– మంత్రి సుభాష్
అమరావతి: విషప్రచారాలను చేయడంలో వైసీపీ విష వృక్షంగా తయారైందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని శెట్టి బలిజ సామాజికవర్గాన్ని ఓసిల్లో చేరుస్తున్నారంటూ వైసీపీ కోనసీమ జిల్లా అధ్యక్షడు చీర్ల జగ్గిరెడ్డి చేస్తున్న అవాస్తవ ప్రచారాన్ని మంత్రి ఖండించారు.
మంగళవారం వెలగపూడి సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ జగ్గిరెడ్డి అవగాహన రాహిత్యంతో అసత్య ప్రచారాలు చేస్తున్నారని మంత్రి సుభాష్ మండిపడ్డారు. మూడు పర్యాయాలు ఎమ్మెల్యే గా పని చేసిన జగ్గిరెడ్డి అవగాహన లోపం ఉందనేది ఆయన మాటలతీరుతో అర్ధమవుతోందన్నారు. వైసీపీ జిల్లా అధ్యకుడిగా ఉన్న వ్యక్తి కనీసఅవగాహన లేకుండా మాట్లాడడం శోచనీయమన్నారు.
శెట్టి బలిజల గురించి మాట్లాడే నైతిక అర్హత జగ్గిరెడ్డికి లేదని సుభాష్ స్పష్టం చేశారు. ఫొటోలతో ప్రచారం చేసుకోవడమనేది వైసీపీ నాయకులకు అలవాటు అని, తమకు వారిలా ఫోటోలు పిచ్చి లేదని మంత్రి తెలియజేశారు. ఫోటోల పిచ్చితోనే 11 స్ధానాలకే పరిమితమైన వారిలో జ్ఞానోదయం రావడం లేదని సుభాష్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తమ ధోరణిని మార్చుకోకపోతే ఒకటికే పరిమితం కావలసి వస్తుందన్నారు.