Suryaa.co.in

Andhra Pradesh

చంపుతామంటూ పేదలకు వైసీపీ నేతల బెదిరింపులు!

• ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇప్పిస్తామంటూ భారీ టోకరా..
• చదవులేదని మరదలి ఇంటిని, పొలాన్ని కొట్టేసేందుకు బావ కుట్ర
• సమస్యలపై నేతలకు అర్జీదారుల వినతి.. పరిష్కరించాలని వేడుకోలు

మంగళగిరి: తనకు రావాల్సిన డబ్బులు ఇవ్వమని అడిగితే మనిషిని పెట్టి చంపిస్తానని తుళ్లూరు మండలానికి చెందిన వైసీపీ నాయకుడు అలోకం సురేష్ అనే వ్యక్తి బెదిరిస్తున్నాడని.. గుంటూరు జిల్లా రాయపూడి గ్రామానికి చెందిన కె. కొండలరావు తన ఆవేదనను వ్యక్తం చేశారు. బెదిరింపులపై ప్రజాదర్బార్ లో ఫిర్యాదు చేస్తానని చెప్పగా.. ప్రజాదర్భార్ లో కాకుంటే ఎవరికైనా చెప్పుకోమని.. తనను ఎవరూ ఏమి చేయలేరని.. ఇంకోసారి తన కంటికి కనిస్తే ప్రాణాలు దక్కవని హెచ్చరించాడని ఆందోళన వ్యక్తం చేశారు.

అతనిపై చర్యలు తీసుకోవాలని సోమవారం తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ఇక్కడి కేంద్ర కార్యాలయంలో జరిగిన ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమంలో నేతలు మాజీ మంత్రి కేఎస్. జవహర్, టీడీపీ బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ బుచ్చిరాంప్రసాద్, ఏపీ మార్క్‌ఫెడ్‌ చైర్మన్ కర్రోతు బంగార్రాజులకు అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేశారు. తనకు రావాలసిన డబ్బులు ఇప్పించాలని వేడుకున్నారు.

• పల్నాడు జిల్లా మాచర్ల మండలం రాయవరం గ్రామానికి చెందిన కామిశెట్టి లక్ష్మీ నరసమ్మ గ్రీవెన్స్ లో విజ్ఞప్తి చేస్తూ.. తన భూమిలో పత్తి పంటను నాశనం చేసి తమను చంపి తమ భూమిని కొట్టేసేందుకు వైసీపీ నేతలు కుట్ర చేస్తున్నారని.. వారిపై చర్యలు తీసుకోవాలని గ్రీవెన్స్ లో నేతలను కోరారు.

• కడప జిల్లా రైల్వే కోడూరు మండలం రామచంద్రానగర్ కు చెందిన లింగమయ్య, రామాంజనమ్మలు విజ్ఞప్తి చేస్తూ.. గండికోట రిజర్వాయర్ మునక ప్రాంతంలో తమ గ్రామం ఉందని.. అయితే తమకు ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజ్ చెక్కులు రాకపోవడంతో వాటిని ఇప్పిస్తానని చెప్పి కడప జిల్లా ఆఫీసులో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ నరేంద్ర, సింహాద్రిపురం మండల తహశీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న గంగరాజులు తమ వద్ద రూ. 7,50,000 నగదు తీసుకుని మోసం చేశారని.. వారిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.

• తనకు చదువురానికి కారణంగా తనతో తన బావ దొంగ సంతకాలు పెట్టించుకుని తన పొలాన్ని, ఇంటిని కొట్టేసేందుకు కుట్ర చేస్తున్నాడని… పొలంలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నాడని.. దీనిపై విచారించి తనకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం కరివేన గ్రామానికి చెందిన తిప్పగారి లక్ష్మమ్మ నేతలకు విన్నవించుకొన్నారు.

• కర్నూలు జిల్లా కోడుమూరు మండలం అమడగుంట్ల గ్రామానికి చెందిన పలువురు గ్రామస్తులు గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేస్తూ.. పల్లెవెలుగు కార్యక్రమంలో భాగంగా గ్రామంలో సిమెంట్ రోడ్ల నిర్మాణంకు తీర్మాణం చేయగా.. మంజూరైన సిమెంట్ రోడ్లను అవసరం ఉన్న చోట కాకుండా.. ఇదివరకు వేసిన సిమ్మెంట్ రోడ్లపైనే మళ్లీ నిర్మించేందుకు అధికారులు, సర్పంచ్ శంకుస్థాపనలు చేశారని.. దానిని అడ్డుకోవాలని లేదంటే నిధులు దుర్వినియోగం అవుతాయని.. అవసరమైన చోట్ల సిమెంట్ రోడ్లను నిర్మించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

• రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ మాదిరి రక్షణ చట్టాన్ని అమలు చేయాలని కోరుతూ.. ఏపీ రజక ఎస్సీ సాధన చైతన్య సమితి సభ్యులు పలువురు గ్రీవెన్స్ లో నేతలను కలిసి విన్నవించారు.

• తమ వద్ద పొలాన్ని కౌలుకు తీసుకుని కౌలు సమయం ముగిశాక భూమిని తమకు అప్పగించకుండా అనంతకోటి శ్రీ హరి అనే వ్యక్తి తమను ఇబ్బంది పెడుతున్నాడని.. ఇతను వైసీపీకి చెందిన వ్యక్తి అని.. అధికారుల కూడా అతనికే సహకరిస్తున్నారని. తమ భూమిని తమకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని ఏలూరు జిల్లా టి. నరసాపురం మండలం కొత్త గూడెం గ్రామానికి చెందిన మాధవరావు, ప్రసాద్ లు విజ్ఞప్తి చేశారు.

LEAVE A RESPONSE