Suryaa.co.in

Andhra Pradesh

కుర్చీ దిగిపోయే ముందూ వైసీపీ హింసా రాజకీయాలు

-రాష్ట్రంలో రాజకీయ హింస, శాంతి భద్రతలపై ఎలక్షన్ కమిషన్ తక్షణమే దృష్టి పెట్టాలి
-గిద్దలూరులో టీడీపీ కార్యకర్త మూలయ్య, నంద్యాలలో ఇమామ్ హుస్సేన్ హత్యలను ఖండించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు

అమరావతి :- ఎన్నికల వేళ వైసీపీ మరింత రాజకీయ హింసకు దిగుతోందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మరో 50 రోజుల్లో కుర్చీ దిగి ఇంటికి పోయే ముందు కూడా జగన్ హింసా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని చంద్రబాబు మండి పడ్డారు. ఓటమి భయంతో తీవ్ర నైరాశ్యంలో ఉన్న వైసీపీ మూకలు టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నాయని అన్నారు.

‘‘ప్రజాగళం సభకు వచ్చారన్న కారణంతో గిద్దలూరు నియోజకవర్గం, గడికోటకు చెందిన మూలయ్యను గొడ్డళ్లతో నరికి దారుణంగా చంపేశారు. ఆళ్లగడ్డ నియోజకవర్గం, చాగలమర్రిలో ఇమామ్ హుస్సేన్ అనే 21 ఏళ్ల యువకుడిపై కత్తులతో దాడి చేసి బలి తీసుకున్నాయి. మాచర్లలో టీడీపీ కార్యకర్త సురేష్ కారును తగలబెట్టారు. ఈ మూడు ఘటనలపై పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. వైసీపీ గూండాల హత్యా, ఫ్యాక్షన్ రాజకీయాలను తీవ్రంగా ఖండిస్తున్నా. బాధిత కుటుంబాలకు టీడీపీ అండగా ఉంటుంది. ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డి, నంద్యాల ఎస్పీ రఘువీర్ రెడ్డి, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి వైసీపీకి అత్యంత అనుకూలమైనవారే. వైసీపీ నేతలతో సన్నిహిత సంబంధాలున్న ముగ్గురు ఎస్పీల అండచూసుకునే వైసీపీ గూండాలు చెలరేగుతున్నారు. కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలపై తక్షణం దృష్టి సారించాలి. ఎన్నికల ముంగిట పెచ్చురిల్లుతున్న రాజకీయ హింస, శాంతి భద్రతల పరిస్థితిపై సమీక్షించి తగు చర్యలు తీసుకోవాలి’’ అని చంద్రబాబు నాయుడు కోరారు.

LEAVE A RESPONSE