-
టీడీపీని వ్యతిరేకించిన వారికి రెడ్‌కార్పెట్ వేస్తారా?
-
ఏమిటీ ధిక్కారం?.. ఎందుకిలా?
-
మంగ్లీని వెంటబెట్టుకుని అరసవల్లి దర్శనం చేయించిన కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు
-
మంగ్లీ చంద్రబాబును తిట్టిన సంగతి రామూకు తెలియదా?
-
ఆమె జగన్ కోసం ప్రచారం చేసిన విషయం కూడా తెలియని అమాయకుడా?
-
సోషల్‌మీడియాలో విమర్శలు వచ్చినా స్పందించని రామ్మోహన్నాయుడు
-
రామ్మోహన్‌ను అన్‌ఫాలో చేసిన టీడీపీ అభిమానులు
-
ఇప్పుడు టీడీపీ పార్లమెంటరీ ఆఫీసులో జగన్ మిత్రుడు నాగార్జున ప్రత్యక్షం
-
జగన్‌కు తిరుగులేని మద్దతుదారుగా నాగ్ ప్రచారం
-
అసలు నాగార్జునను పార్టీ ఆఫీసులోకి తీసుకువచ్చింది ఎవరు?
-
లావు అనుమతి లేకుండానే నాగ్ పార్టీ ఆఫీసులోకి వచ్చారా?
-
లావు ఇంట్లోనే నాగార్జున ఫ్యామిలీకి భోజనం
-
ఈ ఎపిసోడ్లో వైఎల్పీ ప్రభావం ఎంత?
-
నాగార్జున ప్రమోషన్ ఎపిసోడ్‌కు టీడీపీ ఎంపీలు ఎందుకు?
-
మండిపడుతున్న సోషల్‌మీడియా పసుపు సైనికులు
-
ఈ సర్దుబాటు రాజకీయాలతో పార్టీని భ్రష్ఠు పట్టిస్తున్నారంటూ ఫైర్
-
పార్టీలో పెరుగుతున్న ధిక్కారధోరణి
( మార్తి సుబ్రహ్మణ్యం)
నిన్నటికినిన్న.. వైసీపీకి ఎన్నికల ప్రచారం చేసి, చంద్రబాబు పేరు వింటేనే తనకు కంపరం పుడుతుందని సెలవిచ్చిన ఎస్వీబీసీ మాజీ సలహాదారు, జగన్ ముద్దుల సినిమా పాటల చెల్లెమ్మ మంగ్లీని.. కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు వెంటబెట్టుకుని మరీ అరసవల్లి ఆలయంలో దర్శనం చేయించారు.
సరిగ్గా ఒక్కరోజు తర్వాత.. జగనన్న శ్రేయోభిలాషి, తొలి నుంచీ ఎన్టీఆర్ ఫ్యామిలీ అంటే గిట్టని అక్కినేని నాగార్జున, ఢిల్లీ టీడీపీ పార్లమెంటరీ పార్టీ ఆఫీసులో, సకుటుంబ సపరివార సమేతంగా దర్శనమిచ్చారు. ఆయనతో పాటు టీడీపీ ఫ్లోర్‌లీడర్ లావు కృష్ణదేవరాయలు కూడా ప్రధాని వద్దకు వెళ్లిన వారిలో ఉన్నారు. అంతేనా? ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత తన ఇంట్లోనే అక్కినేని కుటుంబానికి విందు ఇచ్చారట.
అసలు క్రమశిక్షణకు ఆరోప్రాణంగా చెప్పుకునే ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ ఎటు వెళుతోంది? పార్టీ సిద్ధాంతాలు ఏమయ్యాయి? డబ్బున్నవాళ్లంతా కలసి అటకెక్కించేశారా? తమకు టికెట్లు ఇచ్చి, తమను ఈ స్థాయిలో నిలబెట్టిన పార్టీ అంటే పదవులు తీసుకున్న వారికి లెక్కలేకుండా పోయిందా? పార్టీ పరువు పోయినా ఫర్వాలేదు.. తమ వ్యక్తిగత సంబంధాలు, వ్యాపార బంధాలు సజావుగా ఉండాలని కోరుకుంటున్నారా? మరి దీన్నిబట్టి.. పార్టీ ప్రధానమా? వ్యక్తులు ప్రధానమా? వ్యక్తులే ప్రధానమైతే మరి పార్టీ సంగతి ఏమిటి?.. ఇదీ ఈ రెండు ఘటనల నేపథ్యంలో, పసుపు సైనికులు సోషల్‌మీడియా వేదికగా సంధిస్తున్న ప్రశ్నాస్త్రాలు.
గత ఎన్నికల్లో జగన్ మళ్లీ సీఎం కావాలని, అభ్యర్ధులను చూసి కాకుండా జగన్‌ను చూసి ఓటేయాలని, ఫ్యానుకు ఓటేస్తే ఐదేళ్లు చల్లగా ఉడవచ్చంటూ ప్రచారం చేసిన సినీ గాయని మంగ్లీ గుర్తుందా?.. పోనీ అధికారం వచ్చిన తర్వాత ఎస్వీబీసీ సలహాదారుగా జగన్ నియమించిన మంగ్లీ తెలుసా?.. యస్. ఆ మంగ్లీని, కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు స్వయంగా వెంటబెట్టుకుని.. అరసవల్లి ఆలయానికి తీసుకువె ళ్లిన వైనంపై, టీడీపీ సోషల్‌మీడియా సైనికులు శివాలెత్తారు.
‘‘ వైసీపీ పేరు పలకను అన్న చంద్రయ్య శవమయ్యాడు. బాబుగారి పేరు కూడా పలకను అన్న మంగ్లీ విఐపి అయింది’’ అంటూ టీడీపీ సోఏల్మీడియా సైనికులు, ఉదయం నుంచి ఒంటికాలిపై లేస్తున్నారు.
‘‘మంగ్లీ నేపథ్యం గురించి తెలియని చిన్నపిల్లాడా ఆయన’’ అంటూ కారాలు మిరియాలు నూరుతున్నారు. రామ్మోహన్ తీరుకు నిరసనగా.. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్‌లో ఆయనను అన్‌ఫాలో చేస్తున్నారు. దీనికి సంబంధించిన కామెంట్లు సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
నిజానికి మంగ్లీ ఆర్టిస్టు అయినప్పటికీ.. మిగిలిన వారిలా కాకుండా నయాపైసా తీసుకోకుండా, జగనన్నపై అభిమానంతో వైసీపీకి విశేష సేవలందించారు. అందుకు ప్రతిఫలంగా అధికారంలోకి వచ్చిన వెంటనే ఆమెకు, జగనన్న ఎస్వీబీసీ సలహాదారుగా నియమించి రుణం తీర్చుకున్నారు. గత ఎన్నికల సమయంలో టీడీపీ సైతం ఆమెతో పాటలు పాడించాలని ప్రయత్నించింది. సహజంగా సినీనటులు, గాయనీగాయకులు రెమ్యూనరేషన్ ఇస్తేనే పనిచేస్తారు.
టీడీపీ కూడా అదే కోణంలో ఆమెను టీడీపీ ఎన్నికల ప్రచార పాటలు పాడమని కోరింది. అయితే తనకు చంద్రబాబు పేరు చెబితేనే కంపరమని నిర్మొహమాటంగా, నిష్కర్షగా కుండబద్దలు కొట్టేసిందట. అంతకముందు కూడా ఆమె అదే చెప్పింది. అలాంటి మంగ్లీని రామ్మోహన్ వెంటబెట్టుకుని, వీఐపీ కోటాలో దర్శనం చేయించటం సహజంగానే పార్టీ శ్రేణుల కడుపుమంటకు కారణమయింది.
పోనీ.. రామ్మోహన్నాయుడు అనే నాయకుడు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారా? అసలు రాజకీయాలు తెలియని అమాయకుడా? లోకజ్ఞానం లేని నాయకుడంటే అదీ కాదు. వరసగా ఎంపీగా ఎన్నికవుతున్న నేత.
సొంతంగా సోషల్‌మీడియా దళాలు నిర్వహించే తెలివైన యువనేత. మరి ఇన్ని తెలిసి.. ఇంత తెవివి ఉన్న రామ్మోహన్నాయుడు, వైసీపీని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే మంగ్లీకి తనతోపాటు వీఐపీ దర్శనం ఎలా చేయించారు? ఇవీ.. టీడీపీ సైనికులు ఉదయం నుంచి శరపరంపరగా సంధిస్తున్న ప్రశ్నాస్త్రాలు.
పోనీ.. తనపై మంగ్లీ కేంద్రంగా వస్తున్న విమర్శలకు స్పందించి, తన పొరపాటును క్షమించమని, రామ్మోహన్ ఏమైనా దిద్దుబాటుకు దిగారా అంటే అదీ లేదు. అంటే నాయకత్వం.. కొందరికి అతి స్వేచ్ఛ ఇచ్చి, నెత్తిన పెట్టుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు ఎదురవుతున్నాయో అర్ధం అవుతోందని, అటు పార్టీ సీనియర్లు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు-లోకేష్‌తో ఉన్న సన్నిహిత సంబంధాలు, వారిచ్చిన స్వేచ్ఛను ఏ స్థాయిలో దుర్వినియోగం చేస్తున్నారో చెప్పేందుకు, రెండురోజుల వ్యవధిలో జరిగిన సంఘటనలు చాలన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
ఇది జరిగిన మరుసటి రోజునే.. జగన్‌ను అమితంగా ప్రేమించే అక్కినేని నాగార్జున.. ఢిల్లీ పార్లమెంటు ఆవరణలోని టీడీపీ ఆఫీసులో ప్రత్యక్షం కావడాన్ని టీడీపీ అభిమానులు, ప్రధానంగా ఎన్టీఆర్ అభిమానులు అసలు జీర్ణించుకొలేకపోతున్నారు. ఎన్టీఆర్ ఫ్యామిలీని వ్యతిరేకించే అక్కినేని కుటుంబంతో, ఎన్టీఆర్ అభిమానులకు సైతం పొసగదన్న విషయం బహిరంగమే.
పైగా జగన్ మిత్రుడైన నాగార్జునను, ఏకంగా పార్టీ ఆఫీసులోకి ఎవరు తీసుకువ చ్చారు? అందుకు పార్టీ అధినేత చంద్రబాబునాయుడు గానీ, మంత్రి లోకేష్‌గానీ, చివరకు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అనుమతి తీసుకున్నారా? అని పార్టీ సైనికులు ప్రశ్నిస్తున్నారు.
అక్కినేని నాగేశ్వరరావుకు సంబంధించిన పుస్తకాన్ని మాజీ ఎంపి
యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రాశారు. హిందీలో రాసిన ఆ పుస్తకాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ఆ మేరకు ఉదయం 11 గంటలకు అపాయింట్మెంట్ కూడా ఇచ్చారు. కానీ దానికంటే ముందు నాగార్జున.. సకుటుంబ సపరివార సమేతంగా, పార్లమెంటులోని టీడీపీ ఆఫీసులో ప్రత్యక్షమయ్యారు. ఆ ఫొటోలు వైరల్ కావడంతో, దానిపై టీడీపీ సోషల్‌మీడియా సోల్జర్స్ వెటకారంగా స్పందించారు.
‘‘ మరో ఆణిముత్యం.ఢిల్లీలోని టీడీపీ ఆఫీసులో ఎంపి శబరితో నాగార్జున ఫ్యామిలీ భేటీ’’.. నిన్న మంగ్లీ.. నేడు నాగార్జున..రేపు ఇంకెవరు వస్తారో?
పార్టీని తిట్టిపోసి జగన్‌కు జై కొట్టిన వారికి రెడ్‌కార్పెట్ వేసే రోజులొస్తాయని కలలో కూడా ఊహించలేదు’’.. ‘‘ ఇలా జరుగుతుందని ఊహించి ఉంటే, వైసీపీ వారి చేతుల్లో హత్యకు గురైన చంద్రయ్య అప్పుడే జై జగన్ అని ప్రాణాలు దక్కించుకునేవాడు. ఆ తెలివి ఆయనకు లేకపోవడం వల్లే మృత్యువాతపడ్డారు’’ అని విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.
దానికంటే ముందు నాగార్జున ఢిల్లీ మేనేజర్, అక్కడికి చేరుకుని నాగార్జున పర్యటనను పర్యవేక్షించారట. ఆ తర్వాత మోదీ వద్దకు వెళ్లిన నాగార్జున.. మాజీ ఎంపి యార్లగడ్డ సమక్షంలో, ప్రధాని ఆ పుస్తకం ఆవిష్కరించారు. అందులో మోదీ పక్కన టీడీపీపీ నేత, నర్సరావుపేట ఎంపి లావు కృష్ణదేవరాయలు కూడా దర్శనమివ్వడమే టీడీపీ శ్రేణులను విస్మయపరిచింది.
సహజంగా బయట వ్యక్తులు టీడీపీపీ కార్యాలయానికి హాజరుకావాలంటే, పార్టీ ఫ్లోర్‌లీడర్ అనుమతి తప్పనిసరి. అంటే ఆ ప్రకారంగా లావు కృష్ణదేవ రాయలు అనుమతితోనే అక్కినేని కుటుంబం, పార్టీ ఆఫీసుకు వచ్చినట్లు స్పష్టమతుంది. పైగా ప్రధాని పక్కన నాగార్జున, యార్లగడ్డతో లావు కూడా ఉన్నారంటే.. యార్లగడ్డ టీడీపీపీ నేత లావును ప్రభావితం చేసి ఉండాలన్న వాదన, పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత లావు.. వారందరికీ తన నివాసంలోనే భోజనం ఏర్పాటుచేశారట.
అసలు యార్లగడ్డ.. అక్కినేనిపై రాసిన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి టీడీపీ హడావిడి, ఆధ్వర్యం, ఆతిధ్యం ఏమిటి? గతంలో యార్లగడ్డ టీడీపీలో పనిచేసినప్పటికీ, ఆయన చంద్రబాబును వ్యతిరేకించే వ్యక్తి అని.. దగ్గుబాటి-నందమూరి హరికృష్ణ సలహాదారు అని.. అప్పట్లో బాబుపై హరికృష్ణ రాసిన లేఖల రచయిత, యార్లగడ్డ అన్నది పార్టీలో అందరికీ తెలిసిందే. జగన్ హయాంలో ఆయనకు పదవి కూడా కట్టబెట్టారు.
లక్ష్మీపార్వతి-యార్లగడ్డ ఇద్దరూ బాబుపై చేసిన జమిలి పోరాటం, కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి యార్లగడ్డ కార్యక్రమానికి టీడీపీపీనేత లావు ఎలా హాజరయ్యారు? వ్యక్తిగత హోదాలో వెళ్లారా? పార్టీ నేతగా వెళ్లారా? పార్లమెంటులో జరిగిన కార్యక్రమం కాబట్టి, వ్యక్తిగత హోదాలో వెళ్లడం కుదరదు. అందుకు ఆయన పార్టీ అనుమతి తీసుకున్నారా? లేదా? అన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. పైగా పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే బాలకృష్ణకు పద్మవిభూషణ్ అవార్డు వచ్చిన కొద్దిరోజులకే.. ఎన్టీఆర్ ఫ్యామిలీ అంటే సరిపడని అక్కినేని ఫ్యామిలీని, ప్రధాని వద్దకు తీసుకువెళ్లిన వైనం అటు బాలయ్య అభిమానులకూ రుచించడం లేదు.
‘అసలు అక్కినేనిపై పుస్తకం రాసింది యార్లగడ్డయితే, అక్కినేని ఫ్యామిలీని మోదీ వద్దకు తీసుకువెళ్లడం ఏమిటి? వాళ్లకు ప్రధాని వద్దకు తీసుకువెళ్లింది ఎవరు? పోనీ ఆ పుస్తక ముద్రణకు నాగార్జున ఆర్దిక సహాయం ఏమైనా చేశారా? ఎన్ కన్వెన్షన్ కూల్చివేత వ్యవహారం వివాదాస్పదమైన నేపథ్యంలో.. నాగార్జునను ప్రధాని వద్దకు తీసుకువెళ్లడం ద్వారా ఏం సంకేతాలిస్తున్నారు? ఈ వ్యవహారంలో ఎవరు ఎవరిని ప్రమోట్ చేస్తున్నారు? ఇదంతా నాగార్జునను బీజేపీకి దగ్గరచేసే వ్యూహాత్మక ప్రమోషన్ రాజకీయమా? ఈ ‘మార్కెటింగ్ వ్యవహారం’లో టీడీపీని ఎందుకు లాగారు? అందులో మా పార్టీ ఎంపీ లావు ఎలా ఇన్వాల్వ్ అయ్యారో అర్ధం కావడం లేద’’ని ఓ పొలిట్‌బ్యూరో సభ్యుడు వ్యాఖ్యానించారు.
ఏదేమైనా ఇలాంటి సంఘటనలు క్షేత్రస్థాయిలో.. ప్రత్యర్థిపార్టీతో యుద్ధం చేసే పార్టీ సైనికుల ఆత్మస్థైర్యం దెబ్బతీస్తాయన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నారు. కింది స్థాయిలో తాము ప్రత్యర్ధి పార్టీ వారితో యుద్ధం చేసి, ప్రాణ-ఆస్తినష్టం చేసుకుంటే.. పైస్థాయిలో మాత్రం అంతా కలిసే ఉన్నట్లు కనిపించడం వల్ల, క్షేత్రస్ధాయిలో పోరాటతత్వం చచ్చిపోతుందని సీనియర్లు స్పష్టం చేస్తున్నారు.