( మార్తి సుబ్రహ్మణ్యం)
అది హైదరాబాద్ నాంపల్లి కోర్టు ప్రాంగణం. ఉదయం నుంచే పరిసర ప్రాంతాలు ఫ్లెక్సీలతో కళకళలాడుతున్నాయి. చాలామంది లాయర్లు ఆరోజు ప్రత్యేకించి కోర్టుకు వచ్చారు. ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ. ఆరేళ్ల నుంచి కోర్టు ముఖం చూడని జగనన్నియ్య పాపం ఎలా ఉన్నారో చూద్దామన్న ఉత్సుకత. ఎట్టకేలకు అందరూ ఎదురుచూస్తున్న కథానాయకుడు.. జయజయధ్వానాల నడుమ, కాన్వాయ్‌తో కోర్టు ప్రాంగణంలోకి అడుగుపెట్టారు. ఎప్పటిమాదిరిగానే షిక్కటి షిరునవ్వులు షిందిస్తూ, రెండు చేతులూ పైకెత్తి ముకుళిత హస్తాలతో నమస్కారం పెట్టారు. అంతే.. ఒక్కసారిగా వీరాభిమానుల వీరవిహారం. సీఎం.. సీఎం.. రఫ్ఫా.. రఫ్ఫా అంటూ నినాదాలు, కేరింతలు. దానితో అన్నియ్య మురిసిముక్కలయిపోయాడు.
హైదరాబాద్‌లో కూడా తనకు ఇంతమంది వీరాభిమానాలున్నారా? ఎవరినీ తరలించకుండా(?), ముందస్తు సమీకరణ చేయకుండా (?).. కేవలం దుర్మార్గ పచ్చ మీడియా వార్తలు చూసి, ఇంతమంది త న కోసం తరలివచ్చారా అని అన్నియ్య హాశ్చర్యపోయిన మధుర క్షణాలవి. సరే.. తాను కోర్టులో ఓ గంట సేపు మాత్రమే ఉంటానని అపాయింట్మెంట్ ఇచ్చినందున, మాట తప్పడం-మడమ తిప్పడం తెలియని అన్నియ్య తన ధర్మం నెరవేర్చారు. కోర్టు లోపలికి అడుగుపెట్టి వినమ్రంగా నమస్కరించారు.
అంతే.. బయట ఉన్న వేలాదిమంది మాదిరిగానే.. లోపల కళ్లకు గంతలు కట్టుకున్న న్యాయదేవత కూడా, అన్నియ్యను చూడాలన్న ఉత్కంఠతో కళ్లకు గంతలు తీసేసిన మహాద్భుత క్షణమది. మరి ఒకటా? రెండా? ఏకంగా ఆరేళ్లయింది అన్నియ్యను చూసి?! తాను ప్రతి వారం కోర్టుకు వస్తే లక్షాతొంభై సమస్యలు కమ్ కోటి వ ర్రీసు వచ్చే అవకాశం ఉన్నందున.. తాను రాలేను. కావాలంటే తన లాయరును పంపిస్తా. ఆయనలోనే తనను చూసుకోవాలన్న అన్నియ్య వినతిపై.. ఠాఠ్ అదెలా కుదురుతుంది? నువ్వు సీఎం అయితే ఎవరికి ఎక్కువ? మాకు అంతా సమానమే. అప్పుడు ప్రధాని పివి కూడా యూరియా కేసులో హాజరుకాలేదా? లాలూ ప్రసాద్ యాదవ్ హాజరుకాలేదా? నువ్వు అంతకంటే గొప్పవాడివా? అవేమీ కుదరదు.
ఈ పప్పులు మాదగ్గర ఉడకవు. ప్రతి శనివారం కోర్టుకు హాజరుకావలసిందేనని ఎక్కడ అంటుందోనని భయపడ్డ అన్నియ్యను.. దయగల ప్రభువులు, సరే శుక్రవారం నీదికాదులే పొమ్మని పెద్దమనసుతో అంగీకరించారాయె. ఇహ అప్పటి నుంచి ఇప్పటివరకూ అన్నియ్య నాంపల్లి కోర్టు ముఖం చూస్తే ఒట్టు. ఇప్పుడయినా ఏదో కోర్టు విదేశాలకు వెళ్లివచ్చిన తర్వాత తనకు కనిపించాలని ఆదేశించింది కాబట్టి, కోర్టును దయతలచి వచ్చారు. అలా అంతటి ‘విశాలహృదయస్తుడి’ని, ఆరేళ్ల తర్వాత చూసిన న్యాయప్రముఖుల జన్మధన్యమయిందట.
పనిలోపనిగా అన్నియ్య కూడా.. అవినీతి నిర్మూలన, న్యాయ వ్యవస్ధను ఎలా బలోపేతం చేయాలి? అందుకు తీసుకోవలసిన చర్యలేమిటి? త్వరితగతిన తీర్పులు ఎలా ఇవ్వాలన్న దానిపై చిన్నమాటి సందేశం కూడా ఇచ్చారన్నది సోఏల్మీడియాలో వెలువడిన వార్తలు. సరే.. ఆఖరిగా సంతకం పెట్టి, బయటకు వెళుతున్న అన్నియ్యను చూసి న్యాయవ్యవస్థ ఆనందభాష్పాలు రాల్చిందట. ఆరేళ్ల నుంచి కోర్టుకు హాజరుకాకుండా, నీడపట్టున బతుకుతున్న బిడ్డ దుస్థితిని చూసి, ఐదారు బొట్ల ఆనందభాష్పాలు కార్చిందట. చివరగా అందరివద్దా సెలవు తీసుకుని.. వీలుంటే మళ్లీవస్తానని వీడ్కోలు చెప్పిన అన్నియ్య బయటకు వచ్చిన వెంటనే, ఆయన కోసమే కళ్లు కాయలుకాసేలా ఎదురుచూస్తున్న రఫ్ఫా రఫ్ఫా బ్యాచ్.. జయజయ ధ్వానాల నడుమ ఊరేగింపుగా, అన్నియ్యకు లోటస్‌పాండ్ వరకూ సెండాఫ్ ఇచ్చినట్లు సోషల్‌మీడియాలో వినిపించిన కబుర్లు. నోట్: ఇవన్నీ సోషల్‌మీడియాలో జగనన్నపై ‘అభిమానం’తో పెట్టిన పోస్టింగులండోయ్!

