– వరుసగా మూడవ పురస్కారం
హైదరాబాద్: జనవరి 26 రిపబ్లిక్ డే దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ సాంస్కృతిక సంస్థలు “ వైద్యుల గ్లోబల్ ఫౌండేషన్” “వసుంధర విజ్ఞాన వికాస మండలి” సంయుక్త ఆధ్వర్యంలో వివిధ రంగాలలోని ప్రతిభావంతులకు “స్ఫూర్తి రత్న ”పురస్కారాలను ప్రకటించారు. సాహిత్య రంగానికి రాజమండ్రి నగరానికి చెందిన ఔత్సహిక రచయిత శ్రీపాద శ్రీనివాసుకు ప్రతిష్టాత్మక “వివేకానంద స్ఫూర్తి రత్న” పురస్కారాన్ని ప్రకటించారు.
కాగా రచయిత శ్రీపాద రచించిన 16కు పైగా కథలు, కథానికలు తన స్వీయ స్వరంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ద్వారా వినిపించారు. ఇంకా “గుండె చప్పుళ్ళు”, “ చట్టసభల్లో గోదావరి గళం ” “మనసున ఉన్నది”, “అంతరంగం” వంటి నాలుగు పుస్తకాలను రచించారు.
వీరి రచనల్లో మనిషి జీవితంలోని వివిధ స్పందనలను వ్యక్తీకరిస్తూ ఆ మేరకు తాత్విక చింతనను స్పష్టం చేస్తాయి. వీరు రచించిన పుస్తకాలకు ఉండవల్లి అరుణ్ కుమార్, మండలి బుద్ధ ప్రసాద్, డి.శ్రీధర్ బాబు, దనసరి అనసూయ (సీతక్క) వంటి రాజకీయ ఉద్దండులు ముందు మాటను అందించారు.
శ్రీపాద శ్రీనివాస్ సాంస్కృతిక నగరం రాజమండ్రి నివాసి అయినప్పటికీ హైదరాబాద్ లో స్థిరపడ్డారు.తెలంగాణ సాహిత్య, కళా సంస్థల అభిమానాన్ని చూరగొని వరుసగా మూడవ (హ్యాట్రిక్) పురస్కారంగా ” వివేకానంద స్ఫూర్తి రత్న” పురస్కారాన్ని అందుకోబోతున్నారు.
వీరికి గతంలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వారు రేడియో కళాకారుడిగా గుర్తింపు ఇవ్వగా తదుపరి “విపంచి” సాంస్కృతిక సంస్థ వారు ” ఉగాది” పురస్కారాన్ని ప్రదానం చేశారు. దీని గురించి శ్రీపాద శ్రీనివాసు మాట్లాడుతూ “వాగులు, వంకలు, నదులు ప్రవహిస్తూ చివరకు సముద్రంలో కలిసినట్టుగా కళలు, కళాకారులు ఎక్కడ జన్మించినా వారు రాణించడానికి హైదరాబాద్ చక్కని వేదికగా మారిందని ఇందుకు ఇక్కడ వారికి సర్వదా కృతజ్ఞుడిని అని సంతోషాన్ని వ్యక్తం చేశారు.
కేవలం కథలు, కథానికలను మాత్రమే కాకుండా రాజకీయ సామాజిక చైతన్యంతో అనేక రచనలను చేసి శ్రీపాద శ్రీనివాస్ ఎందరో ప్రముఖుల నుంచి ప్రశంసలను పొందారు. అయితే రచయిత శ్రీపాద సొంత ప్రాంతమైన రాజమండ్రి ప్రాంతంలోని రాజకీయ ప్రముఖులు, సాంసృతిక, కళా సంస్థలు ఈయనకు తగిన గుర్తింపును కల్పించే విషయంలో ఇప్పటివరకు దృష్టి పెట్టలేదనే చెప్పాలి.
రాజమండ్రిలోని మద్దూరి అన్నపూర్ణయ్య సేవా సంస్థ వారు మాత్రమే గతంలో పురస్కారాన్ని అందించి తమ ఔన్నత్యాన్ని చాటుకున్నారు. తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ శాసనసభాపక్షం కార్యాలయ సిబ్బందిగా పనిచేస్తున్న శ్రీనివాస్ ఈ పురస్కారం అందుకోబోతున్న శుభతరుణంలో పలువురు సాహితీ మిత్రులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.