ్య భద్రత కల్పించిన ఘనత సీఎం వైయస్ జగన్‌కే దక్కుతుందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల వల్ల ఎక్కువగా లబ్ధి జరుగుతున్నది కూడా ఈ వర్గాలకేనని అన్నారు. అటవీ ప్రాంతాలలోనే కాక, మైదాన ప్రాంతాల్లో ఉండే ఆదివాసీలంతా ఏకగ్రీవంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారని గుర్తుచేశారు.
ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. గిరిపుత్రుల జీవనశైలిని పరిరక్షిస్తూ.. వారి సంక్షేమాభివృద్ధికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. అన్ని రంగాలలో గిరిజనులకు అత్యంత అధిక ప్రాధాన్యతనిస్తూ కొత్తగా రెండు జిల్లాలను కూడా ఏర్పాటు చేయడమే అందుకు నిదర్శనమని ఆయన వెల్లడించారు. ఆదివాసీల జీవితాల్లో వెలుగులు నింపడమనేది కేవలం ఒక నినాదంలా కాక ఒక విధానంలా తీసుకుని ముందుకు సాగుతున్న ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్ అని పేర్కొన్నారు. సీఎం వైయస్ జగన్ ఆలోచనలు, ఆశయాలకు అనుగుణంగా ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలందరూ సమాన స్థాయికి చేరే రోజు ఎంతో దూరంలో లేదన్నారు.
ఈ కార్యక్రమంలో నవరత్నాల అమలు కమిటీ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ అంకంరెడ్డి నారాయణమూర్తి, మాజీ ఎంపీ శంకర్‌రావు, గిరిజన విభాగం రాష్ట్ర నేతలు సృజన, జి.సురేంద్ర, మేడా రమేష్ వై.వెంకటసుబ్బయ్య, విభిన్న ప్రతిభావంతుల విభాగం రాష్ట్ర ఛైర్మన్ బందెల కిరణ్‌రాజు తదితరులు పాల్గొన్నారు.