-
కీలకనేతలను కూటమిలో ప్రవేశపెడుతున్న జగన్
-
సీమ తరహా కోవర్టు ఆపరేషన్
-
టీడీపీలో సాధ్యం కాకపోతే జనసేనలోకి
-
జనసేనలో కుద రకపోతే టీడీపీలోకి
-
జాబితా ప్రకారమే జంపింగులు
-
పరిశ్రమలు, మైనింగ్, శాండ్, కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల వలసల వెనుక భారీ వ్యూహం
-
టీడీపీ-జనసేనలోకి వైసీపీ నేతల చేరిక వెనుక భారీ స్కెచ్?
-
ఇంకా వైసీపీ నేతలు ఎందుకంటున్న కూటమి నేతలు
-
ఉన్నవారికే న్యాయం చేయలేకపోతే వలసనేతలెందుకు?
-
వచ్చేవారంతా ఎన్నికల ముందు వైసీపీకే వెళతారన్న వాదన
( మార్తి సుబ్రహ్మణ్యం)
కూటమిలో చిచ్చు పెట్టేందుకు వైసీపీ అధినేత జగన్ భారీ స్కెచ్ వేశారా? అందులో భాగంగా బడా నేతలు, వ్యాపారాలతో సంబంధం ఉన్న నేతలను కూటమిలో ప్రవేశపెట్టే, కోవర్టు ఆపరేషన్ కుట్రకు జగన్ తెరలేపారా? కూటమిలో చేరిన నాయకుల ద్వారా అందే సమాచారం ప్రకారం, భవిష్యత్తు వ్యూహం అమలుచేయనున్నారా? జగన్ హయాంలో పదవులు పొందిన నేతలు, కూటమి వైపు క్యూ కట్టడం వెనుక అసలు ఆంతర్యం ఇదేనా? వైసీపీ వర్గాల్లో జరుగుతున్న హాట్‌టాపిక్ ఇది.
జమిలి ఎన్నికలు రాబోతున్నాయి.. మళ్లీ మాదే అధికారం. మా కార్యకర్తలను వేధించే అధికారులను గుర్తుపెట్టుకుంటాం. కూటమి అధికారం శాశ్వతం అనుకోవద్దని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. ఇటీవలి కాలంలో అత్యంత ఆత్వవిశ్వాసంతో చేస్తున్న ప్రకటనల వెనుక, ధీమా ఏమిటని కూటమి నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 11 సీట్లకు పరిమితమైనప్పటికీ.. మళ్లీ అధికారంలోకి వస్తానన్న జగన్ ఆత్మవిశ్వాసంపై, కూటమిలో విస్మయం వ్యక్తమవుతోంది.
త్వరలో జనంలోకి రానున్న జగన్ తన పార్లమెంటు జిల్లా పర్యటన సందర్భంలో, కూటమి ఇచ్చిన హామీలను గుర్తు చేసి.. అవి అమలయ్యాయా? లేవా? అన్న సమాధానాలను జనంతోనే చెప్పించేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా అమ్మఒడి, ఫీజు రీఇంబర్స్‌మెంట్ అంశాలనే ప్రముఖంగా ప్రస్తావించడటంతోపాటు.. ఈ ఆరునెలలలో తాను అధికారంలో ఉండి ఉంటే, లబ్ధిదారుల అకౌంట్లకు ఎంత నగదు బదిలీ అయ్యేదన్న లెక్కలను వివరించనున్నారు. ఆ మేరకు ఆయన పర్యటనకు పార్టీ నేతలు సన్నాహాలు చేస్తున్నారు.
అయితే జగన్ పార్లమెంటు జిల్లాల పర్యటనలు పూర్తయ్యేలోపు.. తన పార్టీకి చెందిన ప్రముఖులను.. కూటమిలో చేర్పించే బ్రహ్మాండమైన కోవర్టు ఆపరేషన్‌కు, జగన్ తెరలేపినట్లు పార్టీ వర్గాల సమాచారం. తానంటే అమితంగా ప్రేమించిన వారు, విపక్షంలో ఉన్న టీడీపీని దారుణంగా తిట్టిపోసిన ప్రముఖలను టీడీపీ,జనసేనలో చేర్పించే ఎత్తుగడకు తెరలేపారు. వీరిని కూటమి పార్టీలో ప్రవేశపెట్టడం ద్వారా, అధికారపార్టీ ఎత్తుగడ తెలుసుకునే కోవర్టు కథకు తెరలేపారు.
ప్రధానంగా మైనింగ్, శాండ్, రియల్ ఎస్టేట్, సెటిల్‌మెంట్లు, రేషన్ దందా ద్వారా ఆదాయం పొందే వారిని కూటమి పార్టీల్లో ప్రవేశపెట్టాలన్న జగన్ ప్లాన్.. ఇప్పటివరకూ కొంత మేరకు మాత్రమే ఫలించింది. అయితే తన జిల్లాల పర్యటనలు పూర్తయ్యే లోపు, పూర్తిస్థాయిలో నేతలను కూటమిలో చేర్పించాలన్నది అసలు లక్ష్యమని, వైసీపీ కీలక నేత ఒకరు వెల్లడించారు.
కూటమి పార్టీల్లో చేరిన తర్వాత ఆయా నాయకులు స్థానికంగా బలపడటం, ఆ తర్వాత సొంత వర్గం ఏర్పాటుచేసుకుని.. కుమ్ములాట రాజకీయాలతో, కూటమి పరువును రోడ్డెక్కించడం ద్వారా, అధికార పార్టీని ప్రజల దృష్టిలో పలచన చేయడ ం, ఆ తర్వాత వారంతా తిరిగి ఎన్నికల ముందు.. వైసీపీలోకి వెనక్కి వచ్చేయడమే జగన్ వ్యూహబృందం అసలు లక్ష్యమంటున్నారు.
అంటే జగన్ కూటమిపై కోవర్టు ప్రయోగంలో, రాయలసీమ ఫ్యాక్షన్ విధానం అనుసరిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఆరకంగా కూటమిలో వైసీపీకి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లను చేర్పించే వ్యూహం ఖరారయిందని వైసీపీ సీనియర్ నేత ఒకరు పేర్కొన్నారు.
‘మేం అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన వారు కూటమి పార్టీలో చేరుతున్నారంటే, ఇదేం చిన్న విషయం అనుకోకండి. టీడీపీ-జనసేన విపక్షంలో ఉన్నప్పుడు బాబు-పవన్-లోకేష్‌ను తిట్టిన తిట్టు తిట్టని వారు మాత్రమే, కూటమి పార్టీలో ఎందుకు చేరుతున్నారో మీరే విశ్లేషించుకోండి. పోనీ వారంతా జగన్‌కు వ్యతిరేకులా అంటే కాదు. జగనంటే ప్రాణం పెట్టేవారు. మరి అలాంటి వారు పార్టీని వీడుతున్నారంటే దానికి కారణం తెలుసుకోండి. వీర ంతా కూటమిలో చేరేముందు జగన్‌ను మినహాయించి విజయసాయరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిపై విమర్శలకే పరిమితం అవుతున్నారంటే, మీకు ఇంకా అర్ధం కా పోవడమే ఆశ్చర్యంగా ఉంద’ని ఓ మాజీమంత్రి వ్యాఖ్యానించడం ఆసక్తికరం.
‘ మా పార్టీవాళ్లను చేర్చుకోవడం ద్వారా మమ్మల్ని బలహీన ం చేయాలని, పార్టీని నిర్వీర్యం చేయాలన్న కూటమి నేతల కోరికనే మాకు బలం. అసలు ఒక పార్టీలోని నేతలను చేర్చుకోవడం ద్వారా దానిని నిర్వీర్యం చేయడం ఎక్కడైనా సాధ్యమా? టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 23 మంది మా పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకుంది. నియోజకవర్గ ఇన్చార్జిలను చేర్చుకుంది. చివరకు ఎన్నికల్లో ఏమైంది? జగన్ గెలిచారు కదా? జూపూడి ప్రభాకర్‌రావు, కారెం శివాజీ టీడీపీ లోకి వెళ్లి మళ్లీ మా పార్టీలోకి వచ్చారు కదా? ఎదుటిపార్టీ వారిని చేర్చుకుని, దానిని నిర్వీర్యం చేయాలన్న వాళ్ల కోరికనే మాకు ఇప్పుడు బ్రహ్మాస్త్రం అవుతుంది. తర్వాత ఏమవుతుందో మీరే చూస్తారు కదా’’ అని సీమకు చెందిన మాజీ మంత్రి వ్యాఖ్యానించారు.
ఇంత విజయం వచ్చినా చేరికలు ఇంకెందుకు?
కాగా వైసీపీ నుంచి వస్తున్న వారిని టీడీపీ,జనసేనలో చేర్చుకుంటున్న వైఖరిపై, టీడీపీలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. జనసేనలో ఈ అభ్యంతరాలు అంత పెద్దగా లేకపోయినా, టీడీపీలో మాత్రం క్యాడర్ నుంచి చాలాకాలం నుంచి నిరనన ఎదురవుతోంది. అధికారంలో ఉన్నందున ఆ నేతలంతా అవసరాల కోసం చేరుతున్నారని, వైసీపీ అధికారంలో ఉండగా మాపై అక్రమ కేసులు పెట్టించిన మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు ఇప్పుడు మా పార్టీలో చేరితే మేం వారితో కలసి ఎలా పనిచేస్తాం? వారంతా అధికారంలో ఉన్నంతవరకూ పార్టీలో ఉంటారని, ఎన్నికల ముందు మళ్లీ వైసీపీకే వెళ్లిపోతారన్న విషయం నాయకత్వం విస్మరిస్తోందంటున్నారు.
అసలు ఇంత పెద్ద భారీ విజయం సమకూరిన తర్వాత కూడా, వైసీపీ నేతలను చేర్చుకోవలసిన అవసరం ఏం వచ్చిందని నాయకులు ప్రశ్నిస్తున్నారు. ‘మేం అధికారంలోకి వచ్చి ఆరునె లలయింది. ఇప్పటి పార్టీ కోసం పనిచేసే వారికి పదవులు లేవు. నియోజకవర్గ స్థాయిలో మార్కెటింగ్ కమిటీలు, దేవలాయ కమిటీలు వేయలేదు. ఎమ్మెల్యేలు చెబితే పదవులిచ్చే కాలం పోయింది. ఇక మాకే దిక్కులేకపోతే, కొత్త వారికి ఏం న్యాయం చేస్తారు? అసలు ఇప్పుడు కొత్తగా ఇతర పార్టీల నుంచి చేర్చుకోవలసిన పనిలేదు. బస్సు కెపారిటీకి మించి నడిస్తే ఏమవుతుంది? కూలిపోతుంది. మా నాయకత్వం వైసీపీ వాళ్లను చేర్చుకుని ఆ పార్టీని ఖాళీ చేయియించాలన్న ఆలోచన అమాయకత్వం. ఉన్నవారికి పదవులిస్తే మేమే రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తాం. అలాకాదని వైసీపీ నేతలను చేర్చుకుంటే, ఇక పార్టీకి నియోజకవర్గాల్లో జెండా పట్టే కార్యకర్తలు కూడా దొర కర’’ని ఓ టీడీపీ సీనియర్ నేత విశ్లేషించారు.