– ఎన్డీయేను వైసీపీ నమ్మించి మోసం చేసిందా?
– ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏకు వైసీపీ చేయిచ్చిందా?
– చెల్లని 15 ఓట్లలో వైసీపీ ఓట్లు కూడా ఉన్నారయా?
– ఎన్డీఏను నమ్మించడానికే మద్దతునిచ్చిందా?
– అవసరార్ధం కోసమే వైసీపీ మద్దతు నాటకమా?
– ఎన్డీఏ-యుపీఏకు వైసీపీ సమదూరం పాటించిందా?
– ుుస్లిం-క్రైస్తవ-దళిత వర్గాల ఆగ్రహంతో వైసీపీ వ్యూహం మార్చిందా?
– వైసీపీ నమ్మకద్రోహంపై బీజేపీ ఆగ్రహం?
– వైసీపీ తనను నమ్మించి మోసం చేసిందని బీజేపీకి తెలిసిపోయిందా?
– ఢిల్లీ రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్
(మార్తి సుబ్రహ్మణ్యం)
ఎన్డీఏను వైసీపీ నమ్మించి మోసం చేసిందా? అడిగిన వెంటనే అదెంత భాగ్యమని వినమ్రత నటించిన వైసీపీ.. తీరా ఓటింగ్ సమయంలో చెల్లని ఓటు వేసి, అటు ఎన్డీఏ, ఇటు యుపిఏకు ఇచ్చిందా? ఆ చెల్లని 15 ఓట్లలో వైసీపీ ఖాతావేనా? అందుకే ఎన్డీఏకు మెజానిటీ తగ్గిందా? కేవలం ఎన్డీఏ మెరమెచ్చులు-అవసరార్ధం కోసమే వైసీపీ ఎన్డీఏ అభ్యర్ధికి మద్దతు ప్రకటించి.. చివరాఖరకు చెల్లని ఓట్లు వేసిందా?.. ఇదీ ఇప్పుడు ఢిల్లీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్.
ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్ధి సిపీ రాధాకృష్ణన్‌కు మద్దతునిస్తునట్లు వైసీపీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దానిని వైఎస్‌కు అత్యంత సన్నిహతుడుయిన రాజమండ్రి మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్ తీవ్రంగా ఖండించారు. తప్పుపట్టారు. కాంగ్రెస్‌కు సంబంధం లేని సుదర్శన్‌రెడ్డికి వ్యతిరేకంగా ఎలా ఓట్లు వేస్తారుని నిలదీశారు.
అదే సమయంలో ఎన్డీఏ అభ్యర్ధికి వైసీపీ మద్దతు ప్రకటించడంపై రాష్ట్రంలోని ముస్లిం-క్రైస్తవ వర్గాలు ఆగ్రహంతో రగిలిపోయాయి. గత ఎన్నికల్లో వైసీపీకి 40 శాతం ఓట్లు రావడానికి ఆ వర్గాలే కారణమన్నది నిర్వివాదం. వైసీపీకి మానసిక మద్దతు ఇస్తూ, కూటమిపై యుద్ధం చేస్తున్న వామపక్ష పార్టీలు కూడా, వైసీపీ అధినేత జగన్ నిర్ణయాన్ని తీవ్రంగా దుయ్యబట్టాయి. చివరకు జగన్ చెల్లెయిన పీసీసీ చీఫ్ షర్మిల కూడా తన అన్న పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని విమర్శించారు.
అటు సోషల్‌మీడియాలో సైతం.. వైసీపీ కోసం కష్టపడుతున్న సైనికులు జగన్ నిర్ణయంపై కస్సుమన్నారు. టీడీపీ-జనసేన కూటమి ఉన్న ఎన్డీఏకు మద్దతు ప్రకటించడం, ఆత్మహత్యా సదృశమని విరుచుపడ్డారు. కార్యకర్తల మనోభావాలను జగన్ పట్టించుకోలేదని రుసరుసలాడారు.
రాష్ట్రంలో కూటమి సర్కారుపై యుద్ధం చేస్తున్న జగన్.. అదే కూటమి అభ్యర్ధికి ఎలా మద్దతు ప్రకటిస్తారు? ఇది కార్యకర్తల మనోభావాలను ఎన్డీఏకు తాకట్టు పెట్టడం కాదా? అని విమర్శల వర్షం కురిపించారు. ఇక ఇలాగైతే జగన్‌ను ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, క్రిస్డియన్లు ఎలా నమ్ముతారని నిలదీశారు. అసలు ఏ ప్రాతిపదికన జగన్ ఎన్డీఏకు మద్దతు ప్రకటించారని నిప్పులు కురిపించారు. ఓటింగ్‌కు దూరంగా ఉండి బీజేపీ వ్యతిరేక వర్గాలను దరిచేర్చుకోవలసిన అవకాశాన్ని జగన్ ఎందుకు వినియోగించుకోలేదని నిష్ఠూరాడారు.
కేవలం కేసులు, కోర్టు మినహాయింపుల నుంచి తప్పించుకునేందుకే జగన్ ఎన్డీఏకు మద్దతునిచ్చారని.. అటు నెటిజన్లు కూడా, కొద్దిరోజుల నుంచి చాకిరేవు పెడుతున్నారు. అసలు తాము ఈ ఎన్ని కు దూరంగా ఉంటున్నామని ప్రకటిస్తే, ఆ వర్గాల్లో జగన్ విశ్వసనీయత పెరిగేదని స్పష్టం చేస్తున్నారు. ఆ మేరకు కొన్ని వర్గాలు.. జగన్ వద్దకు తమ ప్రతినిధి బృందాలను పంపించి, ఎన్నికకు దూరంగా ఉండాలని సూచించినట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే వివేకానందరె డ్డి కేసు, ఏపీలో లిక్కర్ కేసు విచారణ జరుగుతున్న నేపథ్యంలో.. ఎన్డీఏను ప్రసన్నం చేసుకునేందుకే ఉప రాష్ర్ర్టపతి అభ్యర్ధి రాధాకృష్ణన్‌కు వైసీపీ మద్దతు ప్రకటించారన్న విమర్శలు వెలువడిన విషయం తెలిసిందే.
కానీ క్షేత్రస్థాయిలో వైసీపీకి తిరుగులేని మద్దతుదారులయిన ఎస్సీ, ఎర్టీ, మైనారిటీ, క్రిస్టియన్లు జగన్ నిర్ణయంపై తిరుగుబాటు చేయడంతో.. చివరి నిమిషంలో వ్యూహం మార్చారన్న ప్రచారం ఢిల్లీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. దానితో చెల్లని ఓట్ల తో ఎన్డీఏకు వైసీపీ ఝలక్ ఇచ్చినట్లు ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
వైసీపీ సభ్యులు కూడా అనుకూలంగా ఓట్లు వేస్తే ఎన్డీఏ అభ్యర్ధి రాధాకృష్ణన్‌కు ఎక్కువ ఓట్లు రావల్సి ఉందని. చెల్లని ఓట్ల ఖాతాలో వేయడం వల్ల మెజారిటీ తగ్గిందని, అటు ఎన్డీఏ వర్గాలు కూడా విశ్లేషిస్తున్నట్లు సమాచారం. దీనితో వైసీపీ తమను నమ్మించి మోసం చేసిందని ఎన్డీఏ ఆగ్రహంతో రగిలిపోతున్నట్లు చెబుతున్నారు. అంటే పేరుకు ఎన్డీఏకు మద్దతు నిచ్చినట్లు కనిపించడం ద్వారా.. బీజేపీకి దగ్గరయి, తన ప్రయోజనాలు నెరవేర్చుకోవడమే జగన్ అసలు లక్ష్యమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నిజం ‘జగన్నా’ధుడికెరుక!