బద్వేల్ ఉప ఎన్నికలో నైతికంగా ఓడిన వైసీపీ.. కాదు ఓడించిన బీజేపీThe YCP that lost morally in the Badwell by-election .. not the defeated BJP
.అధికార పార్టీ వైసీపీకి భారీ మెజారిటీ వస్తుందేమో! ముఖ్యమంత్రి జగన్‌కు అత్యంత ప్రజాదరణ ఉందని చెప్పుకోవడానికి మెజారీటీ సంఖ్య ఉపయోగపడుతుందేమో! కానీ బద్వేల్ ఉప ఎన్నికలో అధికార వైసీపీ నైతికంగా ఓడిపోయింది. ఇది రొటీన్ స్టేట్‌మెంట్ కాదు. రాజకీయ పరిశీలకులు చెబుతున్న మాట. ఇది అధికార పార్టీకి మచ్చ తెచ్చేదే తప్ప.. గౌరవం పెంచేది కాదనంటున్నారు. నైతికంగా ఎందుకు ఓడిందంటారా? పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా… ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లాలో పార్టీకి అంతులేని ఆదరణ ఉందని బలంగా భావిస్తున్నా… ఉప ఎన్నికలో ప్రభుత్వాన్ని ప్రజలు దీవిస్తారని పార్టీ నాయకత్వం భావిస్తున్నా… ఇవన్నీ బయటకు చెబుతున్న గొప్పలే తప్ప, వాస్తవాలు కాదని ఉప ఎన్నిక పోలింగ్ జరిగిన తీరు చెప్పకనే చెప్పింది.
మధ్యాహ్నం తర్వాత దొంగ ఓటర్లు పోటెత్తి ఓట్లేయడానికి ‘సైక్లింగ్’ ప్లాన్ చేశారంటే.. ప్రజల్లో ఆదరణ లేదని, జనం కర్రు కాల్చి వాత పెడతారనే భయం అధికార పార్టీ నాయకత్వాన్ని వెంటాడిందని చిన్నపిల్లలకూ సులభంగా అర్థమవుతుంది. స్థానికంగా పెద్దగా బలం లేకుండా బరిలోకి దిగిన బీజేపీ అభ్యర్థి పనతల సురేష్ నియోజకవర్గంలోని పలు బూతులు సందర్శించి దొంగ ఓటర్లను గుర్తించారు. వారు తీసిన వీడియోల్లో.. దొంగ ఓటర్ల ‘సైక్లింగ్’ను ప్రపంచం ముందు ఉంచారు. ప్రజల్లో లేని ఆదరణను ఉందని చూపించుకోవడానికి అధికార వైసీపీ తాపత్రయపడుతున్న తీరును ఆ వీడియోలు ప్రతిబింబించాయి. ప్రభుత్వం పట్ల ప్రజల్లో అంతులేని ఆదరణ ఉందని వైసీపీ నాయకత్వం బలంగా నమ్మితే… ‘సైక్లింగ్’ అప్రతిష్టను మూటగట్టుకోవాల్సిన అవసరం ఏమి వచ్చిందంటూ రాజకీయ పరిశీలకులు సంధిస్తున్న ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు.
ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులు పంచకుండా, సైక్లింగ్ చేయకపోయినా వైసీపీ ఓడిపోతుందని ఎవరూ భావించడం లేదు. తెలుగుదేశం పార్టీ పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించిన మరుక్షణం… బద్వేల్ ఉప ఎన్నికలో అధికార పార్టీ విజయం అత్యంత సులువు అని, మెజారిటీ కూడా భారీగా ఉంటుందని అంచనా వేశారు. కానీ బీజేపీ అభ్యర్థి పనతల సురేష్ రోజురోజుకూ పుంజుకోవడం, బద్వేల్‌కు ప్రభుత్వం చేసిందేమీ లేదని గళమెత్తడం, అధికార పార్టీ నేతల భూకబ్జాల మీద విరుచుకుపడటం, వైసీపీ స్థానిక నాయకత్వం పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉండటం, అభివృద్ధి ఆనవాళ్లు నియోజకవర్గంలో కనిపించకపోవడం, ఛిద్రమయిన రోడ్లు ప్రభుత్వం చేతకానితనానికి సాక్ష్యంగా నిలవడం.. బీజేపీ అభ్యర్థి సురేష్ గ్రాఫ్‌ను పెంచాయి.
నామినేషన్ దాఖలు చేసిన మరుక్షణం నుంచి నింతరాయంగా ప్రజల్లో ఉండటం బీజేపీకి కలిసొచ్చాయి. స్థానికంగా పెద్దగా క్యాడర్ లేకపోయినా, విద్యార్థి నేతగా ఆదరణ పొందిన వాడు కావడంతో రాష్ట్రం నలుమూల నుంచి విద్యార్థులు, యువకులు వచ్చి అంకితభావంతో, సొంత ఖర్చులతో పనిచేయడం పార్టీ ‘విజిబులిటీ’ని పెంచింది. భారీగా ఓట్లు రాబట్టులేకపోయినా బీజేపీ ప్రతిష్ట మాత్రం పెరిగింది. ఇంత చేసిన బీజేపీ అభ్యర్థి సురేష్‌కు విజయం దక్కలేదు. గౌరవప్రదమయిన ఓట్లతో సరిపెట్టుకోవాల్సిందే. కానీ, అధికార యంత్రాంగం మొత్తం యథాశక్తి సహకరించడంతో అధికార వైసీపీకి భారీ విజయం దక్కినా.. నైతికంగా ఓడించడంలో బీజేపీ సక్సెస్ అయింది.
గట్టిగా నిలబడితే, పోటీలో ఉన్న అభ్యర్థి చిత్తశుద్ధితో పనిచేస్తే, అధికార పార్టీ వెదజల్లే కాసులకు అమ్ముడుపోని సొంత వ్యక్తిత్వం, ప్రజల కోసం పనిచేయాలనే గట్టి సంకల్పం ఉంటే.. అధికారాన్ని, డబ్బును కాదని ప్రజలు ఆదరిస్తారని వైసీపీ నాయకత్వం బద్వేల్ ఉప ఎన్నికలో అనుసరించిన దొంగదారులు రుజువు చేశాయి.
– రఘువంశీ