Suryaa.co.in

Editorial

అవును..జవహర్ రెడ్డి గెలిచారు!

– కూటమి ఓడింది.. జగన్ గెలిచారు
– బదిలీపై కూటమి ఫిర్యాదులు బేఖాతరు
– కేంద్రంలో జగన్ మాటే గెలిచింది
– అందుకే సీఎస్ బదిలీ ఆగింది
– బీజేపీ ముందుచూపుతోనే జగన్కు అభయం?
– రాజ్యసభలో ఇంకా వైసీపీతో అవసరం
– బీజేపీ రాజనీతిలౌక్యంలో విజేత జగన్
– జవహర్ ను కొనసాగించడంలో జగన్ సక్సెస్
– సోషల్ మీడియాలో ఆసక్తికర కథనాలు
( మార్తి సుబ్రహ్మణ్యం)

“డీజీపీ-సీఎస్ లో ఎవరిని త్యాగం చేస్తావని జగన్ను మోడీ అడిగితే..పోలింగ్-కౌంటింగ్లో అధికారుల నిర్ణయాలే ముఖ్యం కాబట్టి, సీఎస్ ను ఉంచమని చెప్పినట్లు అగ్రహారం టాక్. ఇది తెలియని చాలామంది మోదీ ఏదో జగన్కు వ్యతిరేకం అనుకుని మురిసిపోతున్నారు” – ఇదీ కొద్దిరోజుల నుంచి సోషల్ మీడియాలో.. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డిపై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా, ఆయన కొనసాగడానికి కారణాలంటూ వచ్చిన విశ్లేషణ.

అవును మరి..జవహర్ రెడ్డి నిజంగా గెలిచారు. ఎన్డీయే ఎంత గొంతు చించుకున్నా, చంద్రబాబునాయుడు ఎన్ని లేఖలు రాసినా..బీజేపీ ‘బాసుణి’ పురందేశ్వరి ఎన్ని లేఖలు రాసినా, జనసేన దళపతి పవన్ అరిచి గీ పెట్టినా.. ప్రజాస్వామ్యవాదుల కంఠాలు తెగేలా నినదించినా.. సీఎస్ జవహర్ రెడ్డిని బదిలీ చేయించలేకపోయారు. కేంద్రం-ఈసీ ఓట్లుకూడా జమిలిగా ఆయనకే పోలయ్యాయి. లేకపోతే సారు బదిలీ ఆగదన్నది అగ్రహారం ఉవాచ.

నిజమే. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ భాగస్వామ్యంలోని ఎన్డీయే కూటమి సైతం, జవహన్రెడ్డిని సీఎస్ తప్పించాలని డిమాండ్ చేసింది. ఆయన జగన్ పట్ల పక్షపాతంతో వ్యవహరిస్తూ, నిర్ణయాలు తీసుకుంటున్నందున తక్షణం ఆయనను తప్పించాలన్నది కూటమి డిమాండ్. అటు కాంగ్రెస్ఓ అదే మాట. ప్రజాసంఘాలు సైతం జవహన్రెడ్డిని సాగనంపాలని నినదించాయి. అయినా ఎక్కడా చలనం లేదు. ఆయన అనుకున్న పని ఆయన చేసుకుంటూ వెళుతున్నారు. ఏబీ వెంకటేశ్వరరావు కేసులో క్యాట్ తీర్పునకు సంబంధించి, స్వయం నిర్ణయాధికాంతో ఉత్తర్వులు ఇవ్వాల్సిన జవహర్ రెడ్డి, సీఎం ఆదేశాల మేరకు హైకోర్టులో సవాల్ చేసినప్పుడు కూడా, కేంద్రం – ఈసీ ఆయన ఎటు వైపు.. ఎవరి వైపు.. ఎవరి కోసం ఉన్నారని గ్రహించకపోవడమే వింత.

అయితే సీఎస్ సారుకు అంత బలం ఎక్కడ నుంచి వచ్చింది? అసలు ఆయన బలం ఎవరు? రిటైర్మెంట్కు నెలరోజులే సమయం ఉన్న ఒక సీఎస్కు, ఇన్ని అసాధారణ శక్తు ఎక్కడి నుంచి వచ్చాయన్నది ఇప్పుడు రాజకీయ-అధికార వర్గాల్లో హాట్ టాపిక్. సీఎం జగనన్న అండదండలే జవహరన్నకు బలమన్నది అందరి మూకుమ్మడి తీర్మానం. అలాగయితే మరి.. ఎన్డీయే కూటమిలో ఉన్నప్పటికీ ఈసీ జవహర్ రెడ్డిని ఎందుకు మార్చలేదు? అన్నది అమాయకుల సందేహం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు స్వయంగా డిమాండ్ చేసినప్పటికీ, బదిలీ వర్కవుట్ ఎందుకు కావడం లేదన్నది మరికొందరు అమాయకుల ప్రశ్న. మరి నిజమే కదా? ఆ ప్రశ్నలు వేసినవారు అమాయకులయినప్పటికీ.. వారి ప్రశ్నలు మాత్రం అమాయకం కాదన్నది బుద్ధి జీవుల వాదన.

నిజమే. కేంద్ర రాజకీయాలు ఎప్పుడూ ఒకటి ప్లస్ ఒకటి రెండు కాదు. దానికి బోలెడన్ని లెక్కలుంటాయి. ఇప్పుడంటే లెక్కలు మారి, టీడీపీని బీజేపీ కూటమిలో చేర్చుకుంది గానీ.. అంతకుమందు వరకూ జగనన్న వారికి దత్తపుత్రుడే కదా? ఆయన నోరు తెరిచి అడగటమే పాపం. క్షణాల్లో ఆగమేఘాలపై తీర్చింది పైనున్న పెద్దన్నే కదా? ఈ రాజకీయాలు శాశ్వతం కావు. ఎవరు..ఎప్పుడు ఏ గట్టున ఉంటారో తెలియదు. కాబట్టి పనికొచ్చేవారిని దూరం చేసుకోవడం ఎందుకన్నది భాజపా ఫిలాసిఫి. ఇలాంటి ‘ఆర్ట్ ఆఫ్ లివింగు’లో, బీజేపీకి బోలెడు గోల్డ్ మెడల్సే ఉన్నాయి. అందులో భాగంగానే ఏపీ సీఎస్ ఇంకా ఆ పదవిలో కొనసాగుతున్నారన్నది.. అగ్రహారం అరుగుల మీద నడుస్తున్న చాయ్ పే చర్చ.

ఈ ఎన్నికల్లో బీజేపీకి గతంలో మాదిరిగా సంపూర్ణ మెజారిటీ రాదని, 80 నుంచి 100 స్థానాలు కోల్పోతుందన్నది సర్వేలు చెబుతున్నమాట. కాబట్టి ఎందుకయినా మంచిదని, ముందుచూపుతో అడుగులు వేయడం అనివార్యం. పైగా జగన్ ఏమీ పరాయివాడేమీ కాదు. నిన్నట వరకూ తన కమలవనంలో దొడ్డివెనుక సేదదీరిన వాడే. ఆయన వల్ల తను-తనవల్ల ఆయన బాగుపడ్డారు కాబట్టి.. ఆ ఉప్పు తిన్న విశ్వాసంతో ఉభయకుశలోపరిగా, జగనన్న ఒక చిన్న కోరిక కోరి ఉంటారు.

ఆ ప్రకారంగా మాజీ దత్తపుత్రుడు తాజాగా కోరినట్లు, జవహర్ రెడ్డిని సీఎస్ కొనసాగేలా అభయం ఇచ్చి ఉంటుందన్నది బుద్ధిజీవుల అంచనా. అలాగని కూటమిలోని టీడీపీ-జనసేన నారాజ్ కాకుండా.. వారు కోరినట్లే డీజీపీని తప్పించి.. ఇద్దరినీ మెప్పించింది. తరచూ సంతృప్తికర రాజకీయాలను విమర్శించే బీజేపీ.. అంతర్గత సంతృప్తికర రాజకీయం ఇదన్నమాట.

అంటే రేపు ఫలితాల తర్వాత ఏమైనా జరగవచ్చు. ఒకవేళ బీజేపీ బలం తగ్గితే మాజీ దత్తపుత్రుడి అవసరం కూడా రావచ్చు. పైగా రాజ్యసభలో వైసీపీ ఇంకా పందెం కోడి మాదిరిగా బలంగానే ఉంది. పెద్దల సభలో అన్నయ్య పార్టీ మద్దతు అవసరం. ఇంకా ఏడెనిమిది లోక్సభ సీట్లు వస్తే, ఈ గత్తర రాజకీయాల్లో అది కూడా పెద్ద నెంబరే. బిల్లులు గట్టెక్కాలంటే అన్నయ్య పార్టీ అవసరం ఉంది.

కాబట్టి.. దేవుడు శాసిస్తాడు. ఈ అరుణాచలం పాటిస్తాడు అని రజనీకాంత్ డైలాగు చెప్పినట్లు.. పెద్దన్న శాసించారు కాబట్టే, ఇంకా జవహర్ రెడ్డి పదవి భద్రంగా ఉందన్నది విజ్ఞున ఉవాచ. మరి వైసీపీ ఇంతకు కూటమికి శత్రుపక్షమా? మిత్రపక్షమా? అన్నది బాలచందర్ సినిమా మాదిరిగా, ఎవరికివారే చేసుకోవాలి.

ఈ ఎన్నికల ఎత్తుగడలో యుద్ధంలో జవహర్ రెడ్డి గెలిచారు. కూటమి ఓడింది. పరీక్ష ఎలా రాశావన్నది కాదు. పరీక్షలో పాసయ్యారా? అన్నదే ముఖ్యం. ఇన్ని ఒత్తిళ్లు-ఆరోపణలు-విమర్శలు ఫిర్యాదుల పరంపరను సైతం తట్టుకుని నిలబడ్డ జవహన్రెడ్డి ముందు కూటమి సగర్వంగా… సవినయంగా ఓడింది.

LEAVE A RESPONSE