– పార్లమెంట్ లో ఎంపీ విజయసాయి రెడ్డి కూనిరాగాలపై అమరావతి బహుజన జెఎసి ధ్వజం
25 మంది ఎంపీలను గెలిపిస్తే, కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పిన వైకాపా పార్టీ రెండున్నరేళ్లుగా హోదా మాట పూర్తిగా మరిచిపోయిందని, కేంద్రం మెడలు వంచటం మానేసి, తన మెడలు వంచిందని అమరావతి బహుజన జెఎసి అధ్యక్షులు పోతుల బాలకోటయ్య ఆరోపించారు.
మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ హోదా వస్తే పరిశ్రమలు వస్తాయని, పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయని నమ్మ పలికిన మాటలను వమ్ము చేశారనే ఏపీ ప్రజల ఆగ్రహం నుండి తప్పించుకునేందుకు పార్లమెంటులో ప్రత్యేక హోదా పై ఎంపీ విజయసాయిరెడ్డి కూనిరాగాలు తీసినట్టు తెలిపారు. మేము హోదా మర్చిపోలేదని చెప్పేందుకే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎంపీ విజయసాయిరెడ్డి హోదా పై రెండు మాటలు పేలవంగా అడిగినట్లు అభివర్ణించారు.
భిక్షాటన మాటలతో ప్రత్యేక హోదా, విభజన హామీలు రావని, విభజన చట్టం ఇచ్చిన హామీలను హక్కుగా సాధించుకుంటేనే సాధ్యం అని ఆయన పేర్కొన్నారు.కేంద్రంతో తలపడితే హోదా వస్తుంది కానీ, తలలూపితే హోదా రాదని బాలకోటయ్య ఎంపీ విజయసాయి రెడ్డికి హితవు చెప్పారు.హోదా, ప్యాకేజీ రెంటికీ ద్రోహం చేశారని గుర్తు చేశారు. 24 గంటలూ హోదాపై గత ప్రభుత్వ తప్పిదాలను నెమరువేసుకుంటూ రాజకీయాలు చేయటం తప్ప హోదా కోసం వైకాపా ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. మరో ప్రత్యేక హోదా ఉద్యమానికి తెలుగు ప్రజలు నడుం కట్టాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.