-
ప్రకాశం బ్యారేజీని ఢీ కొట్టిన మూడు భారీ ఇనుప పడవలు
-
బ్యారేజీకి స్వల్పంగా పగుళ్లు
-
అందులో ఒకటి ఇరుక్కుపోయిన పడవ
-
భీతిల్లుతున్న బెజవాడ
-
బెజవాడను ముంచేయడమే లక్ష్యమా?
-
అవి ఎమ్మెల్సీ తలశిల, నందిగం అనుచరులవేనా?
-
వైసీపీ రంగులతో బ్యారేజీని ఢీకొట్టిన ఆ బోట్లు
-
అవి ఇసుక మోసుకువచ్చే భారీపడవలు
-
ఆ మూడిటికి అనుతులే లేవు
-
పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు
-
కూటమి కష్టాన్ని నీరుగార్చే కుట్ర
( మార్తి సుబ్రహ్మణ్యం)
నిండా మునిగిన బె‘జల’వాడ జనజీవ నాన్ని మళ్లీ గాడిలోకి పెట్టేందుకు వృద్ధాప్యం కూడా లెక్కచేయకుండా, సీఎం చంద్రబాబునాయుడు నవ యువకుడిలా సహాయ కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా నీళ్లలోకి దిగితే.. వైసీపీ మాత్రం బెజవాడ జనాలపై కుట్రకు ఊపిరిపోసిన ఘటన వెలుగుచూడటం కలకలం సృష్టిస్తోంది. తమను మళ్లీ నీటముంచేందుకు వైసీపీ కుట్ర తెలిసిన బెజవాడ జనం ఆగ్రహంతో రగిలిపోతున్నారు.
గత ఎనిమిది రోజుల నుంచి బె‘జల’వాడ జనం నీళ్లలోనే నానుతున్నారు. సీఎం నుంచి మంత్రులు, టీడీపీ కార్యకర్తల వరకూ వారికి ప్రత్యక్షంగా సహాయ కార్యక్రమాలు చేపడుతున్నారు. దేశంలోనే తొలిసారి డ్రోన్ల ద్వారా బాధితులకు ఆహారం అందిస్తున్నారు. డ్రోన్ల ద్వారానే బ్లీచింగ్ చల్లుతున్నారు. ఫైరింజన్లతో ఇళ్లకు వెళ్లి మురికినీటిని శుద్ధి చేస్తున్నారు. ఇళ్లలో పాడైపోయిన వస్తువులు, వాహనాలను రిపేరు చేయించేందుకు ఎక్కడెక్కడి నిపుణులను పిలిపిస్తున్నారు. ఈ యజ్ఞంలో సీఎం నుంచి మంత్రులు, అధికారులు, టీడీపీ నేతలెవరూ ఇళ్లకూ వెళ్లడం లేదు. ముఖ్యంగా నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడయితే, ఇంటికి వెళ్లకుండా బుడమేరు గండ్లు పూడ్చే పనిలో అక్కడే ఉండిపోయారు.
ఈ క్రమంలో కూటమి సర్కారు సహాయ చర్యల్లో విఫలమయిదంటూ బురద రాజకీయం చేస్తున్న వైసీపీ.. తాజాగా తెరలేపిన కుట్ర కోణంతో, బెజవాడ ఉలిక్కిపడింది. ప్రకాశం బ్యారేజీని వైసీపీ గుర్తులున్న మూడు భారీపడవలు ఢీకొట్టడంతో, బెజవాడవాసులు ఉలిక్కిపడ్డారు.
తీరా దానిని పోలీసులు, టీడీపీ నేతలు ఆరా తీస్తే.. ఆ పడవలన్నీ మాజీ ఎంపి నందిగం సురేష్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం అనుచరులవని తేలడంతో, వైసీపీ కుట్ర విజయవాడ వాసులకు అర్ధమయిపోయింది. బ్యారేజీకి జరిగిన నష్టానికి కూటమి సర్కారే కారణమన్న ఆరోపణలతో.. రాజకీయలబ్ది పొందవచ్చన్నదే వైసీపీ వ్యూహమని గ్రహించారు. దీనిని తొలుత కనిపెట్టిన మంత్రి కొల్లు రవీంద్ర, అందులోని కుట్రకోణాన్ని విశ్లేషిస్తున్నారు. రంగంలోకి దిగిన వన్‌టౌన్ పోలీసులు కూడా కేసు నమోదు చేసి, కుట్రను ఛేదించే పనిలో ఉన్నారు.
వరద ఉధృతికి ప్రకాశం బ్యారేజీ గేట్లకు భారీ పడవలు అడ్డుతగిలాయి. అందులో ఒకటి కౌంటర్ వెయిట్‌ను ఢీకొనడంతో విరిగిపోయింది. 67,68,69 గేట్లకు రెండు బోట్లు అడ్డుపడటంతో నీటి ప్రవాహం నెమ్మదించింది. 64వ గేటు దగ్గర ఉండేది స్వల్పంగా దెబ్బతినగా, 69వ గేటు దగ్గర ఉండేది పూర్తిగా మధ్యకు విరిగిపోయింది.
కాంక్రీట్ సిమెంట్ దిమ్మకు లోపల ఉండే ఇనుప చువ్వులు బయటకు కనిపిస్తున్నాయి. అది ఇరుక్కుపోగా, ఓటును మరో రెండు బోట్లు ఢీకొని ఆగకిపోయాయి. విచిత్రంగా ఈ మూడు పడవలూ.. ఒకదానికి మరొఓకటి కట్టేసి ఉండటంతో, కుట్ర కోణం తెరపైకి వచ్చేందుకు కారణమయింది. ఈ మూడు పడవలూ వైసీపీ నేతలవేనన్న ఆరోపణలు వెల్లువెత్తడంతో, సహజంగా ఈ వ్యవహారంలో కుట్ర కోణం ఉందన్న అనుమానాలు తెరపైకొస్తున్నాయి.
ఆ మేరకు ఆ భారీ పడవలన్నీ వైసీపీకి చెందిన నాయకులవేనని, అవి ఇసుక రవాణా చేసే భారీ ఇనుప పడవలని తేలింది. ముఖ్యంగా అందులో రెండు పడవలు.. మాజీ ఎంపి, ఇటీవలే అరెస్టయిన మాజీ ఎంపి నందిగం సురేష్ అనుచరులేవని పోలీసు, టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
కాగా వైసీపీ ఎమ్మెల్సీ, ఆ పార్టీ అధినేత జగన్‌కు కుడిభుజంగా వ్యవహరించే తలశిల రఘరాం బంధువు పడవ కూడా అందులో ఒకటని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఆ మేరకు తలశిల రఘురాంతో ఆ బోటు యజమాని కలసి ఉన్న ఫొటో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. తలశిల మేనల్లుడు కోమటి రామ్మోహన్‌కు చెందిన బోట్లను, మూడూ ఒకేసారి ప్రకాశం బ్యారేజీ మీదకు వదిలేశారంటున్నారు.
బ్యారేజీకి 12 లక్షల క్యూసెక్కుల వరద వస్తున్న సమయంలోనే ఈవిధంగా చేయడం ద్వారా, బ్యారేజీని కూల్చాలన్నదే అసలు కుట్ర అని సోషల్‌మీడియాలో కథనాలు రావడంతో కృష్ణా, గుంటూరు జిల్లా ప్రజలు వణికిపోతున్నారు. అసలు వీటికి ఎలాంటి అనుమతులు లేవని, మంత్రి కొల్లు రవీంద్ర చెబుతున్నారు.దీనివెనుక కచ్చితంగా వైసీపీ కుట్ర ఉందంటున్నారు. అటు సీఎం చంద్రబాబునాయుడు సైతం, దీని వెనుక కుట్ర ఉన్నట్లు తేలితే ఎవరినీ విడిచిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు.