Suryaa.co.in

Andhra Pradesh

ఓట్ల కోసం వైసీపీ దొంగాట

• ఓటర్ల జాబితాలోని అవకతవకలు.. దొంగఓట్లు.. వైసీపీ ఆదేశాలతో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న అధికారులు, కిందిస్థాయి సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఎన్నికల కమిషన్ కు లేఖ రాశారు
• ఫామ్-6, ఫామ్-7 ల దుర్వినియోగం.. ఒకే డోర్ నెంబర్లోని ఓట్లను వివిధ పోలింగ్ బూత్ లకు మార్చడం.. చనిపోయిన వారి ఓట్లు తొలగించకపోవడం.. ఒకే వ్యక్తి పేరుతో ఒకటి కంటే ఎక్కువ ఓట్లు ఉండటం వంటి పలుసమస్యల్ని ఎన్నికల ప్రధానాధికారి దృష్టికి తీసుకెళ్లారు
• అభ్యంతరాలన్నీ పరిష్కరించాకే జనవరిలో తుది ఓటర్ల జాబితాను విడుదల చేయాలని, బూత్ లెవల్ ఆఫీసర్ మొదలు నియోజకవర్గ స్థాయి ఎన్నికల అధికారి.. సీఈవో (చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్) సర్టిఫై చేశాకే తుది ఓటర్ల జాబితా వెలువరించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు
– మొహమ్మద్ షరీఫ్ (టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, శాసనమండలి మాజీ ఛైర్మన్), పిల్లి మాణిక్యరావు (టీడీపీ అధికార ప్రతినిధి)

ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితాను అక్టోబర్ 30న అధికారులు విడుదచేశారని.. దాన్ని పరిశీలిస్తే మరణించిన వారి పేర్లు.. ఒకటికంటే ఎక్కువ ఓట్లు ఉన్నవారి పేర్లు తొలగించలేదని, డోర్ నెంబర్ ప్రకారం ఉండాల్సిన ఓట్లన్నీ ఒకే బూత్ లో ఉండకుండా..వేర్వేరు బూత్ లకు కేటాయించారని, ఫామ్-6 ప్రకారం కొత్తఓటర్లను చేర్చకుండా తప్పుల తడకగానే ముసాయిదా ఓట్ల జాబితాను విడుదల చేశారని..ఇలాంటి అనేక సమస్యల్ని ఎన్నికల కమిషన్ కు తెలియచేస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారని, ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, శాసనమండలి మాజీ ఛైర్మన్ మొహమ్మద్ షరీఫ్ తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం ఆయన టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు వారి మాటల్లోనే …

“ ఓటర్ల జాబితాలోని తప్పుల్ని సరిదిద్దాలని, అర్హులందరికీ ఓటుహక్కు కల్పించాలని టీడీపీ కిందిస్థాయి అధికారులతో పాటు, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధి కారికి కూడా పలుమార్లు విజ్ఞప్తిచేసింది. అనేకసార్లు ఏపీ ఎన్నికల అధికారికి లేఖలు అందించింది. ఎన్నికల ప్రధానాధికారి ఇచ్చే ఆదేశాలను కిందిస్థాయి అధికారులు.. కొందరు జిల్లా కలెక్టర్లు పూర్తిగా పెడచెవిన పెడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వైసీపీనేతల ఆదేశాలకు లోబడి కిందిస్థాయి అధికారులు గంపగుత్తగా ఫామ్-6, ఫామ్-7 దరఖాస్తుల్ని అప్ లోడ్ చేస్తున్నారు. గ్రామ, మండల, నియోజకవర్గస్థాయి అధికారులు.. జిల్లా కలెక్టర్లకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడమే తప్ప..సమస్యల పరిష్కారానికి అధికారయంత్రాంగం ఎలాం టి చర్యలు తీసుకోవడం లేదు. పరిస్థితి చేయిదాటిపోతోందని గ్రహించిన మీదట టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రంలోజరుగుతున్న ఓట్ల అక్రమాలపై నేరుగా కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయడం జరిగింది.

ఒకటి కంటే ఎక్కువ ఓట్లు ఉన్న ఓటర్ల ఇప్పటికీ 3 లక్షలకు పైగా ఉన్నారని.. వారిని ఎందుకు ఓటర్ల జాబితా నుంచి తొలగించలేదని, చనిపోయినవారి ఓట్లు ఎందుకు తొలగించలేదని ఎన్నికల కమిషన్ ను.. అధికారుల్ని టీడీపీ ప్రశ్నిస్తోంది. జనన మరణ జాబితాను అనుసరించి చనిపోయిన వారి ఓట్లు తొలగించే అవకాశం ఉన్నా కూడా అధికారులు ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అలానే టీడీపీకి పడే ఓట్లను ఉద్దేశపూర్వకంగానే బూత్ ల వారీగా చెల్లాచెదురు చేస్తున్నారు. ఒకే డోర్ నెంబర్లో ఉండాల్సిన ఓట్లను.. వివిధ పోలింగ్ బూత్ లకు మార్చడం.. ఒకే పోలింగ్ బూత్ లో ఉండాల్సిన ఓట్లను ఇష్టమొచ్చినట్టు మార్చడం చేస్తున్నారు.

భార్య ఓటు ఒకచోట.. భర్త ఓటు ఒకచోట.. తండ్రి బిడ్డల ఓట్లు వేరుచేయడం వంటి ఉదాహరణలు కోకొల్లలుగా ఉన్నాయి. ఫామ్-6 దరఖాస్తుల్ని దుర్వినియోగం చేస్తూ దొంగఓట్లు చేర్పిస్తున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఇదే పద్ధతిలో దాదాపు 25వేలకు పైగా దొంగఓట్లు చేర్పించారు. ఫామ్-7లు గంపగుత్తగా నమోదు చేస్తూ ఉరవకొండ, పర్చూరు, కొండెపి నియోజకవర్గాల్లో టీడీపీకి పడే సాంప్రదాయ ఓట్లను తొలగిస్తున్నారు. ఇతర నియోజకవర్గాల్లో కూడా ఈ సమస్య ఉంది. బీఎల్వోలతో వెరిఫికేషన్ చేయించకుండానే ఇష్టాను సారం ఓట్లు తొలగిస్తున్నారు.

ఈ విధంగా ఉన్న అనేక అభ్యంతరాలను పరిష్క రించాకే జనవరిలో తుది ఓటర్ల జాబితాను విడుదల చేయాలని ఎన్నికల కమిష న్ కు టీడీపీ అధినేత చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. బూత్ లెవల్ ఆఫీసర్ మొదలు నియోజకవర్గ స్థాయి ఎన్నికల అధికారి.. సీఈవో (చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్) సర్టిఫై చేశాకే తుది ఓటర్ల జాబితా వెలువరించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. తప్పుల తడకలుగానే మరలా ఓటర్ల జాబితాను విడుదలచేస్తే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం.. అధికార పక్షాన్ని ప్రోత్సహించడమే అవుతుందని కూడా మాజీ ముఖ్యమంత్రి ఎన్నికల కమిషన్ కు రాసిన లేఖలో అభిప్రాయపడ్డారు.” అని షరీఫ్ తెలిపారు.

వైసీపీ ఆదేశాలతోనే కొందరు అధికారులు, కలెక్టర్లు టీడీపీ కార్యర్తలు.. సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారు: పిల్లి మాణిక్యరావు
“ ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగితేనే నిజాయితీపరులు ప్రజలకు సేవ చేసే అవకాశం దక్కుతుంది. 2019 ఎన్నికల్లో అనుసరించిన తప్పుడు విధానాలు, రాజ్యాంగ వ్యతిరేక విధానాలతోనే మరలా అధికారంలోకి రావడానికి జగన్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే జగన్ రెడ్డి పరిపాలనపై అన్నివర్గాలు తీవ్ర ఆగ్రహం తో ఉన్నారు. ఈ నేపథ్యంలో తనకు ఓటమి తప్పదని తెలిసే జగన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో గెలవడానికి తప్పుడు మార్గాలు అనుసరిస్తున్నాడు. జగన్ రెడ్డి నేర ఆలోచనల్ని అమలు చేయడానికి కొందరు అధికారులు, కలెక్టర్లు నిస్సిగ్గుగా సహకరిస్తున్నారు.

తెలుగుదేశం కార్యకర్తలు.. సానుభూతిపరుల ఓట్లను గంపగుత్తగా తొలగించడానికే కొందరు కిందిస్థాయి సిబ్బంది.. అధికారులు ఇష్టా నుసారం ఫామ్-7 దరఖాస్తుల్ని దుర్వినియోగం చేస్తున్నారు. టీడీపీ ఇచ్చే ఫిర్యా దులపై స్పందించకుండా.. వైసీపీ ఫిర్యాదులపై అధికారులు ఉత్సాహంతో పనిచే స్తున్నారు. వాలంటీర్ల ద్వారా సేకరించిన సమాచారంతో సరిపోల్చి… కావాలనే టీడీపీ ఓట్లను తొలగిస్తున్నారు. ఒక ఇంటిలో ఉండే ఓట్లన్నీ ఒకే బూత్ లో ఉండాలని ఎన్నికల నిబంధనలు చెబుతుంటే.. వైసీపీకి కొమ్మకాస్తున్న అధికారు లు, కిందిస్థాయి సిబ్బంది అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు.

ఈ విధంగా కొందరు అధికారులు తప్పుల మీద తప్పులు చేస్తున్నా రాష్ట్ర ఎన్నికల కమిషన్ వారి విషయంలో ఎందుకు కఠినంగా వ్యవహరించడంలేదు? తెలంగాణ డీజీపీ ముఖ్యమంత్రి కాబోయే వ్యక్తిని కలిశాడని అక్కడి ఎన్నికల కమిషన్ సదరు డీజీపీని నిర్దాక్షణ్యంగా సస్పెండ్ చేసింది. అదే మాదిరి ఏపీ ఎన్నికల కమిషన్ తప్పులు చేస్తున్న అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదు? ఆధారాలు .. సాక్ష్యాలు ఉన్నా ఎందుకు ఉపేక్షిస్తోంది? ఓటర్ల జాబితాలోని అవకతవకలు.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న అధికారులు, సిబ్బందిపై టీడీపీ ఇచ్చిన ఫిర్యాదులపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకుందో కూడా తక్షణమే పూర్తి వివరాలు బయటపెట్టాలి.” అని మాణిక్యరావు డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE