న్యూఢిల్లీ, ఏప్రిల్ 5: ఇఫ్కో అభివృద్ధి చేసిన నానో యూరియా స్ప్రే చేసిన పంటల్లో దిగుబడులు పెరిగాయని ఎరువుల శాఖ సహాయ మంత్రి భగవంత్ ఖూబా రాజ్యసభకు తెలిపారు. వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చి (ఐసీఏఆర్)తోపాటు కొన్ని రాష్ట్రాల వ్యవసాయ విశ్వవిద్యాలయాలు నానో యూరియాతో చేపట్టిన ప్రాధమిక ప్రయోగాల ఫలితాల అనంతరం ఇఫ్కో అభివృద్ధి చేసిన నానో యూరియాను ఫెర్టిలైడర్ కంట్రోల్ ఆర్డర్‌లో తాత్కాలికంగా చేర్చినట్లు చెప్పారు.
వివిధ పంటలపై నానో యూరియా స్ప్రేను ప్రయోగాత్మకంగా వినియోగించగా ఆయా పంటల దిగుబడి పెరిగిందని అన్నారు. పైగా యూరియా వినియోగం 50 శాతం తగ్గినట్లు తెలిపారు. నానో యూరియా వినియోగానికి రైతులకు ఫెర్టిగేషన్ (నానో యూరియాను ద్రవ రూపంలో మార్చే ప్రక్రియ)కు సౌకర్యాలు అవసరమా అన్న ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ నానో యూరియాను ద్రవ రూపంలో మొక్కల ఆకులకు మాత్రమే అందిచడం జరుగుతుందని తెలిపారు. నానో యూరియా ఎరువును వినియోగాన్ని ప్రోత్సహించడానికి సదస్సులు, క్యాంప్‌లు, పొలాల్లో ప్రదర్శనలు, కిసాన్ సమ్మేళనాలను నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు.