-కనీసం 15 రోజుల పాటు నిర్వహించాల్సిన అసెంబ్లీ సమావేశాలను కేవలం ఒక్కరోజు జరపడంపై శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నేత, యనమల రామకృష్ణుడు తప్పుపట్టారు
– ప్రజా సమస్యలపై ప్రశ్నలను ఎదుర్కోలేకే సీఎం ఇలా చేస్తున్నారని ఆయన విమర్శించారు
అసెంబ్లీ సమావేశాలను కేవలం ఒక్కరోజు నిర్వహించడం.. సీఎం జగన్ రెడ్డి పలాయనవాదానికి నిదర్శనమని శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు దుయ్యబట్టారు. చట్టసభలపై నిర్లక్ష్యానికి ముఖ్యమంత్రి నిలువుటద్దమని.. సమావేశాలను కనీసం 15 రోజుల పాటు నిర్వహించాలని టీడీఎల్పీ తరఫున డిమాండ్ చేశారు. జగన్ సీఎం అయ్యాక సగటున 20 నెలల్లో కనీసం.. 15 రోజులు కూడా సభ నిర్వహించలేదని ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా అసెంబ్లీని ఎన్నడూ గౌరవించలేదని, ఎమ్మెల్యేగా మూడేళ్లు కాకుండానే అసెంబ్లీని బాయ్ కాట్ చేసి అవమానించాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రతిపక్షాన్ని ఎదుర్కొనే ధైర్యం జగన్ రెడ్డిలో లేదన్న యనమల.. అసెంబ్లీ, కౌన్సిల్ ను ఎదుర్కోవాలంటే జగన్మోహన్ రెడ్డిలో సైకో ఫియర్ నెలకొందని విమర్శించారు.
బదులివ్వలేకే..
ప్రతిపక్షం లేవనెత్తే ప్రజా సమస్యలంటే భయంతో.. ఉద్దేశపూర్వకంగానే చట్టసభల్లో ప్రతిపక్షాలకున్న చర్చించే హక్కు కాలరాస్తున్నారన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు, నిత్యావసరాల ధరల పెంపు, ఎయిడెడ్ విద్యాసంస్థల సమస్య మొదలు.. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు, రైతుల కష్టాలు, బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లీం మైనారిటీ సబ్ కాంపోనెంట్ నిధుల మళ్లింపు వంటి ఎన్నో సమస్యలు రాష్ట్రంలో ఉన్నాయన్నారు. వీటికి తోడు స్థానిక సంస్థల ఎన్నికల్లో భయోత్పాతం, రాష్ట్రంలో జరుగుతున్న హింస విధ్వంసాలు, బీసీ జనగణన, మహిళలపై అరాచకాలు, పీఆర్సీ, సీపీఎస్ ఉద్యోగుల సమస్యలు, ఉద్యోగులకు 7 డీఏలు పెండింగ్, జీతాల చెల్లింపుల్లో ఆలస్యం, పెన్షన్లు రాక ఇక్కట్లు, బిల్లులు పెండింగ్ తో అభివృద్ది పనులన్నీ నిలిచిపోవడం వంటి ఇబ్బందులకు జగన్ వద్ద సమాధానాలు లేవన్నారు. అందుకే జగన్ కేవలం ఒక్కరోజు సమావేశాలు నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేశారు.