Suryaa.co.in

Andhra Pradesh

అధికార జులుంతోనే జోగి రమేష్ అక్రమాలు

– అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా వైసిపి నేతలు
– కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే “పిల్లి”

కాకినాడ రూరల్: అగ్రిగోల్డ్ బాధితుల పక్షాన నిలబడతామని 2019కి ముందు ఊరూరా తిరిగి ఎన్నికల ప్రచారంలో చెప్పిన వైసీపీ నేతలు అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్ భూములను స్వాహా చేశారని,అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా వైసిపి నేతలు నిలుస్తున్నారని నియోజక వర్గ కో ఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణ మూర్తి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి విమర్శించారు.

బుధవారం జోగి రమేష్ అక్రమాలపై టిడిపి రాష్ట్ర కార్యదర్శి, నియోజకవర్గ కో ఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణ మూర్తి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి తమ కార్యాలయం నుండి పత్రికా ప్రకటన విడుదల చేశారు.అధికారాన్ని అడ్డుపెట్టుకుని జోగి రమేష్ కుటుంబసభ్యులు చేసిన అక్రమాలు పుట్టలోనుంచి పాములు బయటకు వచ్చినట్లు ఒక్కోటి బయటకు వస్తున్నాయని అన్నారు.

అగ్రిగోల్డ్ భూముల అన్యాక్రాంతంపై అగ్రిగోల్డ్ యాజమాన్యం ఫిర్యాదుపై పోలీసు అధికారులు సుదీర్ఘ విచారణ తర్వాత చర్యలు తీసుకోవడం జరిగిందని విజయవాడ రూరల్ లోని అంబాపురం గ్రామంలో అగ్రిగోల్డ్ కు ఉన్న భూములు ఈడీ అటాచ్మెంట్ లో ఉన్నాయని అందుకు సంబంధించి 14.08.2018 న జీవో నెం.117, 17.10.2019 న ఇచ్చిన జి ఓ నెం.133 లో స్పష్టంగా ఆదేశాలు ఉన్నట్లు తెలిపారు.

విజయవాడ రూరల్ లోని అంబాపురం గ్రామంలో సీఐడి ఎటాచ్మెంట్లో ఉన్న భూమిని జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్, రమేష్ బాబాయ్ జోగి వెంకటేశ్వరరావు పేర్ల మీద సర్వే నెం.88లోని 2160 చ.గ. భూమిని కొనుగోలు చేశారని … కొనుగోలు చేసిన భూమి రికార్డులు తారుమారు చేసి సర్వే నెంబరు కూడా మార్చేశారన్నారు. వారు కొనుగోలు చేసిన సర్వే నెం.88లోని భూమిని సర్వే నెం.87లోకి మార్చాలంటూ 29.04.2023న జోగి రమేష్ కుమారుడు రాజీవ్, వెంకటేశ్వరరావులు స్వీయ దిద్దుబాటు దస్తావేజులంటూ దరఖాస్తు చేసుకుని రికార్డులు మార్పించుకున్నారన్నారు.వారు ఈ భూమిని 31.05.2023న పడిగిపాటి సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులకు విక్రయించడం జరిగిందన్నారు.

ఈ భూమి వ్యవహారంలో అడుగడుగునా జోగి రమేష్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడని, గ్రామ సర్వేయర్ దేదీప్య ఎటువంటి సర్వే నిర్వహించకముందే సర్వే చేసినట్లు రికార్డులు కూడా ఆమె లాగిన్ ద్వారానే అప్లోడ్ చేసి సర్వే పూర్తి చేసినట్లు రికార్డులు సృష్టించారన్నారు.సర్వే సమయంలో సరిహద్దు దారులైన అద్దేపల్లి కిరణ్, రాంబాబులకు నోటీసులు ఇచ్చి వాళ్లు కూడా నిర్థారించినట్లు చెప్పారని వాస్తవానికి వారికి ఆ సర్వే నెంబర్లో భూమి కూడా లేదని ఎటువంటి నోటీసులు ఇవ్వలేదని, వారు నిర్ధారించలేదని అధికార దుర్వినియోగానికి పాల్పడి అగ్రిగోల్డ్ భూములను దక్కించుకోవడంతోపాటు సర్వే నెంబర్లు మార్చి విక్రయించారని ఈ అక్రమాలపై అగ్రిగోల్డ్ సంస్థ ఫిర్యాదుతోనే ఏసీబీ అధికారులు దర్యాప్తు జరిపి చట్టప్రకారమే జోగి రాజీవ్ ను అదుపులోకి తీసుకున్నారని ఇందులో ఎటువంటి రాజకీయ జోక్యం లేదని పిల్లి దంపతులు పేర్కొన్నారు.

LEAVE A RESPONSE