Suryaa.co.in

Editorial

అవును.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు!

– జగనన్నను విమర్శించనని చెప్పేసిన ఉండవల్లి అరుణ్‌ కుమార్‌
– మార్గదర్శి, విభజన అంశాలే తనకు ప్రధానమన్న ఉండవల్లి
– తెలంగాణ నుంచి నిధులు, నీళ్ల పంచాయితీపై ఉండవల్లి యుద్ధం చేయరా?
– కేసీఆర్‌తో భేటీ సమయంలో నిధులివ్వాలని నిలదీశారా?
– జయలక్ష్మి సొసైటీ, అగ్రిగోల్డ్‌ బాధితుల పక్షాన పోరాడరేం?
– వాటిపై కేసు వేయని మతలబేమిటో?
– బ్రాహ్మణ మొహమాటమన్న విమర్శల్లో నిజమెంత?
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఈ ప్రపంచంలో ఉన్నది ఉన్నట్లు మాట్లాడే ఏకైక వ్యక్తి ఆయన. అవినీతిపరుల పక్షాన ఉండకుండా, కేవలం నీతి-నిజాయతీపరుల వైపే నిలబడి, కత్తులు దూసే పోరాట యోధుడు ఆయన. ఇప్పటివరకూ అవినీతిమకిలి అంటని గొప్పతనమే ఆయన భవిష్యత్తుకు పెట్టుబడి. విశ్వసనీయత కూడా. అలాంటి మహోన్నత వ్యక్తి.. తాను ఫలానా వ్యక్తి గురించి మాట్లాడను. విమర్శించనని కుండబద్దలు కొడితే ఎవరికైనా ఆశ్చర్యమే కదా? అసలు అలాంటి మహనీయుడి నోటి నుంచి, ఆ మినహాయింపుల మాట వస్తుందని ఎవరైనా నమ్ముతారా? ఛస్తే నమ్మరు. ఎందుకంటే ఆయన ‘మిస్టర్‌ క్లీన్‌’ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ కాబట్టి!

కానీ అది నిజంగా నిఝం మరి. ఏపీ సీఎం జగనన్నను తాను విమర్శించనని, ఎందుకంటే విభజన చట్టానికి సంబంధించి సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ వేసి, జగనన్న తనకు బోలెడంత బలమివ్వడమే ఆయన మొహమాటానికి కారణమట. ఏదైనా అరుణనన్నను ఒకందుకు ఒప్పుకుని, మెచ్చుకుని తీరాలి. అందరిలా తెరవెనుక ఒకటి-తెరముందు ఒకటి కాకుండా.. నేరుగా తన మనసులో మాట కుండబద్దలు కొట్టినందుకు ఉండవల్లికి దండేసి, దణ్ణం పెట్టాల్సిందే.

అసలు ఉన్న విషయాన్ని నిర్భయంగా చెప్పినందుకు ఆయనను అభినందించాల్సింది పోయి, అత్త-ఆడపడచు మాదిరిగా, కాకుల్లా సూటిపోటి మాటలతో గుచ్చడం భావ్యం కాదు. ఆయన మనసులో మాట చెప్పారు. దానికి సంతోషించాలి. ఉండవల్లి ఇప్పుడు రాజకీయ అనాధ అయినప్పటికీ, రాజకీయ నిరుద్యోగి అయినప్పటికీ, ఆయన చెప్పేదానికి జనంలో కొంత విలువ ఉంది. ఆయన చెబితే నిజమని నమ్మే సెక్షన్‌ అంటూ ఒకటి ఉంది. ఎలాంటి పదవుల్లేకపోయినా, ఇంకా మీడియా ఆయన పిలిస్తే వెళుతుందంటే.. ఆ క్రెడిబిలిటీనే కారణం. కానీ ఆ క్రెడిబిలిటీని జగనన్నకు సందర్భానుసారంగా ధారాదత్తం చేసి, తటస్తులను వ్యూహాత్మకంగా జగన్‌ వైపు మళ్లిస్తుంటారన్నది గిట్టనివారి విమర్శ. అది నిజమా? కాదా? అన్నది మరొక చర్చ. కానీ ఇప్పుడయితే తాను జగనన్నను విమర్శించనని చెప్పినంత మాత్రాన.. జగనన్న-అరుణన్న ఇద్దరూ ఇష్టపడ్డారనుకుంటే ఎలా? తప్పు కదా?

అన్నట్లు ఇంకోటి కూడా చెప్పారు. తాను వైసీపీ కాదు అని ఉండవల్లి స్పష్టం చేశారు. అయితే రామోజీపై ఢిల్లీలో ఉండవల్లితో ప్రెస్‌మీట్‌ పెట్టించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని, ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యే కోటంరెడ్డి గతంలో బయటపెట్టారు. ఇంటలిజన్స్‌ చీఫ్‌ పీఎస్సార్‌ ఆంజనేయులు డైరక్షన్‌లో, ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయని కోటంరెడ్డి వెల్లడించారు. వైసీపీ ట్రాప్‌లో పడవద్దని ఉండవల్లికి సలహా కూడా ఇచ్చిన వైనం అప్పట్లో చర్చనీయాంశమయింది.

ఇక జనసేన వస్తే ఏదో మార్పు తీసుకువస్తానని ఆశించినట్లు చెప్పారు. బహుశా జనసేన.. తన ప్రియశత్రువైన టీడీపీని విమర్శించడం లేదు కాబట్టి! కానీ మార్గదర్శి- విభజన చట్టమే తప్ప, తనకు ఇంకో పనేమీ లేదని కుండబద్దలు కొట్టడం ఎంతమందికి సాధ్యం?

అరుణన్నకు జగనన్నను విమర్శించకపోవడానికి బోలెడున్నర కారణాలు ఉండ వచ్చు. రాజన్న దయతోనే అరుణన్న ఎంపీ అయ్యారన్నది అందరికీ తెలిసిందే. అదేమీ రహస్యం కాదు. లేకపోతే అరుణన్న ఎమ్మెల్యే, చివరకు వార్డు కౌన్సిలరు కూడా కాలేరన్నదీ అంతే బహిరంగం. ఎన్నికల్లో పోటీ చేయడం వరకే అరుణన్న బాధ్యత. మిగిలిన వ్యవహారాలన్నీ రాజన్న మనుషులే చూసుకునేవారు. ఆ విషయం అరుణన్నకూ నిజాయితీగా తెలుసు.

ఎందుకంటే.. అన్ని కోట్లు పోసి ఎన్నికల్లో పోటీ చేసే ఆర్ధిక స్తోమత.. ఉండవల్లి దగ్గర లేదన్న విషయం రాజమండ్రిలో కాకులు, పిచ్చుకలకూ తెలుసు. కాబట్టి ఆ కృతజ్ఞత ఇంకా మనసంతా నిండిపోయి ఉండాలి. అందుకే రాజన్న తనయుడు జగనన్నను, తాను విమర్శించనని చెప్పి ఉండవచ్చు. దానిని తప్పు పట్టడం ధర్మం కాదు.

ఇన్ని తెలిసి కూడా… మరి అవినీతి ఆరోపణలు, పాలనా వైఫల్యాలపై విరుచుకుపడే ఉండవల్లి.. గతంలో క్వార్టరు బాటిళ్లు ప్రెస్‌మీట్‌కు తీసుకువచ్చి, తెరవెనుక రహస్యాలు చెప్పిన ఉండవల్లి…ఇప్పుడు అవే మందుబాటిళ్ల రేట్ల గురించి, క్యాష్‌ ఇస్తేనే మందు ఇస్తున్న మతలబు గురించి ఎందుకు మాట్లాడరు? పోలవరంపై జగనన్న ఎందుకు యుద్ధం చేయరు? ప్రత్యేక హోదాపై మడం తిప్పిన జగనన్నను ఎందుకు నిలదీయరు? ఏపీలో పాలనపైై ఎందుకు మాట్లాడరు? అని ప్రశ్నించడం అమాయకత్వం. అవివేకం. ఎందుకంటే ఆయన.. తాను జగనన్నను విమర్శించనని ముందే చెప్పారు కాబట్టి!

సరే.. జగన్నను విమర్శించాలంటే బోలెడు మొహమాటాలు ఉన్నాయి కాబట్టి, ఆ గొడవ వదిలేద్దాం. మరి మార్గదర్శిపై కత్తి-డాలూతో పోరాడుతున్న ఉండవల్లి.. తన రాజమండ్రి పక్కనే ఉన్న జయలక్ష్మి సొసైటీ నిధుల గోల్‌మాల్‌, అగ్రిగోల్డ్‌ బాధితుల ఆక్రందనలు ఎందుకు పట్టించుకోరన్నది బాధితుల ప్రశ్న.

అగ్రిగోల్డ్‌ బాధితులు ఇంకా రోడ్లపై పడి పిచ్చివాళ్ల మాదిరిగా తిరుగుతున్నారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత, బాధితుల డబ్బులు పువ్వుల్లో పెట్టి ఇప్పిస్తానని జగనన్న హామీ ఇచ్చారు. విచిత్రమేమిటంటే.. జయలక్ష్మి సొసైటీ- అగ్రిగోల్డ్‌ యాజమాన్యాలు రెండూ, ఉండవల్లి గారి సామాజికవర్గమైన బ్రాహ్మణుల ఏలుబడి లోనివే. యాజమాన్యాలే కాదు. బాధితుల్లో సగానికిపైగా బ్రాహ్మణులే కావడం మరో విచిత్రం.

ఇప్పటికే డజన్ల మంది బాధితులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకున్నారు. వందలమంది ఆడపిల్లల పెళ్లిళ్లు, మధ్యలోనే నిలిచిపోయాయి. వృద్ధులకయితే, మందులు కొనుక్కునేందుకు చేతిలో చిల్లిగవ్వ లేదు. అగ్రిగోల్డ్‌ బాధితుల బాధలు వర్ణనాతీతం. మరి బాధితుల పక్షాన అరుణన్న ఎందుకు పోరాడరు? పైగా వాటిపై బస్తాలకు బస్తాల ఫిర్యాదులున్నాయి.

అసలు ఒక్క ఫిర్యాదు కూడా లేని మార్గదర్శిపై, అవిశ్రాంతంగా పోరాడుతున్న ఉండవల్లి.. వేల ఫిర్యాదులున్న ఆ రెండు సంస్థల మోసాలపై, ఎందుకు యుద్ధం చేయరన్నది బాధితుల ప్రశ్న. జగన్‌ సర్కారును నిలదీసి, బాధితులకు న్యాయం చేయడంలో, అరుణన్నకు ఉన్న మొహమాటం ఏమిటన్నది వారి సందేహం.

ఆంధ్రా మందుబాబులు కూడా.. అరుణన్న గతంలో మాదిరిగా చేసిన ‘మందుయుద్ధం’ కోసమే, కళ్లు కాయలుకాసేలా ఎదురుచూస్తున్నారు. చంద్రబాబు హయాంలో మందు బాటిల్‌ ఎంతకు తయారవుతోంది? అది షాపులకు ఇచ్చే రేటెంత? వైన్‌షాపులు అమ్మేదెంత? అసలు మందు తయారీకి అయ్యే ఖర్చెంత? వంటి అంశాలన్నీ ‘మందుబాటిళ్ల సాక్షిగా’ ప్రెస్‌మీట్‌లో వెల్లడించి, బాబు సర్కారును మందుతో కడిగేశారు. దానితో అసలు మందు రేటెంత? సర్కారుకు వచ్చేదెంత అనే రహస్యం ప్రపంచానికి తెలిసిపోయింది.

మరి ఇప్పుడు వాటి కంటే ఎక్కువ రేట్లతో, పిచ్చి కంపెనీల పేర్లతో మందును ప్రభుత్వమే అమ్ముతోంది. పైగా నో పేటీఎం. నో గూగుల్‌ పే. ఓన్లీ క్యాష్‌. డబ్బులిస్తేనే మందు. దేశంలో ఇదో కొత్తవిధానం. ప్రతి అంశంలోనూ లాజిక్కు పాయింట్లు, కోడిగుడ్డుకు ఈకలు పీకే ఉండవల్లి… ఈ‘ క్యాష్‌ అండ్‌ క్యారీ’పై ఎందుకు యుద్ధం చేయరన్నది అరుణన్న అభిమానుల ఆవేదన. పాన్‌షాపులో సిగరెట్‌ కొంటేనే పేటీఎం కొడుతుంటే.. మందుకు మాత్రం ఎందుకు క్యాష్‌ తీసుకుంటున్నారని ఉండవల్లి నిలదీస్తే ఒట్టు.మందుపై అరుణన్న మౌనరాగానికి సంబంధించి, సోషల్‌మీడియాలో సెటైర్లు పేలాయి కూడా.

ఎలాగూ అరుణన్న విభజన సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్నారు. సంతోషం. కానీ విభజనలో భాగంగా ఏపీకి, తెలంగాణ నుంచి రావలసిన నిధుల కోసం అరుణన్న ఎందుకు పొరాడటం లేదు? మార్గదర్శి మాదిరగా ఆ అంశంపై కోర్టులో కేసు ఎందుకు వేయడం లేదన్నది అఖిలాంధ్ర అరుణన్న అభిమానుల సందేహం. జగనన్నకంటే.. కేసీఆర్‌తో సవాలక్ష మొహమాటాలు ఉంటాయి. కానీ అరుణన్నకు అవేమీ లేవు కదా? ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలిసిన ఉండవల్లి.. అప్పుడే కేసీఆర్‌ను నిలదీసి, ఏపీకి రావలసిన నిధుల గురించి నిలదీసి ఉంటే, ఈపాటికి సగం డబ్బులయినా వచ్చేవి కదా? అన్నది అరుణన్న అభిమానుల అంతరంగం.

LEAVE A RESPONSE