Suryaa.co.in

Andhra Pradesh

అప్పుల అసలు లెక్కలు చెప్పండి!

-ఆర్ధికమంత్రి బుగ్గనకు టీడీపీ నేత యనమల లేఖ
-రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గురించి తెలుసుకోవడం ప్రజల హక్కు

తేది. 28.10.2023
గౌరవ ఆర్థిక శాఖమాత్యులు శ్రీ బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి గారికి,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందని రాష్ట్ర ప్రజలందరూ నమ్ముతునారు. కాగ్ సంస్థ వారు 2021-22 ఆడిట్ నివేదికలో ఇచ్చిన గణాంకాలను చూసిన తరువాత గత ఆగస్టు 23, 2023న నేను ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ ఎస్.ఎస్. రావత్ గారికి ఒక లేఖ రాసి కొంత సమాచారాన్ని కోరాను. ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ప్రధాన ప్రతిపక్షనేతగా ఉన్న నాకు, ఆర్థిక శాఖ కార్యదర్శి నుండి ఏ విధమైన సమాధానం రాకపోవడం శోచనీయమని మీ దృష్టికి తీసుకు వస్తున్నాను.

కాగ్ (CAG) 2021-22 నివేదిక ప్రకారం మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తరువాత మూడేళ్ళలోనే రూ.3.25 లక్షల కోట్లు అప్పు చేశారని మరియు అప్పు /స్థూల ఉత్పత్తి నిష్పత్తి 40 నుండి 45 శాతం వరకు ఉందని చూసి ఆశ్చర్యపోయాను. ఐదు సంవత్సరాల పాలనలో తెదేపా ప్రభుత్వం రూ.1.39 లక్షల కోట్లు అప్పు చేస్తే ప్రతిపక్షంలో ఉన్న మీరు రాష్ట్ర పరిస్థితి గురించి అసెంబ్లీ సాక్షిగా ఎంత ఆందోళన చెందారో నాకు ఇప్పటికీ గుర్తుంది.

మూడు సంవత్సరాలలో రెండున్నర రెట్లు అప్పు చేయడమే కాకుండా ఎంత అప్పు చేశారనేది కాగ్ కూడా తన నివేదికలో మార్చుకునే పరిస్థితి వచ్చింది అంటే గణాంకాలను తప్పుగా చూపిస్తున్నారని అర్ధమౌతుంది. 2021-22 ఆడిట్ తరువాత సంవత్సరన్నర కాలంలో సుమారు రూ.1.25 లక్షల కోట్లు అప్పు చేశారు. అంటే నాలుగున్నర సంవత్సరాలలో 4.5 లక్షల కోట్లు అప్పుతో ఈ ప్రభుత్వం నడుస్తోంది.

ఇంతే కాకుండా 97 పబ్లిక్ సెక్టార్ సంస్థలకు గాను కేవలం 30 సంస్థలు మాత్రమే ఆడిట్ కు లెక్కలు సమర్పించాయని కాగ్ ఆక్షేపించింది. లక్ష కోట్ల రూపాయల అప్పును ప్రతి యేటా చేస్తూ వచ్చే సంవత్సరం నుండి (2024-25) సంవత్సరానికి రూ.50 వేల కోట్లకు మించిన చెల్లింపుల భారాన్ని ప్రజల మీద పెట్టారని కాగ్ చెబుతోంది.

ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వివరాలను తెలియజేయాలని కనీసం కాగ్ లెక్కలను నిర్ధారించాలని నేను ఆర్థిక శాఖ కార్యదర్శి గారిని కోరాను. ఆయన నిర్లిప్తత నా అనుమానాలను మరింత బలపరుస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గురించి తెలుసుకోవడం ప్రజల హక్కు. ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ లో ప్రతిపక్ష నాయకుడి హోదాలో మీకు నా విన్నపం :
1) 30.09.2023 నాటికి రాష్ట్ర అప్పుల వాస్తవ పరిస్థితిని ప్రజల ముందు ఉంచండి.
2) ఉద్యోగస్తులకు, కాంట్రాక్టర్లకు, విద్యుత్ సంస్థలకు మరియు మిగిలిన వారికి పెండింగ్ ఉన్న బకాయిలను ప్రజల ముందు ఉంచండి.
3) ఎస్సీ, ఎస్టీ, బిసి సబ్ ప్లాన్ లలో కేటాయించిన మొత్తాన్ని ఆ వర్గాలకు మాత్రమే సంబంధించిన పథకాలలో ఎంత ఖర్చు చేశారు? అందరికి వర్తించే పథకాలకు ఎంత ఖర్చు చేశారో ఈ 4 సంవత్సరాల గణాంకాలను ప్రజల ముందు ఉంచండి.

మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్థిక పరిస్థితులపై శ్వేత పత్రాన్ని ప్రచురించి గత ప్రభుత్వం కంటే ఎంతో మిన్నగా పరిపాలన కొనసాగిస్తామని మీరు చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. పైన కోరిన విషయాలను ప్రజా క్షేత్రంలో ఉంచగలిగితే ప్రభుత్వ పరిపాలనపై ప్రజలు బేరీజు వేసుకునే అవకాశం ఉంటుంది.
నా లేఖకు త్వరలోనే సమాధానం ఇస్తారని ఆశిస్తూ,
భవదీయుడు,

(యనమల రామకృష్ణుడు)
ప్రధాన ప్రతిపక్షనేత, ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్
పొలిట్ బ్యూరో సభ్యులు, తెలుగుదేశం పార్టీ
జత చేయడమైనది
ఆర్థిక కార్యదర్శి గారికి ఆగస్టు 23, 2023న రాసిన లేఖ, తగు సమాచారం నిమిత్తం.

LEAVE A RESPONSE