-ప్రజా వ్యతిరేక నిర్ణయాలు మానుకోకపోతే వచ్చే ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీకి వచ్చినన్ని ఓట్లు కూడా వైసీపీకి రావు
– ఏలూరి సాంబశివరావు
రాజధాని నిర్మాణానికి సేకరించిన భూములను దిగమింగేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతోంది. రాజధాని భూముల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వడాన్ని న్యాయస్థానాలు సైతం తప్పుపట్టినా దొడ్డిదారిలో ఆర్డినెన్స్ తెచ్చుకోవడం ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనం. సీఆర్డీఏ, ఏపీ మెట్రోపాలిటన్ రీజియన్ చట్టాలకు ఇష్టానుసారంగా సవరణలు చేస్తూ రాజధాని నిర్మాణ స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. వైసీపీ మూడున్నరేళ్ల పాలనలో అమరావతిలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోగా ఆ భూముల్ని కాజేసేందుకు తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా కుట్ర పన్నుతున్నారు. మాస్టర్ ప్లాన్లో మార్పులు, చేర్పులకు కూడా అవకాశం కల్పిస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధం. న్యాయస్థానాల పరిధిలో ఉన్న అంశాలపై ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రజా ప్రయోజనాల కోసం చేయాల్సిన చట్టాలను వైసీపీ నేతల భూదాహాన్ని తీర్చుకోవడానికి ఉపయోగిస్తున్నారు. సీఆర్డీఏ చట్టం 2014 సెక్షన్ 41(1) చేసిన సవరణ రాజ్యాంగ విరుద్ధం. ప్రభుత్వం 500 ఎకరాలను ఇళ్ల పట్టాలకు కేటాయిస్తూ జారీ చేసిన జీవోలను కొట్టేసినా, ప్రభుత్వ తీరును తప్పు పట్టినా ఎటువంటి మార్పు లేకుండా ఒంటెద్దు పోకడలకు పోతోంది. రాజధాని నిర్మాణం కోసం రైతులు ఇచ్చిన భూములకు సంరక్షకుడిగా ఉండే సీఆర్డీఏను ఒకవైపు నిర్వీర్యం చేస్తూ, మరోవైపు వైసీపీ భూబకాసురులకు దోచిపెట్టేందుకు సవరణలు చేస్తుందటo దుర్మార్గపు చర్య. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఇకనైనా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు మానుకోవాలి. లేకుంటే వచ్చే ఎన్నికల్లో వైసీపీ కి ప్రతిపక్ష హోదా కూడా దక్కదు.