Suryaa.co.in

Andhra Pradesh

వాలంటీర్లను వైసీపీ నేతలు బానిసల్లా చూస్తున్నారు

-ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా అధికార యంత్రాంగం
-కొంతమంది ఐఏఎస్‌, ఐపీఎస్‌ వ్యవస్థల ప్రతిష్ట దిగజార్చారు
-జగన్‌ గులకరాయి డ్రామా ప్రజలకు తెలిసిపోయింది
-వైసీపీ నేతలపై ఎన్నికల ప్రధానాధికారికి వర్ల రామయ్య ఫిర్యాదు

ఎన్నికల నిభంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పలువురు అధికారులు, వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్‌ కుమార్‌ మీనాను మంగళవారం వెలగపూడిలోని ఆయన కార్యాలయంలో కలిసి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. అనంతరం టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మీడియా సమావేశంలో మాట్లాడారు.ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నా ఇంకా కొంతమంది అధికారులు జగన్‌ సేవలో తరిస్తున్నారు.

ఐఏఎస్‌, ఐపీఎస్‌ వ్యవస్థకు ఒకప్పుడు సమాజంలో గౌరవం ఉండేదని, నేడు వారు చేసే పనులతో దిగజారుతోందన్నారు. విద్యాశాఖ ప్రిన్పిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ ప్రకాశ్‌ జగన్‌ దగ్గర మోకాళ్లపై కూర్చుని మాట్లాడుతారు. ఆయన ఎన్నికల సమయంలో విద్యార్థుల తల్లితండ్రులతో మీటింగ్‌ నిర్వహించేందుకు ప్రయత్నం చేస్తే ఎన్నికల కమిషన్‌ జోక్యం చేసుకుని అడ్డుకుంది. మళ్లీ ఈ నెల 23న తల్లితండ్రులతో సమావేశం నిర్వహిస్తారంట.

ఈ సమయంలో మీటింగ్‌ నిర్వహించాల్సిన అవసరం ఏంటి? వైసీపీకి ఓటేయమని ప్రవీణ్‌ ప్రకాశ్‌ చెబుతారా? అని ప్రశ్నించారు. మండపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులు, కనిగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాలంటీర్లతో సమావేశం నిర్వహించి వారందరినీ రాజీనామా చేయమంటున్నారు. వాలంటీర్ల వ్యవస్థను ప్రజలకు సేవ చేసేందుకు కాకుండా పార్టీకి సేవ చేసేందుకే పెట్టారని వైసీపీ నేతలే చెబుతున్నారు. వాలంటీర్లను వైసీపీ నేతలు బానిసల్లా చూస్తున్నారు. వారికి ఆత్మగౌరవం ఉండదా? అని ప్రశ్నించారు.

గులకరాయి డ్రామా తేలిపోయింది
జగన్‌ గులకరాయి డ్రామా ప్రజలకు తెలిసిపోయింది, సీఎంని గులకరాయితో ఎవరైనా చంపగలరా? నాడు కోడికత్తి డ్రామా ఆడారు, నేడు గులక రాయి డ్రామా ఆడుతున్నారు. దాడి జరిగిన రోజు ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా వైసీపీ నేతలు రోడ్లపై ధర్నాలు ఎలా చేస్తారు? చట్టం, రాజ్యాంగం అంటే వైసీపీ నేతలకు గౌరవం ఉండదా? వాళ్లు ధర్నా చేస్తుంటే విజయవాడ ఏసీపీ, సీఐ కళ్లప్పగించి చూస్తున్నారు. అలాంటి అధికారులకు ఎన్నికలు సక్రమంగా నిర్వహించే సామర్థ్యం ఉందా? వారిని ఎన్నికల విధుల నుంచి తొలగించాలని సీఈవోను కోరాం. వీటిపై ఆయన సానులకూలంగా స్పం దించారు. జగన్‌పై రాయి ఎవరూ విసరలేదు, గజమాలకు ఉన్న ఎదురు బొంగులు తగిలి ఆయనకు గాయమైంది. కానీ ఎవరో రాయి విసిరి ఆయనపై హత్యాయత్నానికి పాల్పడ్డట్టుగా క్రియేట్‌ చేసి ప్రజ ల్లో సానుభూతి కోసం నాటకాలాడుతున్నారు. జగన్‌ డ్రామాలన్నీ ప్రజలకు తెలుసని జగన్‌ ఇకనైనా మాయామశ్చంద్రుడిలా వ్యవహరించడం మానుకోవాలని వర్ల రామయ్య హితవు పలికారు. ఈసీని కలిసిన వారిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కె.ఎస్‌.జవహర్‌, మాజీ ఎమ్మెల్సీ ఏ.ఎస్‌.రామకృష్ణ, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్‌ రఫీ, టీడీపీ నేత మన్నవ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE