– నువ్వే నన్ను తిట్టమని ఒత్తిడి చేసినట్లు సాయిరెడ్డి చెప్పారు
– నువ్వు క్యారక్టర్ గురించి మాట్లాడటం సిగ్గుచేటు
– విజయసాయి భేటీ గుట్టు విప్పిన షర్మిల
– ‘సూర్య’ చెప్పిందే అక్షరసత్యమని తేల్చిన షర్మిల
అమరావతి: వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఎంపి విజయసాయిరెడ్డి-తనకు మధ్య జరిగిన భేటీలో ఏం జరిగిందో జగన్ చెల్లెలు, ఏపీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి గుట్టు విప్పారు. జగన్ పిలిచి నన్ను తిట్టమని ఒత్తిడి చేస్తేనే సాయిరెడ్డి నన్ను తిట్టిన సంగతి కూడా చెప్పారు. సొంత చెల్లి కారెక్టర్‌పై దుష్ర్పచారం చేసిన నువ్వు.. మేనల్లుడు, మేనకోడళ్ల ఆస్తులు కొట్టేయాలని చూసిన నువ్వు కూడా, క్యారక్టర్ గురించి మాట్లాడటం అసహ్యంగా ఉందంటూ షర్మిల.. తన అన్న జగన్‌ను దునుమాడారు.
ఆ ప్రకారంగా షర్మిల-సాయిరెడ్డి భేటీలో జరిగిన సంభాషణ నిజమేనంటూ సూర్యలో వచ్చిన కథనాన్ని, షర్మిల తన వ్యాఖ్యల ద్వారా స్పష్టం చేయటం విశేషం. ‘సారీ పాప.. జగన్ తిట్టమంటేనే నిన్ను తిట్టా’ అన్న శీర్షికతో.. సోమవారం ‘సూర్య’లో ప్రత్యేక వార్తా కథనం వెలువడిన విషయం తెలిసిందే. షర్మిల తాజా ప్రెస్‌మీట్‌లో వెల్లడించిన అంశాలు ‘సూర్య’ కథనాన్ని నిజం చేశాయి.
ప్రెస్‌మీట్‌లో షర్మిల ఏమన్నారంటే.. విజయసాయిరెడ్డితో చాలా అంశాలు మాట్లాడాం.జగన్మోహన్ రెడ్డి వల్ల పడిన ఇబ్బందులు ఆయన చెప్పారు.నా బిడ్డలకు సంబంధించిన విషయం మాత్రం నేను చెబుతా. షేర్స్ తనకే చెండాలంటూ నా మీద, నా తల్లి మీద కేసు వేశారు. అందుకే నేను వైఎస్ ఆనాడు అన్న మాటలు చెప్పాను.
విజయసాయిరెడ్డితో జగనే ప్రెస్ మీట్ పెట్టించి నా మాటలు అబద్ధాలు అని చెప్పించారు. ఆ తర్వాత సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి మాటలు అబద్ధమని విజయమ్మే లేఖ రాసి చెప్పారు. ఆ తర్వాత కూడా జగన్.. విజయసాయిరెడ్డిపై ఒత్తిడి తెచ్చారంట.ఆయన అంగీకరించకుంటే సుబ్బారెడ్డితో మాట్లాడించారు.
వైఎస్ఆర్ బిడ్డ, తోడబుట్టిన చెల్లి అని కూడా చూడకుండా జగన్ దిగజారిపోయారు.నా క్యారెక్టర్‌పై నీచంగా మాట్లాడించారు. క్యారెక్టర్ గురించి ఇటీవల పెద్ద పెద్ద డైలాగులు చెప్పిన జగన్.. క్యారెక్టర్ అంటే ఏంటో మరచిపోయారు.
వైఎస్ఆర్ కోరికకు భిన్నంగా అబద్ధం చెప్పాలని విజయసాయిరెడ్డిపై ఒత్తిడి తెచ్చారు.పరువు పోతుంది.. వదిలేయండి అన్నా జగన్ ఊరుకోలేదు.ఏ అబద్ధాలు ఎలా చెప్పాలో జగన్ చెబితే.. విజయసాయిరెడ్డి రాసుకున్నారంట. ఇదీ జగన్మోహన్ రెడ్డి మహోన్నతమైన క్యారెక్టర్. మేనకోడలు, మేనల్లుడు ఆస్తులు కాజేయాలని జగన్ కుట్రలు చేశారు.