Suryaa.co.in

Editorial

బాబు విచారణలో వైసీపీ మీడియా ఫొటోగ్రాఫర్ !

– న్యాయవాదులకు లేని అనుమతి
– వైసీపీ మీడియా ఫొటోగ్రాఫర్‌కు ఎలా ఇస్తారు?
– ఇంతకూ విచారణ పర్యవేక్షకులెవరు?
– విచారణ వీడియో లీక్
– అందులో సాక్షి ఫొటోగ్రాఫస్ ఉన్నాడంటూ వైరల్
– సాక్షిలోనే లైవ్ ఇవ్వవచ్చు కదా అంటూ వ్యంగ్యాస్త్రాలు
– టీడీపీ, జనసేన నేతల ఆగ్రహం
( మార్తి సుబ్రహ్మణ్యం)

మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబును.. స్కిల్ డెవలప్‌మెంట్ అక్రమాల కేసులో అరెస్టు చేసిన సీఐడీ పోలీసుల విచారణ తీరును, విపక్షాలు తప్పు పడుతున్నాయి. దీనికి సంబంధించి విడుదలయిన ఒక వీడియో, ఇప్పుడు నెట్టింట రచ్చ చేస్తోంది. బాబు విచారణలో, ఇతరులను ఎలా అనుమతిస్తారంటూ.. అటు నెటిజన్లు, ఇటు విపక్షాలు విరుచుకుపడుతున్నాయి.

నంద్యాల నుంచి విజయవాడ సిట్ ఆఫీసుకు తీసుకువచ్చిన చంద్రబాబును, సీఐడీ ఉన్నతాధికారులు గంటల తరబడి సుదీర్ఘంగా విచారిస్తున్నారు. మరోవైపు తన తండ్రిని చూసేందుకు లోకేష్, భార్య బ్రాహ్మణి, మామ బాలకృష్ణ, తల్లి భువనేశ్వరి సిట్ కార్యాలయానికి వచ్చారు.

అయితే వారిని చంద్రబాబు నాయుడు ఉన్న పై అంతస్తులోకి పోలీసులు కొన్ని గంటలపాటు అనుమతించలేదు. దానితో బాబు వచ్చే వరకూ కుటుంబసభ్యులు, కింద ఫ్లోర్‌లోనే వేచిచూడక తప్పలేదు. అనంతరం వారితో మాట్లాడిన బాబు, అధైర్యపడవద్దని వారికి ధైర్యం చెప్పారు.

మరోవైపు కేసుకు సంబంధించి తమను కూడా అనుమతించాలంటూ, టీడీపీ లీగల్‌సెల్‌కు సంబంధించిన న్యాయవాదులు పోలీసులను అభ్యర్ధించారు. అయితే అందుకు పోలీసులు నిరాకరించి, కోర్టులోనే కలుసుకోవాలని స్పష్టం చేశారు. దానితో వారు కూడా బయటనే వేచిచూడక తప్పలేదు.

అయితే పై అంతస్తులో చంద్రబాబును విచారిస్తున్న పోలీసుల పక్కనే, వైసీపీకి చెందిన సాక్షి ఫొటోగ్రాఫర్ ఉన్నట్లు.. ఒక వీడియో విడుదలవడం వివాదానికి దారితీసింది. సాక్షిలో పనిచేస్తున్న సత్య అనే ఫొటోగ్రాఫర్ అక్కడ ఉండటాన్ని, మిగిలిన మీడియా ప్రతినిధులు వీడియోలో చూడటం, వెంటనే సోషల్‌మీడియాలో దానిని అప్‌లోడ్ చేయడం శరవేగంగా జరిగిపోయింది. దీనితో సహజంగానే రచ్చ మొదలయింది.

అసలు మీడియా ప్రతినిధులను ఆ చాయలకే అనుమతించని పోలీసులు, అధికార పార్టీకి చెందిన ఫొటోగ్రాఫర్‌ను, ఏకంగా విచారణ గదిలోకి ఎలా అనుమతిస్తారంటూ విపక్ష నేతలు ప్రశ్నల వర్షం కురిపించారు. విచారణను వీడియో తీయాలంటే

అందుకు పోలీసు ఫొటోగ్రాఫర్లు ఉండగా, వైసీపీ మీడియా ఫొటోగ్రాఫర్‌ను ఎలా అనుమతించార ని టీడీపీ-జనసేన నేతలు పోలీసులను నిలదీస్తున్నారు.

‘‘ఇంతకూ చంద్రబాబును విచారణను పర్యవేక్షిస్తున్నది ఎవరు? పోలీసు అధికారులా? వైసీపీ మీడియా ప్రతినిధులా? లాయర్లనే రానీయని పోలీసులు, సాక్షి ఫొటోగ్రాఫర్‌ను ఎలా అనుమతించారు? అంటే పోలీసు విచారణకు అధికార పార్టీ మీడియా వారే ప్రత్యేక ఆహ్వానితులా? ఇంతోటి దానికి నాలుగుగోడల మధ్య విచారణలెందుకు? ఎంచక్కా అధికార పార్టీ చానెల్‌లోనే, లైవ్ కవరేజీ ఇవ్వవచ్చు కదా’’? అంటూ నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

కాగా అసలు అధికార పార్టీ ఫొటోగ్రాఫర్‌ను అనుమతించిన పోలీసు అధికారిపై, చర్యలు తీసుకోవాలని టీడీపీ-జనసేన నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళతామని, టీడీపీ లీగల్ సెల్ నేతలు స్పష్టం చేశారు. అసలు పోలీసుల అనుమతి లేకుండా ఆ వీడియో బయటకు ఎలా విడుదలయిందని వారు ప్రశ్నిస్తున్నారు. పోలీసుల విచారణ అట్లుంటది మరి!

LEAVE A RESPONSE