-ఆంధ్రాలో మహిళల అదృశ్యంపై పవన్ ఆరోపణ
– వాటి వెనుక వాలంటీర్లు, వైసీపీ నేతలు ఉన్నారంటూ ఆరోపణ
– దానిని ఖండించిన మంత్రులు, వైసీపీ నేతలు
– వాలంటీర్లతో పవన్ దిష్టిబొమ్మ దగ్ధం చేయించిన వైసీపీ
– మహిళా కమిషన్‌కు వాలంటీర్ల ఫిర్యాదు
– ఇప్పుడు కేంద్రం చెప్పిన లెక్కలతో వైసీపీ యుద్ధం ‘మిస్’ ఫైర్
– అదృశ్యమైన మహిళల లెక్కలు చెప్పిన కేంద్రం
– పార్లమెంటు సాక్షిగా పవన్ ఆరోపణలు సమర్ధించిన కేంద్రం
– పార్లమెంటుకు నివేదిక సమర్పించిన కేంద్ర హోం శాఖ
– ఆంధ్రాలో 7928 మంది బాలికలు, 22278 మంది మహిళలు మిస్సింగ్
– కేంద్ర నివేదికతో పవన్‌లో పెరిగిన సమరోత్సాహం
– వైసీపీ సర్కారును ఇరికించిన బీజేపీ
– కేంద్ర నివేదికను ఖండించని వైసీపీ
– రైల్వే ప్రాజెక్టులకు నిధులివ్వని వైసీపీ వైఫల్యాన్ని బయటపెట్టిన బీజేపీ
– కేంద్రంపై కత్తులు దూయలేని నిస్సహాయత
( మార్తి సుబ్రహ్మణ్యం)
తస్సాదియ్యా తుస్సుమన్నట్లుంది ఇప్పుడు వైసీపీ సంకటం. ఆంధ్రాలో మహిళలు-బాలికలు-ఒంకరి మహిళలు మిస్ అవుతున్నారని, వాటి వెనుక వాలంటీర్లు- వైసీపీ నేతల సౌజన్యం ఉందంటూ జనసేనాధిపతి పవన్ కల్యాణ్ ఇటీవల చేసిన ఆరోపణలకు ఊతమిచ్చే వ్యవహారమిది.
అయితే.. మిస్సింగ్ కేసుల వెనుక పవన్ చెప్పినట్లు, వాలంటీర్లు-వైసీపీ నేతలున్నారని చెప్పకపోయినా.. 2009 నుంచి ఆంధ్రాలో మిస్ అయిన మహిళలు, బాలికల జాబితాను.. బీజేపీ సర్కారు పార్లమెంటులో విడుదల చేయడం, అధికార వైసీపీకి ప్రాణసంకటంలా పరిణమించింది. కేంద్ర నివేదిక తప్పుల తడకంటూ ఇప్పటివరకూ.. అటు వైసీపీ సర్కారు గానీ, వైసీపీ నేతలు గానీ ఖండించకపోవడమే ఆశ్చర్యం. దీన్నిబట్టి ఈ వ్యవహారం వైసీపీని ఏ స్థాయిలో ఆత్మరక్షణలో నె ట్టిందో స్పష్టమవుతుంది.
ఆంధ్రాలో మహిళలు అదృశ్యమవుతున్నారంటూ, గత కొద్దికాలం నుంచీ జనసేనాధిపతి పవన్ చేస్తున్న ఆరోపణలను నిజం చేస్తూ.. కేంద్రంలోని బీజేపీ సర్కారు పార్లమెంటు సాక్షిగా వాస్తవాలను విడుదల చేసింది. ఆ ప్రకారంగా.. 2019 నుంచి 2021 అంటే మూడేళ్లలో 7928 మంది బాలికలు, 22278 మంది మహిళలు కనిపించడం లేదన్న కేసులు నమోదైనట్లు వెల్లడించింది.
2020లో 2374 మంది బాలికలు, 7057 మంది మహిళలు అదృశ్యమైన కేసులు నమోదయినట్లు పేర్కొంది. 2021లో 3358 బాలికలు, 8969 మహిళలు అదృశ్యమైనట్లు వెల్లడించింది. 18 ఏళ్ల బాలికలు, 18 ఏళ్లు దాటిన మహిళల కేసులకు సంబంధించిన కేసుల వివరాలను, కేంద్ర హోం శాఖ పార్లమెంటు సాక్షిగా వెల్లడించింది.
తాజా పరిణామాలు జనసేనలో సహజంగా సమరోత్సాహం కలిగించగా, అధికార వైసీపీని రాజకీయంగా ఆత్మరక్షణలో పడేసినట్లయింది. తమ నేత చేసిన ఆరోపణలు అక్షరసత్యాలని.. కేంద్రం ఖరారు చేసిందని జనసేన ప్రచారం చేసుకునేందుకు, ఈ వివరాలు ఊతమిచ్చినట్లయింది. అటు పవన్ ఆరోపణలను సమర్ధించిన టీడీపీకి సైతం, కేంద్రం విడుదల చేసిన గణాంకాలు వైసీపీ సర్కారుపై అస్త్రాలిచ్చినట్లయింది.
ఎటొచ్చీ ఈ పరిణామాల్లో అధికార వైసీపీ మాత్రమే, ఆత్మరక్షణలో పడినట్లు స్పష్టమవుతోంది. తమ ప్రభుత్వ ప్రతిష్ఠకు సంబంధించిన ఈ వ్యవహారం బట్టబయలవడంతో, దానిని ఖండించలేని నిస్సహాయ పరిస్థితి. అలాగని ఆ లెక్కలను ఖండిస్తూ, కేంద్రంపై కత్తులు దూయలేని నిస్సహాయత.
దీనితో పవన్ ఆరోపణలకు బలం చేకూర్చే, కేంద్ర హోం శాఖ నివేదికలపై ఎలా స్పందింంచాలో తెలియని సంకటపరిస్థితి. ఎన్నికల వేళ ఈవిధంగా బీజేపీ సర్కారు ఒక్కో అంశంపై పార్లమెంటులో ఇస్తున్న సమాధానాలు, రాష్ట్రంలో వైసీపీని సంకట స్థితిలో నెడుతున్నాయి. తాజాగా రాష్ట్రానికి రావలసిన హక్కులు, ప్రాజెక్టులు ఇవ్వలేమంటూ.. కేంద్రం చేతులెత్తేసిన వైనం కూడా, విపక్షాలకు అస్త్రంగా పరిణమించింది.
కడప స్టీల్ ఫ్యాక్టరీ, విశాఖ రైల్వే జోన్, విశాఖ స్టీల్ ప్యాక్టరీ ప్రైవేటీకరణపై కేంద్రంలోని బీజేపీ సర్కారు చేతులెత్తేసిన వైనం.. కేంద్రానికి బేషరుతు మద్దతునిస్తున్న వైసీపీకి, సహజంగానే ప్రాణసంకటంగా పరిణమించింది. తాజాగా ముద్దనూరు-పులివెందుల-ముదిగుబ్బ-శ్రీ సత్యసాయి నిలయం ప్రాంతాలను కలిపే.. 110 కిలోమీటర్ల రైల్వేలైను ప్రాజెక్టుకు, జగన్ సర్కారు ఇప్పటివరకూ తన వాటాగా ఇవ్వాల్సిన నిధులు విడుదల చేయలేదని బీజేపీ సర్కారు పార్లమెంటు సాక్షిగా బయటపెట్టింది.
2,705 కోట్ల రూపాయల విలువయ్యే కడప-బెంగళూరు రైల్వే లైను ప్రాజెక్టు కోసం.. జగన్ సర్కారు తన వంతువాటాగా ఇప్పటిదాకా 189.95 కోట్లు మాత్రమే విడుదల చేసిందని, మిగిలింది ఇవ్వలేదని పేర్కొంది. చివరకు తాము భూసేకరణకు మాత్రమే నిధులిస్తామని లేఖ రాసిందంటూ బీజేపీ సర్కారు అసలు రహస్యాన్ని బట్టబయలు చేసింది. ఇది రాయలసీమలో పార్టీ పరువును తీయడమేనని వైసీపీ నేతలు, కమలంపై కారాలు మిరియాలు నూరుతున్నారు.