Suryaa.co.in

Editorial

అవును..మన జగనన్నే!

( మార్తి సుబ్రహ్మణ్యం)

మీరు చూసేది నిజంగా ఏపీ ముఖ్యమంత్రి జగనన్ననే. నుదుట బొట్టు, చేతికి పసుపు కంకణం, పట్టు పంచె- లాల్చీ, భుజం మీద కండువా వేసుకున్న జగనన్న ఉగాది రోజు హిందూ సంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనంలా కనిపించారు. అంతేకాదు. జగనన్న పక్కన ఆయన భార్య భారతీరెడ్డి కూడా సంప్రదాయ పట్టుచీర దుస్తులతో కనిపించడం మరో విశేషం. జగనన్న తన భార్య చేతికి పసుపు కంకణం కట్టగా, భార్య భారతీరెడ్డి ఆయన చేతికి పచ్చ తోరం కట్టిన దృశ్యం మరో ఆకర్షణ. జగన్ తన భార్య నుదుట పాపిట సింధూరం పెట్టగా, భారతీరెడ్డి కూడా జగనన్న నుదుట తిలకం దిద్దారు. ఈ తతంగాన్ని అక్కడున్న అధికారులు, మంత్రులు ఆసక్తితో తిలకించారు. ఆ తర్వాత వేదపాఠశాలో చదివే విద్యార్ధులతో జగనన్న ముచ్చటించారు. ఇదంతా ఉగాది రోజున జరిగిన అద్భుతాలు.

గత ఏడాది సీఎం క్యాంపు ఆఫీసులోని గోశాలలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో కనిపించిన భారతీరెడ్డి, ఈ ఉగాది రోజున భర్తతోపాటు ఉగాది కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇద్దరూ కలసి పంచాంగ శ్రవణం భక్తిగా ఆలకించారు. గత సంక్రాంతి కంటే ఈ పండుగలో ఆమె చాలా ఉత్సాహంగా కనిపించారు. సహజంగా జగన్ పాల్గొనే ఆధ్మాత్మిక కార్యక్రమాల్లో ఎప్పుడూ భారతీరెడ్డి కనిపించరు. కానీ ఈసారి ఉగాది ఉత్సవాల్లో మాత్రం ఆమె చాలా ఉత్సాహంగా కనిపించడం విశేషం. జగనన్న క్షేమాన్ని కాంక్షించే ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఈ కార్యక్రమాలకు ఈసారి కూడా వారథిగా నిలిచారు. చెవిరెడ్డి, టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దంపతుల పట్టుదలతోనే సీఎం క్యాంపు ఆఫీసులో గోశాల ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. ఉగాది రోజున ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సతీసమేతంగా హిందూ మతాచారం పాటిస్తూ నిర్వహించిన కార్యక్రమాలు చూడముచ్చటగా ఉన్నాయన్నది ఫొటోలు చూసిన వారి వ్యాఖ్య. శుభం. జగన్‌పై క్రైస్తవ ముద్ర ఉన్న నేపథ్యంలో ఈ కార్యక్రమాల్లో సతీసమేతంగా పాల్గొన్న జగన్‌ను చూస్తే ఆ ముద్ర చెరిగిపోవడం ఖాయమన్నది జగనాభిమానుల ఉవాచ.

LEAVE A RESPONSE