దుష్టచతుష్టయం కుట్రల్లో భాగమే రైతు భరోసాపై ఎల్లో మీడియా దుష్ప్రచారం

– రైతులకు జరుగుతున్న మేలు చూసి తట్టుకోలేకే టీడీపీ నిందలు
– మూడేళ్ళలో లక్షా 10 వేల కోట్లు రైతులకు సాయం అందితే.. హర్షించాల్సిందిపోయి, దుష్ప్రచారమా..?
– వ్యవసాయం, కౌలు రైతులు అంటే తెలియని వ్యక్తులు ప్రశ్నలు వేయడమా..!?
– విద్యుత్ మీటర్ల విషయంలో బాబు విధానం కాదంటే.. అవుననిలే..!
– టీడీపీ హయాంలో ఏటా కరువు మండలాలు ప్రకటనలే..
– రైతుకు అన్నివిధాలా అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం
– అసని తుపాను నష్టం అంచనాలు రాగానే.. సీజన్ పూర్తయ్యేలోపలే పరిహారం
-ః రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థనరెడ్డి

మంత్రి కాకాణి గోవర్థన రెడ్డి మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే…మే 16,2022న వరుసగా నాలుగో ఏడాది వైఎస్ఆర్ రైతు భరోసా సొమ్ము తొలి ఇన్ స్టాల్ మెంటును పశ్చిమ గోదావరి జిల్లా గణపవరంలో రైతుల సమక్షంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారు బటన్‌ నొక్కి రైతుల ఖాతాల్లో నగదు జమ చేయడం జరిగింది. రైతులకు ఆర్థిక చేయూతను అందించడానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌గారు ఈ పథకాన్ని 2019 అక్టోబర్‌లో నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో ప్రారంభించారు. అర్హులైన రైతులందరికీ ఏటా రూ.13,500 ఆర్థిక సాయం అందిస్తున్నాం. తొలివిడతలో రూ.7,500, అక్టోబర్‌ నెలలో రూ.4000, జనవరిలో రూ.2000లు వైయస్సార్‌ రైతు భరోసా-పీఎం కిసాన్‌ పథకం ద్వారా మొత్తం రూ.13,500 గత మూడు విడతలుగా చెల్లించడం జరిగింది. భూమిలేని షెడ్యూల్‌ కులాలు, తెగలు, మైనార్టీ, బీసీ, కౌలు, దేవాదాయ, అటవీభూముల సాగుదారులకు కూడా ఈ భరోసాను అందిస్తున్నాం.

ఈ పథకం ప్రారంభించిన తర్వాత 2019-2020 సంవత్సరానికి 46 లక్షల 69వేల కుటుంబాలకు రూ.6,173 కోట్లును ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారు బటన్‌ నొక్కి రైతుల ఖాతాల్లోకి నగదు విడుదల చేశారు. అలాగే 2020-21 సంవత్సరానికి సంబంధించి 51లక్షల 59వేలమంది రైతు కుటుంబాలకు రూ.6,928కోట్లు, 2021-22 సంవత్సరానికి 52లక్షల 38 వేల రైతు కుటుంబాలకు రూ.7,016కోట్లు విడుదల చేయడం జరిగింది. వరుసగా నాలుగో ఏడాది వైయస్సార్‌ రైతు భరోసా కింద మొదట విడత సాయాన్ని ఇవాళ అందచేశాం. దాదాపుగా రూ.3,758 కోట్ల రూపాయలను జమ చేస్తున్నాం. ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే, రైతాంగానికి మేలు జరిగేలా, మే మాసంలోనే నిధులు విడుదల చేయడం జరిగింది.

వైయస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకూ, వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా రైతాంగానికి ఆర్థిక పరిపుష్టిని కల్పించేందుకు, వారికి విడుదల చేసిన మొత్తం నిధులుః రూ.23వేల 875కోట్లు. రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాల ద్వారా రైతులకు అండగా ఉంటోంది. అందులో భాగంగా సున్నావడ్డీకే పంట రుణాలు, ఉచిత పంటల బీమా, రైతు భరోసా కేంద్రాల ద్వారా అందించే సేవలు, ఈ-క్రాప్ బుకింగ్‌ ద్వారా పారదర్శకంగా, దళారీలు లేకుండా చూడటంతోపాటు, విత్తనాలు, ఎరువులు ఆర్బీకేల ద్వారా నాణ్యమైనవి అందిస్తున్నాం. రైతులకు ఆదాయాన్ని కలిగించేలా పొలంబడి కార్యక్రమం ద్వారా రైతులకు అవగాహన కల్పించడం, సచివాలయ స్థాయి నుంచి మండల, జిల్లా స్థాయి వరకూ వ్యవసాయ సలహా మండళ్లు ఏర్పాటు చేయడం, రైతుల ఆదాయ వనరులు పెంచుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం జరుగుతుంది.

రైతాంగానికి లక్షా 10 వేలకోట్లు లబ్ధి జరిగితే దుష్ప్రచారమా..?
ఎప్పుడూ లేనివిధంగా మా ప్రభుత్వం దాదాపుగా లక్షా 10వేల కోట్ల రూపాయలు రైతాంగానికి వివిధ పథకాల కింద ఖర్చు చేయడం జరిగింది. ఒకపక్క రైతులకు సంబంధించి ఇంత పెద్ద ఎత్తున లబ్ధి, మేలు జరిగే కార్యక్రమాలు జరుగుతుంటే.. మరోవైపు కొంతమంది నాయకులు, కొన్ని మీడియా సంస్థలు రైతు భరోసాపై దుష్ప్రచారం చేయడం దురదృష్టకరం. వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ మా ప్రభుత్వ విధానాలు, రైతును అన్నివిధాలుగా ఆదుకునేందుకు అమలు చేస్తున్న పథకాలు చూసినా.. మేం రైతులకు ఏవిధంగా అండగా నిలబడుతున్నామో ఎవరికైనా అర్థమవుతోంది. ఇది సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు, రైతులు హర్షించాల్సిన సందర్భం అయితే, ప్రభుత్వం రైతులకు ఉపయోగకరమైన కార్యక్రమాలు చేస్తుంటే వాటిని నిందించి, చులకన చేసేవిధంగా కొంతమంది పని కట్టుకుని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ప్రభుత్వం రైతులకు అందిస్తున్న లబ్ధి, దానివల్ల రైతులకు కలిగే ప్రయోజనాలు, అభివృద్ధి, సంక్షేమం గురించి మాత్రం మాట్లాడటం లేదు. రైతులకు మేలు చేయడం, ఒక్క రూపాయి అవినీతి లేకుండా వారి ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేయడమే తప్పు అన్నట్టుగా తెలుగుదేశం, మరొక పార్టీ విమర్శలు చేయడం సిగ్గుచేటు.

రైతుల కోసం జరుగుతున్న సభలో, రైతుకు జరుగుతున్న మంచిని చూపించాల్సిందిపోయి.. ఎవరో ఒకరిద్దరు జనాలు వెళ్లిపోతున్నారు, ఖాళీ కుర్చీలు కనిపిస్తున్నాయి.. అంటూ ఎల్లో మీడియా లేనిదానిని ఉన్నట్టు అబద్ధపు ప్రచారాలు చేయడం ఇకనైనా మానుకుంటే మంచిది. వాస్తవానికి, ఆ వర్గం మీడియా, ప్రభుత్వ పథకాల ద్వారా రైతులకు ఏవిధంగా లబ్ధి చేకూరుతుంది అనేదాన్ని కవర్‌ చేయడానికి వచ్చారా? లేక ఏదోవిధంగా ప్రభుత్వంపై బురదచల్లే కార్యక్రమాలు చేయడానికి వచ్చారా? అనేది చూస్తే వాళ్లకున్న దురుద్దేశం ఏంటనేది అర్థం అవుతుంది. ముఖ్యమంత్రిగారు దుష్టచతుష్టయం అని చెప్పినట్లుగానే, ఆ శక్తుల కుట్రలో భాగంగానే రైతు భరోసాపై దుష్ప్రచారం చేయడానికి కూడా దిగజారిపోయారు. రైతు భరోసా పధకంలో లోటుపాట్లు గురించి ప్రసారం చేస్తే బాగుంటుంది కానీ, అలా కాకుండా కుర్చీలు ఖాళీ.. అంటూ ప్రచారం చేసే విధానం సరికాదు.

ప్రజలకు, సమాజానికి అవసరమైనవి, చెప్పవలసిన విషయాలను విస్మరించడం, రైతులను, ప్రజలను నష్టపరిచే విధంగా దుష్ప్రచారం చేయడం అనేది ఎల్లో జర్నలిజానికి పరాకాష్టగా చెప్పుకోవచ్చు. లోపాలుఉంటే వాటిని మా దృష్టికి తీసుకువస్తే ప్రభుత్వం సరిదిద్దుకుంటుంది. రైతు భరోసా లాంటి గొప్ప కార్యక్రమాన్ని నెగిటివ్‌ ఆటిట్యూడ్‌తో ప్రచారం చేయడం సరికాదు. రైతుల ఖాతాల్లో ప్రభుత్వం నగదు జమచేస్తే.. రైతులలో ఎందుకు వ్యతిరేక భావం ఉంటుంది, లేనిదాన్ని ఉన్నట్టు, అబద్ధాలను, అసత్యాలను పోగేసి, వాటిని భూతద్దంలో చూపించాలనే ఆలోచనతో మంచిని పక్కనపెట్టి వక్రీకరించేవిధంగా చేయడం సరైన పద్ధతి కాదు.

టీడీపీ హయాంలో ఏటా కరువు మండలాల ప్రకటనలే.. మా హయాంలో మరో 16 లక్షల టన్నుల ఉత్పత్తి 
మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, రైతు ప్రయోజనాల కోసం తీసుకున్న చర్యల కారణంగా ఈ మూడేళ్ళలోనే ఏటా సగటున మరో 16లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగింది. వర్షాలు సకాలంలో కురవడం, జలాశయాల్లో నీరు నిల్వ ఉండటంతో సమృద్ధిగా సాగుకు నీళ్లు అందించాం. ఖరీఫ్‌ ప్రారంభానికి ముందే రైతుభరోసా ఇవ్వడం, సీజన్‌ కన్నా ముందే సాగునీరు అందించడం, ఆర్బీకేల ద్వారా విత్తనాలు, ఎరువులు సరఫరా చేయడం, ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. ఈ మూడేళ్లలో ఎక్కడా కరువు మండలాలుగా ప్రకటించిన దాఖలాలు లేవు. అదే గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఏటా కరువు మండలాల ప్రకటనలే కనిపించేవి. రైతులపై ఎలాంటి భారం లేకుండా ఇన్సూరెన్స్‌ పాలసీని తెచ్చి, ప్రీమియం సొమ్మును కూడా ప్రభుత్వమే భరిస్తుంది. ఆక్వా రైతుల కోసం ముఖ్యమంత్రిగారు అసాధారణ నిర్ణయం తీసుకున్నారు. ఆక్వా జోన్‌ను పెంచాలని కోరితే దానినీ పెంచడం జరిగింది. ప్రతిదానినీ చిలువలు పలువలు చేసి, ప్రచారం చేస్తున్నారు.

జూన్ 6న రైతు రథం
ఇక రైతు రథానికి సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారు జూన్‌ 6వ తేదీన ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. మూడువేల ట్రాక్టర్లను ఒకేరోజు పంపిణీ చేస్తున్నాం. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో.. ఆ ట్రాక్టర్లను ఎక్కడ కొనాలి, ఏ ట్రాక్టర్‌ కొనాలి, ఏ డీలర్‌ దగ్గర కొనాలి అనేది ప్రభుత్వమే నిర్ణయించింది. దీని వెనుక ఆ కంపెనీలతో ప్రభుత్వం తెరచాటు లావాదేవీలు నెరిపి, వాళ్ల ద్వారానే కొనుగోలు చేయాలనే ఒక అసాధారణ నిర్ణయం తీసుకుని రైతులకు బలవంతంగా ఆ ట్రాక్టర్లను రుద్దిన విషయం తెలిసిందే.

ఇవాళ రైతులు నేరుగా వారికి ఇష్టమైన డీలర్ల వద్దకు వెళ్లి ఏ కంపెనీ ట్రాక్టర్‌ కొనుగోలు చేయాలన్నది రైతుల అభీష్టం మేరకే ఉంటుంది. ట్రాక్టర్‌ కొనుగోలు చేసినట్లు ఆధారాలు చూపిన వెంటనే వాళ్లకు ఇవ్వాల్సిన సబ్సిడీ వాళ్లుకు అందచేస్తాం. ఇది కూడా పారదర్శకంగా బటన్‌ నొక్కే ప్రారంభిస్తాం. రైతుల ఖాతాల్లోకి నేరుగా సబ్సిడీ నగదు జమ అయ్యేలా చర్యలు తీసుకున్నాం. రూ.2వేల కోట్లు నిధి ఏర్పాటు చేసి, పంట నష్టపోతే సీజన్‌ ముగిసేలోపునే పంటను అంచనా వేసి, ఆ నగదు కూడా రైతుల అకౌంట్లలోకి జమ చేస్తాం. రైతులకు సంబంధించి డ్రిప్‌ ఇరిగేషన్‌, డ్రోన్‌ల ద్వారా ఎరువులు చల్లుకునేలా ఎక్కడా ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నాం.

వ్యవసాయం అంటే తెలియని వ్యక్తులు వారు
ఇక వ్యవసాయం అంటే తెలియని ఓ వ్యక్తి ప్రశ్నలు సంధించాడు. కౌలు రైతులకు ఏమి అందుతాయి, నిబంధనలు ఏం ఉంటాయో కూడా తెలియని మరో వ్యక్తి యాత్రలు చేస్తాడు. వీరికి రైతులు, వ్యవసాయం గురించి అసలు ఏం తెలుసు? మా ప్రభుత్వం ఎప్పుడూ రైతులకు అండగా ఉంటుంది. ప్రజలు కూడా వాస్తవాలు తెలుసుకోవాలి. ప్రజలంతా హర్షించే కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోంది. అందరూ నిండు మనసుతో ముఖ్యమంత్రిగారికి ఆశీస్సులు అందిస్తున్నారు.

మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ..
విద్యుత్ మీటర్ల అంశంలో చంద్రబాబు నాయుడు వాదన విచిత్రంగా ఉంటుంది. మీటర్లు పెడితే ఎందుకంటాడు, పెట్టకపోతే ఎందుకు పెట్టరు అంటాడు. విద్యుత్ మీటర్లపై ఆయన మాటలు కాదంటే, అవును అనేలా ఉన్నాయి. వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు పెడితే రైతులకు ఎటువంటి నష్టం లేదు, ఏ ప్రాంతాలకు, ఏ ఫీడర్లకు ఎంత కరెంటు వెళుతోందో తెలుసుకునేందుకు, విద్యుత్ సరఫరాలో లోపాలు ఉంటే సరిచేసేందుకు ఈ మీటర్లు ఉపయోగపడతాయి.

– రూ. 1. 4 లక్షల కోట్లు ప్రజల చేతికి అందించిన వైఎస్ జగన్ గారు… ఇప్పటికే ఒక్క రైతు భరోసా పథకం ద్వారానే, దాదాపు రూ. 24 వేల కోట్లు రైతులకు అందించిన జగన్ గారు, రైతులకు చేసిన మేలును చూసి తట్టుకోలేక, ఇక తమకు ఓట్లు పడవని చంద్రబాబు చేస్తున్న దుష్ప్రచారం ఇది.

అధికారంలో ఉన్నప్పుడు దుర్మార్గాలు చేయడం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వం మంచి పనులు చేస్తే విమర్శించడం అనేది చంద్రబాబు నైజం. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే దుగ్ధతో దుష్ప్రచారం చేస్తున్నారే తప్ప, రాష్ట్రం, రైతుల పట్ల చంద్రబాబుకు ఎలాంటి చిత్తశుద్ధి లేదు. అసని తుపాను నష్టం అంచనాలు ఒకటి, రెండు రోజుల్లో పూర్తి అవుతాయి. పరిహారానికి సంబంధించి మా ప్రభుత్వ విధానం ప్రకారం, సీజన్ పూర్తయ్యేలోపలే రైతులకు అందిస్తాం.

Leave a Reply