-లిక్కర్ కేసులో బిడ్డను అరెస్ట్ చేస్తారనే భయంతోనే కేసీఆర్ కొత్త డ్రామా
-నీ బిడ్డపై లిక్కర్ ఆరోపణలోస్తే స్పందించకుండా సిసోడియా అరెస్ట్ ను ఖండించడం వెనుక మతలబు ఇదే
-సీఎంగా ఉంటూ ఇంత నీచ స్థాయికి దిగజారడం అవసరమా?
-ప్రధాని మోదీని బదనాం చేయడమే లక్ష్యంగా కేసీఆర్ డ్రామాలు
-దొంగ సంతకాలు కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య
-కోర్టులు తిట్టినా, వేల జీవోలు చీకట్లో పెట్టిన కేసీఆర్ ప్రజాస్వామ్యంపై గురించి చెప్పడం హాస్యాస్పదం
-నువ్వు మందితో లేఖ రాస్తే… నీ అవినీతిపై కోటి మందితో సంతకాలు సేకరిస్తాం
-త్వరలోనే రాష్ట్రపతిని కలిసే అంశాన్ని పరిశీలిస్తున్నాం
-బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్
సంతకాలు లేకుండా వివిధ పార్టీల నేతల, ముఖ్యమంత్రుల సంతకాలతో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ పంపినట్లుగా మీడియాకు విడుదల చేయడం హాస్యాస్పదమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఎద్దేవా చేశారు. లిక్కర్ కేసులో తన బిడ్ద పాత్రపై ఇంతవరకు నోరు మెదపని కేసీఆర్… అదే కేసులో సిసోడియా అరెస్ట్ ను ఖండించడం వెనుక కుట్ర దాగి ఉందన్నారు. తన బిడ్డను అరెస్ట్ చేయడం ఖాయమనే విషయం తెలియడంతో ఆమెను కాపాడుకునేందుకు ఈ కొత్త డ్రామాలకు తెర తీస్తున్నారని మండిపడ్డారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర ప్రదాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్, కోశాధికారి భండారి శాంతికుమార్, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ప్రకాశ్ రెడ్డి, అధికార ప్రతినిధి పోరెడ్డి కిశోర్ రెడ్డి తదితరులతో కలిసి బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. అందులోని ముఖ్యాంశాలు…
నిన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీకి పంపినట్లు మీడియాకు పంపిన లేఖలో రాస్తూ మీడియా గ్రూపుల్లో పెట్టారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాను అరెస్ట్ చేశారని గగ్గోలు పెట్టారు. ఆ లేఖలో సంబంధిత నాయకుల సంతకాలే లేవు. వాళ్లకు అసలు ఈ లేఖ సంగతి తెలుసో లేదో… కేసీఆర్ కు ఇట్లాంటివి వెన్నతో పెట్టిన విద్య. కేసీఆరే తయారు చేశారు. లిక్కర్ దందాలో భాగస్వాములుగా ఉన్న ఆప్ పార్టీ, కేసీఆర్ పార్టీ తప్ప ఎవరూ దీనిపై స్పందించలేదు. వీళ్లంతా ముఠాగా ఏర్పడి ఎన్ని దొంగ దందాలు చేసినా దర్యాప్తు చేయొద్దన్నదే వీళ్ల ఆలోచన. సిసోడియా నిజాయితీపరుడైతే ఆధారాల్లేకపోతే కోర్టు బెయిల్ ఇచ్చేది కదా… తరువాత కేసీఆర్ బిడ్డను అరెస్ట్ చేస్తారని తెలిసి తన బిడ్డను కాపాడుకునేందుకు కేసీఆర్ ఎంతకైనా తెగించేందుకు సిద్ధమయ్యారు. నీ బిడ్డపై ఆరోపణలొస్తే.. దీనిపై సీఎం కేసీఆర్ ఇంతవరకు స్పందించలేదు. ఖండించలేదు. దీనిగురించి మాట్లాడని సీఎం సిసోడియా పేరుతో బిడ్డను కాపాడేందుకు కొత్త డ్రామాకు తెరలేపిండు. సంతకాలు లేకుండా లెటర్ రిలీజ్ చేయడంలో మీ ఆంతర్యమేమిటి? సీఎంగా ఉంటూ ఇంత దిగజారుతారా? గతంలో వరద సాయం సమయంలో నా పేరు మీద ఫోర్జరీ లెటర్ స్రుష్టించారు. దళిత బంధు విషయంలోనూ అలాగే చేశారు. కేసీఆర్ నువ్వు 9 మంది నాయకుల పేర్లతో లెటర్ రాశావే…. మరి నీ అవినీతి గురించి, మీ కుటుంబ అక్రమాల గురించి నేను పాదయాత్ర చేస్తుంటే లక్షలాది మంది ఫిర్యాదు చేశారు.
మేం నీ అవినీతి, అక్రమాలపై త్వరలో కోటి మందితో సంతకాలు చేయించి రాష్ట్రపతి కలిసే అంశాన్ని పరిశీలిస్తున్నాం.సిసోడియాను అరెస్ట్ చేస్తే ప్రపంచం ముందు పరువు పోయిందని చెప్పడం సిగ్గు చేటు… కేసీఆర్ అవినీతి, ఆయన బిడ్డ లిక్కర్ దందాను చూసి తెలంగాణ పరువు పోతోంది. దేశం పరువు తీసిండు. వాటిపై విచారణ జరిపితే పరువు ఎట్లా పోతుందో ఆయనే చెప్పాలి? ప్రతిపక్షాలపై కేసులు పెడుతున్నానని చెప్పడం హాస్యాస్పదం. తప్పు చేసినోళ్లు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నదే మోదీ విధానం. కానీ నువ్వు చేస్తున్నదేమిటి? ప్రశ్నించే ప్రతిపక్ష నేతలపై కేసులు పెడుతున్నవ్? ధర్నాలకు అనుమతివ్వవు. పోలీసులతో, నాయకులతో దాడులు చేయిస్తున్నవ్? ఆత్మరక్షణ కోసం దాడులను ఆపేవాళ్లపై ఉల్టా కేసులు పెడుతున్నవ్? అక్రమంగా కేసులు పెట్టిన వాళ్లపై చర్యలు తీసుకున్న దాఖలాల్లేవ్. కేసీఆర్, ఆయన కొడుకు జిల్లా పర్యటనలకొస్తే బీజేపీ నేతలందరినీ రెండ్రోజుల ముందుగానే గ్రుహ నిర్భంధాలకు పరిమితం చేస్తన్నరు. కేసీఆర్ కావాలనే ప్రధానిని బదనాం చేయాలనుకుంటున్నడు. కేసీఆర్ కు కోర్టుల మీద నమ్మకం లేదు. ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదు.
తెలంగాణ సీఎస్ ను దాదాపు 30 సార్లు కోర్టు ధిక్కరణ కేసుల్లో న్యాయ స్థానం మందలించింది. 10 ఫైళ్లు పెండింగ్ లో ఉన్నాయని మహిళా గవర్నర్ ను బదనాం చేస్తున్న కేసీఆర్ తన 10 వేల ఫైళ్లు పెండింగ్ పెట్టుకున్నడు. 50 వేల జీవోలను వెబ్ సైట్లో పెట్టకుండా చీకట్లో పెట్టినవ్? దీనికేం సమాధానం చెబుతావ్? సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి సంతకాల్లేకుండా పత్రికలకు ఎట్లా రిలీజ్ చేశారో కేసీఆర్ చెప్పాలి. ఇంతగా దిగజారడం బాధాకరం. సంతకాలు లేకపోయినా సంచలనాల కోసం పతాక స్థాయిలో పత్రికలు ప్రచురించడం బాధాకరం. లిక్కర్ కేసులో నీ బిడ్డ పాత్ర ఉందా? లేదా? దమ్ముంటే కేసీఆర్ సమాధానం చెప్పాలి. నీ బిడ్డపై ఆరోపణలొస్తే నోరు మెదపని కేసీఆర్.. అదే కేసులో ఇతర పార్టీ నేత జైలుకు వెళితే ఖండించడం విడ్డూరం. సదరు నేతను ఆప్ పార్టీ కేబినెట్ నుండి తొలగించింది. మరి కేసీఆర్ కు వచ్చిన నొప్పేంది?