– జగన్ పాలనలో రైతులకు ఇబ్బందులు
– గత ప్రభుత్వంలో యూరియా కోసం కన్నీళ్లు పెట్టుకున్నారు
– పంటల బీమా పేరుతో రైతులకు జగన్ మోసం
– మండిపడ్డ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
అనంతపురం: వైసీపీ పాలనలో రైతులను నరకం అనుభవించేలా చేశారని, యూరియా కోసం రైతులు రాత్రిళ్లు క్యూలలో నిలబడ్డారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. అనంతపురం జిల్లా పర్యటనలో మంత్రి అచ్చెన్నాయుడు సూపర్ సిక్స్ – సూపర్ హిట్ సభాప్రాంగణం వద్ద మంత్రి మీడియాతో మాట్లాడారు. జగన్ ఉచిత పంటల బీమా పేరుతో రైతులను మోసం చేశారని, ఉద్యాన పంటలకు మద్దతు ధరలు ప్రకటించినా ఒక్క కేజీ కూడా కొనలేని చేతకాని వాడు జగన్ అని మండిపడ్డారు.
వ్యవసాయ, పశు సంవర్ధక, మత్స్యరంగాలను సర్వనాశనం చేసి, నేడు కూటమి ప్రభుత్వంపై అబద్ధపు ప్రచారాలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం రైతుకు అండగా నిలుస్తూ క్షణక్షణం పని చేస్తోందని, రైతులు ఇబ్బందిపడకుండా ముందుగానే యూరియా, విత్తనాలు, బీమా, మద్దతు ధరలతో సహాయాన్ని అందిస్తోందని అని తెలిపారు. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామం, రాష్ట్రం బాగుంటాయని, రైతును మోసం చేసిన వైసీపీ పాలనకు రైతులు గుణపాఠం చెప్పారని, రైతు సంక్షేమమే తమ ప్రధాన ధ్యేయమని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
సరళీకృతంగా యూరియా సరఫరా
వైసీపీ ప్రభుత్వ కాలంలో యూరియా కొరతతో రైతులు నానా ఇబ్బందులు పడ్డారని మంత్రి తెలిపారు. ఈ ఏడాది 81వేల హెక్టార్లలో అధికంగా పంటలు వేయడం మరియు వ్యవసాయంలో యూరియా వాడకాన్ని తగ్గించమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం వలన రైతులు భయపడి, భవిష్యత్ అవసరాల కొరకు యూరియాని అధికంగా కొనుగోలు చేయటం వలన యూరియా డిమాండ్ అనూహ్యంగా పెరిగిందన్నారు. మధ్యలో ఒక నెల డ్రై స్పెల్ వచ్చి తరువాత ఒకేసారి వర్షాలు విస్తారంగా పడటం వలన ఎరువుల అవసరం పెరిగి యూరియా సరఫరా పై ఒత్తిడి పెరిగిందని వివరించారు.
వాస్తవానికి ఖరీఫ్ సీజన్ కి 6.22 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, ఇప్పటికే 6.75 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేసామని తెలిపారు. నేటివరకు 5.97 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అమ్మకాలు జరగగా, ఇంకా 78 వేల మెట్రిక్ టన్నుల యూరియా షాపుల్లోనూ, ఆర్.ఎస్.కే. ల ద్వారా అమ్మకానికి సిద్దంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కృషితో కేంద్ర ప్రభుత్వం అదనంగా 49,367 మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి కేటాయించారని, దీంతో పూర్తి స్థాయిలో రైతులకు యూరియా అందుబాటులో ఉండి, యూరియా కొరత పూర్తిగా తీరిపోతుందన్నారు.
రాబోయే రబీ కాలానికి అవసరమైన 9.3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కూడా ముందస్తుగానే కేంద్రం ఇప్పటికే కేటాయించిందని తెలిపారు. 50% ప్రయివేటు డీలర్లు, 50% ప్రభుత్వ సంస్థల ద్వారా యూరియా గతంలో అమ్మగా, ప్రభుత్వానికి రవాణా ఖర్చులు పెరిగినప్పటికీ, 70% ప్రభుత్వం ద్వారా మరియు 30% ప్రయివేటు డీలర్ల ద్వారా యూరియా అమ్మకాలు ప్రారంబించామని అన్నారు. ఆర్ఎస్కే సేవలు మరింత మెరుగుపరిచామని, జగన్ ప్రభుత్వ హయాంలో ఒక సంవత్సరానికి సరాసరి ఆర్ఎస్కేల ద్వారా 255 కోట్ల విలువ చేసే యూరియా అమ్మకాలు జరగగా, కూటమి ప్రభుత్వ హయాంలో 2024-25 సంవత్సరంలో ఆర్ఎస్కేల ద్వారా 292కోట్ల విలువ చేసే యూరియాను సరఫరా చేసామని తెలియజేశారు.
విత్తనాలు, బీమా అందచేస్తూ ప్రోత్సాహాకాలు
వైసీపీ కాలంలో విత్తనాలు ఆలస్యంగా, తక్కువ నాణ్యతతో చేరాయని మంత్రి అన్నారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో 130 కోట్లు ఖర్చు చేసి 7.37 లక్షల మంది రైతులకు రాయితీతో 4.08 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అందించామని తెలిపారు. కంటింజెంట్ విత్తనాలను 80% రాయితీతో ఇచ్చామని అన్నారు. పంటల బీమా విషయంలో వైసీపీ హయాంలో రైతులు మోసపోయారని, ఉచిత బీమా అంటూ మోసగించి, ప్రీమియం చెల్లింపులు చేయకుండా వదిలేశారని మండిపడ్డారు. 2019 తరువాత పంటల బీమా పూర్తిగా విఫలం అయిందని, 2018-19 తరువాత ఏ రబీ సీజన్లో కూడా ఎలాంటి బీమా పరిహారం చెల్లించలేదని తెలిపారు.
ఉచిత పంటల బీమా అని చెప్పి 2020-21లో ఖరీఫ్ కి మాత్రమే అమలు చేసి చేతులు దులుపుకొన్నారని, తరువాత పీఎంఎఫ్బీవైతో కలిసి ఉచిత పంటల బీమా అమలు చేస్తాం అని ప్రకటించి, రైతుల వాటా, రాష్ట్రం వాటా రెండిటినీ రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది అని హామీ ఇచ్చి, 2022 ఖరీఫ్ తరువాత ప్రీమియం సబ్సిడీ చెల్లింపు చేయకుండా ఇచ్చిన హామీని గాలికి వదిలేసి, రైతులను నట్టేట ముంచారని, దీని కారణంగా 2022-23 రబీ నుండి రైతులకు బీమా పరిహారం సరైన సమయానికి చెల్లించక రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. కూటమి కూటమి ప్రభుత్వం రైతుకు అండగా నిలిచి, సమయానికి పరిహారం అందేలా చర్యలు తీసుకుంటోందని స్పష్టంచేశారు.
ఉద్యానవన పంట హబ్ గా రాయలసీమ
రాయలసీమ ప్రాంతాన్ని ఉద్యానవన పంటల హబ్ గా మార్చాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పాన్ని, గత ప్రభుత్వ పాలకులు సర్వనాసనం చేసారు. డ్రిప్ ఇరిగేషన్ సౌకర్యాన్ని రాయలసీమలో ప్రతి ఎకరానికి 100% ఇవ్వాలనే సంకల్పంతో 2014-19లో ప్రణాళికాబద్దంగా పనిచేసాము. అందులో భాగంగా డ్రిప్ పరికరానికి మా ప్రభుత్వం 90 శాతం రాయితీని కల్పించగా, మీ ప్రభుత్వం దానిని 70% కి తగ్గించింది. SC & STలకి కూటమి ప్రభుత్వం ఇచ్చిన 100% రాయితీని, 90%కి తగ్గించిందని తెలిపారు.
వైసీపీ పశు బీమా, ఆరోగ్య శిబిరాలను పూర్తిగా నిలిపివేసింది
పశు బీమా పథకాన్ని, పశు ఆరోగ్య శిభిరాలను వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసి మూగ జీవాల ఉసురు తీశారు. కూటమి ప్రభుత్వం 13957 పశు ఆరోగ్య శిబిరాలను నిర్వహించి, సకాలంలో మూగ జీవాలకు ఉచిత వైద్యం, మందులు సరఫరా చేశామని తెలిపారు. సీపీ ప్రభుత్వం మత్స్యకారులను దెబ్బతీసింది. కానీ కూటమి ప్రభుత్వం సముద్ర వేట నిషేధ కాల భృతిని కుటుంబానికి రూ.10,000 నుండి రూ.20,000 లకు పెంచాం. తద్వారా, అర్హులైన 1,21,433 మంది మత్సకారులకు 242.8కోట్లు చెల్లించామని తెలిపారు