Suryaa.co.in

Andhra Pradesh

ఎన్నికల్లో గొడవలు సృష్టించేందుకు వైసిపి స్కెచ్

-ఎన్నికుట్రలు పన్నినా కూటమిదే ఘనవిజయం!
-కోయంబత్తూరుకు కూడా ఎపి గంజాయి వెళ్తోంది
-మంగళగిరి ఎన్నికల ప్రచారంలో యువనేత లోకేష్

మంగళగిరి: అయిదేళ్ల అరాచకపాలనలో నరకం చూసిన రాష్ట్రప్రజలు కూటమి అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు, ప్రజాతీర్పు మాకు అనుకూలంగా ఉంది, జగన్ ఎన్నికుట్రలు పన్నినా మా విజయాన్ని ఆపలేరని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి టౌన్ లోని సమృద్ధి అపార్ట్ మెంట్ వాసులతో యువనేత సమావేశమయ్యారు. ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తుకు అత్యంత కీలకమైనవి, వైసిపి నాయకులు కావాలని గొడవలు సృష్టిస్తారు, ప్రజలు ఓపికతో తమ ఓటుహక్కు వినియోగించుకోవాలని కోరారు.

వైసిపి పాలనలో గంజాయి పంటను కుటీర పరిశ్రమలా మార్చేశారు. నేను ప్రచారం కోసం కోయంబత్తూరు వెళ్తే అక్కడ కూడా ఎపి నుండి గంజాయి సరఫరా అవుతోందని చెప్పారు. అప్పులు చేసి బటన్ నొక్కుతూ ఆ భారాన్ని పన్నులరూపంలో ప్రజలపై వేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో కియా, టిసిఎల్, హెచ్ సిఎల్ వంటి పరిశ్రమలు రప్పించడంతో లక్షలాది యువతకు ఉద్యోగావకాశాలు లభించాయి.

జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ రాలేదు, 2019లో ప్రజావేదిక ధ్వంసంతో పాలన ప్రారంభించిన జగన్ రివర్స్ పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. మూడుముక్కలాటతో ఏ ఒక్క ప్రాంతంలోనూ ఒక్క ఇటుక వేయలేదు. తాను మాత్రం విశాఖలో నిబంధనలకు విరుద్ధంగా 500కోట్లతో విలాసవంతమైన ప్యాలెస్ నిర్మించుకున్నారు. ఈ కట్టడానికి అనుమతులు లేవని కేంద్రం 200 కోట్ల ఫైన్ విధించింది. ఒక్కడి కోసం 700 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ఈ డబ్బుతో మంగళగిరి నియోజకవర్గంలో ఇళ్లులేని పేదలందరికీ ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇవ్వొచ్చు.

ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతిజిల్లాలో అక్కడఉన్న వనరులను బట్టి వివిధరకాల పరిశ్రమల ఏర్పాటుపై దృష్టి సారిస్తాం. విశాఖలో ఐటి, శ్రీకాకుళంలో ఫార్మా, గోదావరి జిల్లాల్లో ఆక్వా, చిత్తూరులో ఎలక్ట్రానిక్స్, అనంతపురంలో ఆటోమొబైల్స్, డిఫెన్స్ పరికరాల పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా అయిదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. తద్వారా రాష్ట్రంలో సంపద రెండున్నర రెట్లు పెరుగుతుంది. అప్పుడు ఇప్పటికంటే మెరుగైన సంక్షేమాన్ని పేదలకు అందిస్తాం. రాష్ట్రాన్ని ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా మార్చాలన్నది చేయాలన్నది మా లక్ష్యం. ఈ లక్ష్యసాధన కోసం అహర్నిశలు కష్టపడతామని యువనేత లోకేష్ చెప్పారు.

LEAVE A RESPONSE