– ప్రజలతో మమేకం..చేతగాని ప్రభుత్వంపై ఆగ్రహం
-మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ విస్తృత పర్యటన
జగన్ ప్రభుత్వం బలవంతంగా వసూలుచేస్తోన్న వన్‌టైమ్ సెటిల్‌మెంట్ ని ప్రజలు కట్టాక, అందరి పెన్షన్, రేషన్‌కార్డులు పీకేస్తారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఓటీఎస్ స్వచ్ఛందం అని ఫేక్‌మాటలు చెబుతున్న ప్రభుత్వం-అధికారులకు టార్గెట్ ఎందుకు విధించిందని ఆయన ప్రశ్నించారు.
నియోజకవర్గంలో ప్రతీ ఊరు, ప్రతీ వీధి, ప్రతీ మనిషిని కలవాలనే లక్ష్యంతో టిడిపి జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన పర్యటనలో భాగంగా… బుధవారం, గురువారం మంగళగిరి, తాడేపల్లి సందర్శించారు. నడుస్తూనే అన్నికాలనీలు, వీధులు, గల్లీలోకి వెళ్లి ప్రజలతో మమేకమయ్యారు. వారి సమస్యలు విని చలించిపోయారు. ప్రజాసమస్యలు గాలికొదిలేసిన చేతగాని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మంగళగిరి టౌన్ లోని 15,16. 19, 20, 24 వార్డుల్లో,గురువారం తాడేపల్లిలోనూ పర్యటించారు. ఇటీవల మరణించిన కార్యకర్తలు, నాయకుల ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. చేనేత షెడ్డులు, చేనేత కార్మికుల ఇళ్లకి వెళ్లి సమస్యలు ప్రత్యక్షంగా చూశారు.
ఈ సందర్భంగా చేనేత కార్మికులు మాట్లాడుతూ ఇళ్లలో మగ్గాలు ఉంటే మాత్రమే నేతన్న నేస్తం ఇస్తున్నారని, తమలో 90 శాతం మందికి సొంత మగ్గాలు లేవని వాపోయారు. ముడి సరుకు రేట్లు, యార్న్ , కెమికల్స్ రేట్లు రెట్టింపు అయ్యాయని, కరోనా, పెరిగిన రేట్లు కారణంగా చేనేత రంగం పూర్తిగా దెబ్బతిందని లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు. మీ సమస్యలన్నీ కళ్లారా చూశానని, పరిష్కారం కోసం కలిసి పోరాడదామని లోకేష్ భరోసా ఇచ్చారు.
సమస్యల్లో జనం… పట్టించుకోని ప్రభుత్వం
మంగళగిరిలో మహిళలు, చిరు వ్యాపారులు నారా లోకేష్ వద్ద తమ సమస్యలు ఏకరువు పెట్టారు. ప్రజలు ఎంత ఇబ్బందుల్లో వుంటే ప్రభుత్వం కనీసం పట్టించుకోకపోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఆవేదన వారి మాటల్లోనే ….
అన్ని ధరలు పెరిగిపోయాయి. నా భర్త హార్ట్ పేషెంట్, పిల్లాడు చదువుతున్న ఎయిడెడ్ స్కూల్ మూసేస్తున్నారు. మేము ఎలా బ్రతకాలి?- త్రివేణి, గృహిణి
భర్త చనిపోయి ఏడాది అవుతుంది. ఇప్పటి వరకూ వైఎస్సార్ భీమా రాలేదు, పెన్షన్ కూడా ఇవ్వడం లేదు- వితంతువు
నిత్యావసర సరుకుల ధరలు పెంచేసారు, విద్యుత్ చార్జీల పెంచేసారు, చెత్త మీద కూడా పన్నేసి దోచుకుంటున్నారు. విద్యుత్ బిల్లు ఎక్కువొచ్చిందని పెన్షన్ కట్ చేసారు- మహిళల బృందం
30 ఏళ్ల క్రితం ఇచ్చిన ఇళ్లకు ఒన్ టైం సెటిల్మెంట్ అంటూ మమ్మల్ని వేధిస్తున్నారు- ఇళ్ల లబ్ధిదారులు
నీ కంటి వెలుగునవుతానని తాతకు లోకేష్ భరోసా
మంగళగిరి టౌన్లో పర్యటిస్తున్న నారా లోకేష్ తో 85 ఏళ్ల వీరయ్య, సుభద్ర దంపతులు మాట్లాడారు. “పింఛనుతో బతకలేకపోతున్నాం. నిన్ను చూడాలని ఉన్నా కళ్లు కనపడవు. ప్రభుత్వం మా బాధలు పట్టించుకోదు“ అంటూ వీరయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. “ తాతా నీ కంటి వెలుగుని నేనవుతాను. నీకు ఆపరేషన్ చేయిస్తా“ అంటూ నారా లోకేష్ ఇచ్చిన భరోసాతో వీరయ్య చీకటికళ్లలో ఆనందం వెల్లివిరిసింది. వారంరోజుల్లోగా వీరయ్యకి ఆపరేషన్ చేయించాలని తన వ్యక్తిగత సిబ్బందికి అక్కడికక్కడే నారా లోకేష్ ఆదేశాలిచ్చారు.
పింఛన్లు తొలగించొద్దు కలెక్టరు గారూ!
ఏవేవో సాకులు చూపుతూ తమకి ఆసరాగా వున్న పింఛన్లు తొలగించారని పదులసంఖ్యలో వృద్ధులు లోకేష్ ఎదుట ఆవేదన వ్యక్తంచేశారు. పింఛన్లు రాని వారి వివరాలతో లేఖరాసి అందరి పింఛన్లు పునరుద్ధరించాలని గుంటూరు కలెక్టర్, సెర్ప్ సీఈవోకి లేఖలు పంపారు నారా లోకేష్.
కార్యకర్తలకు లోకేష్ ఆత్మీయ పరామర్శ
నియోజకవర్గంలో ఇటీవల మృతిచెందిన, గాయపడిన కార్యకర్తలు, నేతల ఇళ్లకి వెళ్లి వారిని ఆత్మీయంగా పరామర్శించారు నారా లోకేష్. పోలీసుల దాడిలో గాయపడిన ఉండవల్లి గ్రామ టీడీపీ అధ్యక్షుడు గాదె శ్రీనివాసరావు ని పరామర్శించి ధైర్యంగా వుండాలని, అన్నివిధాలా పార్టీ అండగా వుంటుందని హామీ ఇచ్చారు.
సీఎం నివసించే తాడేపల్లిలో సమస్యల నిలయం
మంగళగిరి నియోజకవర్గానికి ప్రభుత్వం నుంచి ఈ రోజు వరకూ రూపాయి కూడా నిధులు తేలేదని, సీఎం నివసించే తాడేపల్లి ప్రాంతం సమస్యలకు నిలయంగా మారిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు.
తాడేపల్లి టౌన్ లోని 6,14,15,16,17,18 వార్డుల్లో ఆయన పర్యటించారు. ఏ ప్రాంతానికెళ్లినా స్థానికులు సమస్యలు ఏకరువు పెడుతున్నారు. తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని తెలిపారు. కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిందని పెన్షన్లు తీసేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పుడో ప్రభుత్వాలు ఇచ్చిన ఇళ్ళకు ఇప్పుడు 10 వేలు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటూ ఒత్తిడి చేస్తున్నారని మహిళలు వాపోయారు. భర్త చనిపోయి ఏడాది అయ్యిందని, అన్నిపత్రాలతో దరఖాస్తు చేసుకున్నా పింఛను మంజూరు కాలేదని ఓ మహిళ కన్నీటిపర్యంతమైంది.
సరుకుల ధరలు, గ్యాస్ ధర విపరీతంగా పెరిగిపోవడం వలన ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని టీ షాప్ యజమాని తన బాధని వ్యక్తం చేశాడు. ఓనర్ల కే తప్ప ప్రభుత్వం ఇస్తున్న పది వేలు తమకి అందడంలేదని ఆటోడ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. అకారణంగా తనకు వచ్చే పెన్షన్ కట్ చేసారని, అధికారుల చుట్టూ తిరిగిన పెన్షన్ పునరుద్దరించలేదని లోకేష్ వద్ద దివ్యాంగురాలు రమాదేవి ఆవేదన వ్యక్తం చేసింది.
దివ్యాంగురాలు రామాదేవి.
ఎమ్మెల్యేగారు నియోజకవర్గానికి గెస్ట్ లెక్చరర్
రెండుసార్లు గెలిచిన ఎమ్మెల్యే ఆర్కే మంగళగిరి నియోజకవర్గానికి గెస్ట్ లెక్చరర్ గా మారారని, అప్పుడప్పుడూ వచ్చి మాయమాటలు చెప్పి మాయమైపోతున్నారని నారా లోకేష్ ఆరోపించారు. వారానికోసారి గౌతమ బుద్దా రోడ్డు ముందు నాలుగు ఫోటోలు దిగి జంప్ అయిపోవడమేనా అభివృద్ధి అని ప్రశ్నించారు. మంగళగిరిలో అభివృద్ధి జీరో. పేదల ఇల్లు కూల్చడం మాత్రం ఫుల్లుగా సాగుతోందన్నారు. ముఖ్యమంత్రి నివాసం ఉంటున్న నియోజకవర్గంలోని అభివృద్ధికి దిక్కులేదని పేర్కొన్నారు. అత్యంత చెత్త ముఖ్యమంత్రుల జాబితా లో దేశంలోనే జగన్ రెడ్డి నెంబర్ వన్గా నిలుస్తారన్నారు.
జగన్ రెడ్డి నివాసానికి కూతవేటు దూరంలోనే మత్తు పదార్థాలు విచ్చలవిడిగా అమ్ముతున్నారని, దొంగల భయంతో ప్రజలకి రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిందని, మీ పేరుమీద భూమి ఉందని పెన్షన్లు ఎత్తేస్తున్నారని ఇది చాలా అన్యాయన్నారు. లోకేష్ గెలిస్తే ఇళ్లు పీకేస్తాడని ప్రచారం చేసిన ఆర్కే ఇప్పుడు పేదవాళ్ల ఇళ్లు పీకేయడం ఆయన నిజస్వరూపాన్ని బట్టబయలు చేసిందన్నారు. టిడ్కో ఇళ్లు కేటాయించకుండా ప్రజల్ని అయోమయానికి గురిచేస్తున్నారన్నారు.
ప్రభుత్వం నుండి రూపాయి కూడా కేటాయించకుండా. కార్పొరేషన్ పరిధిలో ఇతర అభివృద్ధి కార్యక్రమాల కోసం వినియోగించాల్సిన సాధారణ నిధులు ఖర్చుచేయడమేంటని ప్రశ్నించారు. ఆఖరికి డివైడర్ ఏర్పాటు, డివైడర్ కూలగొట్టడంలోనూ అవినీతికి పాల్పడ్డారంటే …ఎంతగా దిగజారిపోయారో అర్థమవుతోందన్నారు. కోటి 20 లక్షలతో కట్టిన డివైడర్ తీసేసి, ఇప్పుడు కోటి 50 లక్షలతో కొత్త డివైడర్ నిర్మాణం చేస్తారట, డివైడర్ కొట్టడానికి 16 లక్షలు ఖర్చు చేశారట…ఇది అవినీతి కాదా అని ప్రశ్నించారు. గౌతమ బుద్దా రోడ్డులో డివైడర్ కట్టేందుకు చైనా వాల్ కట్టినంత బిల్డప్ ఇస్తున్నారని ఎద్దేవ చేశారు.
సీఎం ఉంటున్న నియోజకవర్గంలో ఇసుక రీచులున్నా ఇసుక అందుబాటులో లేదంటే, ఎక్కడికి పోతోందని నిలదీశారు. ఇసుక కమీషన్లు ఎమ్మెల్యే, మంత్రి నుంచి ఎంతవరకూ పంచుకుంటున్నారని ప్రశ్నించారు. నిన్న ఒక్క రోజే 30 మంది వృద్ధులు పెన్షన్లు పీకేసారని ఆందోళన వ్యక్తంచేశారు. వన్ టైం సెటిల్మెంట్ అనేది జగన్ సర్కారు పన్నిన అతిపెద్ద కుట్ర అని, 10 వేలు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్న తరువాత అసలు వేధింపులు మొదలవుతాయన్నారు. మీ పేరు మీద సొంత ఇళ్లు ఉందని పెన్షన్, రేషన్ కార్డు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు అన్నీ రద్దు చేస్తారని హెచ్చరించారు. ఎవ్వరూ ఒక్క రూపాయి కూడా ఓటీఎస్‌కి కట్టొద్దని, పొరపాటున కడితే మీ సంక్షేమపథకాలన్నీ ఆగిపోతాయన్నారు. టిడిపి గెలిచిన తరువాత ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తామని హామీ ఇచ్చారు.