Suryaa.co.in

Features

అంధ విశ్వాసాలను తూర్పారబట్టిన విశ్వమానవుడు యోగి వేమన

వేమన పద్యాలు వందల సంవత్సరాల వరకు గ్రంథస్తం కాకుండా కేవలం సామాన్యుల నోటనే నిలిచి ఉన్నాయి. భారతదేశం సందర్శించిన ఒక ఫ్రెంచి మిషనరీ జె ఎ దుబాయ్ 1806లో హిందువుల అలవాట్లు ఆచారాలు, పండుగలు అనే గ్రంథాన్ని ఫ్రెంచి భాషలో వ్రాశాడు. దీనిని 1887 లో హెన్రీ కె బ్యూకేంప్ ఆంగ్లలోకి అనువదించాడు. దీనిలో ఆత్మ పవిత్రతని చర్చించేటప్పుడు బురద ని తయారు చేసేది, శుభ్రపరచేది నీరు లాగా, తన సంకల్పమే పాపం చేయడానికి కారకము, సంకల్పం చేతనే పవిత్రంగా ఉండగలం అనే వేమన చెప్పిన పద్య అర్ధాన్ని ఉటంకించారు. 1816 లో భారతదేశం వచ్చిన ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ ఎన్నో వేమన పద్యాలను సేకరించాడు. దాదాపు 18 ఏళ్లు వేమన సాహిత్యం పై ధ్యాస పెట్టాడు. తాను వేమనను కనుగొన్నానని బ్రౌన్ దొర సాధికారికంగా ప్రకటించుకొన్నాడు.

అతను వందల పద్యాలను సేకరించి వాటిని లాటిన్, ఆంగ్ల భాషలలోకి అనువదించాడు. విలియమ్ హోవర్డ్ కాంబెల్ (1910), జి.యు.పోప్, సి.ఇ.గోవర్ వంటి ఆంగ్ల సాహితీవేత్తలు వేమనను లోక కవిగా కీర్తించారు. తెలుగువారిలో వేమన కీర్తి అజరామరం చేయడానికి కృషి చేసినవారు కట్టమంచి రామలింగారెడ్డి. రాష్ట్రంలో పలుచోట్ల వేమన జయంతి ఉత్సవాలు నిర్వహించటానికి రెడ్డి కృషి చేశాడు. “విశ్వదాభిరామ వినురవేమ” అనే మాట వినని తెలుగు వాడు ఉండడు. వానకు తడవని వారు, ఒక్క వేమన పద్యం కూడా రాని తెలుగువారు ఉండరని లోకోక్తి. వేమన చరిత్ర చాలా మంది పరిశోధకులు కృషి చేసిన అస్పష్టంగా ఉంది.చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ ద్వారా వేమన పద్యాలు వెలుగులోకి వచ్చాయి. పామరులకు కూడా అర్థమయ్యే భాషలో పద్యాలు చెప్పి ప్రజలను మెప్పించిన కవి, వేమన . ఆటవెలది తో అద్భుతమైన కవిత్వము, అనంతమైన విలువ గల సలహాలు, సూచనలు, విలువలు, తెలుగు సంగతులు ఇమిడ్చిన మహానుభావుడు, యోగి వేమన.

బహుళ ప్రచారంలో ఉన్న కథనం ప్రకారం వేమన వివరాలు ఇలా ఉన్నాయి.వేమన కొండవీటి రెడ్డిరాజవంశానికి చెందిన వారు అని, గండికోట దుర్గాధిపతులతో సంబంధం కలిగినవారని అంటారు. కానీ ఇది నిజం కాదని పరిశోధకులు తెలియజేస్తున్నారు. కడప మండలంలోని ఒక చిన్న పల్లెలో మధ్య తరగతి కాపు కులస్థులకు జన్మించారని అంటున్నారు. ఆయన నందన నామ సంవత్సరము, ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి రోజున జన్మించారు. ఆయన తన జన్మస్తలాన్ని తనే ఒక పద్యంలో వివరించారు.వేమన కాలం గురించీ, జీవితం గురించీ సి.పి. బ్రౌన్, తరువాత మరికొందరు అధ్యయనం చేశారు. వంగూరి సుబ్బారావు, వావిళ్ళ వెంకటేశ్వరశాస్త్రి, బండారు తమ్మయ్య, ఆరుద్ర, రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ, వేమూరి విశ్వనాధశర్మ, కొమర్రాజు వేంకటలక్ష్మణరావు, పంచాగ్నుల ఆదినారాయణశాస్త్రి, కట్టమంచి రామలింగారెడ్డి వంటి పండితులు, పరిశోధకులు ఈ విషయంపై వివిధ అబిప్రాయాలు తెలిపారు.

ఈ పరిశోధనల సారాంశం, వాటి గురించి కొంత ఖండన త్రిపురనేని వెంకటేశ్వరరావు “వేమన – పదహారేళ్ళ పరిశోధన”లో ఉన్నది. అతని కాలం గురించి ఏకాభిప్రాయం ఇప్పటివరకూ లభించలేదు. వివిధ పద్యాలలో ఉన్న పాఠాంతరాలు ఈ సమస్య మరింత జటిలం చేస్తన్నాయి. త్రిపురనేని వెంకటేశ్వరరావు అభిప్రాయం ప్రకారం వేమన జీవితం గురించి ఊహాచిత్రం ఇలా ఉంది. వేమన ఒక మోతుబరి రైతుబిడ్డ. ఊరికి పెదకాపులైనందున వారికి ఆన్ని భోగాలు ఉన్నాయి. చిన్నతనంలో తన సావాస గాండ్రు నాయకునిగా మెలిగారు. మూగచింతల పెదకాపునకు ఆ దేశపు రాజధాని కొండవీడులో కూడా ఒక ఇల్లు (విడిది) ఉన్నది. పదేండ్ల ప్రాయంలో వేమన చదువు కోసం నగరానికి వెళ్ళాడు. దిట్టలైన గురువు వద్ద చదువుకొన్నాడు. సంస్కృతం, గణితం నేర్చుకొన్నారు. పద్దులు వ్రాయగలరు. సాము, కసరత్తులలో ఆసక్తి కలిగియున్నారు.

నీతిని తెలిసినవారు. రాగాలలో, వీణానాదంలోను నేర్పరి. సాహసికుడు. స్వచ్ఛందుడు. బుద్ధిమంతుడు. కలిమి, కులము కలిగినవాడు, సాహసి, కళాభిమాని, యువకుడు అయిన వేమన పట్టణంలో వేశ్యలింటికి పోవడానికి అలవాటు పడ్డారు (ఇది నాటి సామాజిక నీతికి విరుద్ధం కాదు). కాని అతని సొమ్ములన్నీ కరిగిపోగా అభాసుపాలయ్యుంటారు. చివరకు ఎలాగో తంటాలుపడి, సమస్యను పరిష్కరించి అతనికి వివాహం చేశారు పెద్దలు. సంసారం బాధ్యతగా సాగించాడు కాని కాలంతోపాటు సమస్యలు పెరిగాయి. భార్యపట్ల ఆకర్షణ తగ్గింది. తరిగి పోయిన ఆస్తితో పెదకాపు కొడుకు ఊరిలో మనగలగడం కష్టం అయ్యింది. ఊరు విడచి జమీందారునో, చిన్నపాటిరాజునో ఆశ్రయించి కొలువులో ఉద్యోగం చేసి ఉండవచ్చు. బహుశా పద్దులు, భూమి పన్నులు, తగవుల పరిష్కారం వంటిపనులు అతనికి అప్పగింపబడి ఉండవచ్చును. కాని అతను నిక్కచ్చిగా ధర్మాన్ని వచించడం ఇతర ఉద్యోగులకు, ఒకోమారు ప్రభువుకూ కూడా ఇబ్బంది కలిగించి ఉండవచ్చును.

కొలువులో చాలీచాలని జీతం, గంపెడు సంసారం, మరోప్రక్క ఏవగింపు కలిగించే లోకం తీరు – ఇవన్నీ కలిసి ఆ మేధావి, పండితుడు, స్వచ్ఛందుడు అయిన వేమనను తిరుగుబాటుదారుగా చేసి ఉండవచ్చును. అదే కాలంలో దేశంలో నెలకొన్న కరువులు, పాలకుల అక్రమాలు, ఈతిబాధలు అతని ఆలోచనలకు పదును పెట్టాయి. స్వకార్యాలకు, లోకోపకారానికి ఎలాగైనా స్వర్ణ విద్యను సాధించాలని దీక్ష పూనారు. దాని గురించి మరల మరల ప్రస్తావించారు. అతని ఎందరో యోగులను, గురువులను దర్శించారు. వారు చెప్పిన సాధనలు చేశారు. గురువుల మర్మాన్ని తెలుసుకొన్నారు. ప్రాపంచిక జీవితంలో ఎంత మోసం, కపటం, నాటకం, దంభం గ్రహించిన వేమన సన్యాసుల బ్రతుకులలో కూడా అవే లక్షణాలున్నాయని తెలుసుకొన్నారు. వారి మోసమును ఎలుగెత్తి ఖండించారు. వేమన పద్యాలు లోక నీతులు. సామాజిక చైతన్యం వేమన పద్యాల లక్షణం. వేమన సృశించని అంశం లేదు.

సమాజంలోని అన్ని సమస్యలు భిన్న కోణాల్లోంచి దర్శించి ఆ దర్శన వైశిష్ట్యాన్ని వేమన తన పద్యాలలో ప్రదర్శించాడు. కుటుంబ వ్యవస్థలోని లోటు పాట్లు, మతం పేరిట జరుగుతున్న దోపిడీలు, విగ్రహారాధనను నిరసించడం, కుహనా గురువులు, దొంగ సన్యాసులు ఒకటేమిటి కనిపించిన ప్రతి సామాజిక అస్థవ్యస్థత మీద వేమన కలం ఝళిపించాడుపద్యాలన్నీ ఆటవెలది ఛందంలోనే చెప్పాడు. ఎంతో లోతైన భావాన్ని కూడా సరళమైన భాషలో, చక్కటి ఉదాహరణలతో హృదయానికి హత్తుకునేలా చెప్పాడు వేమన. సాధారణంగా మొదటి రెండు పాదాల్లో నీతిని ప్రతిపాదించి, మూడో పాదంలో దానికి తగిన సామ్యం చూపిస్తాడు. ఉదా:అల్పుడెపుడు బల్కు నాడంబరముగాను
సజ్జనుండు పలుకు చల్లగాను
కంచుమ్రోగినట్లు కనకంబుమ్రోగునా
విశ్వదాభిరామ వినురవేమ!

కులాన్నీ, అధికారాన్నీ, అహంకారాన్నీ, సంపన్నుల దౌష్ట్యాన్నీ నిరసిస్తూ ఊరూరా తిరిగి తత్వాలు చెప్పసాగారు. కొందరు వెర్రివాడని తరిమికొట్టారు. తనను తానే “వెర్రి వేమన్న” అని అభివర్ణించుకొన్నారు. వేదాంత సారాన్ని తన చిన్న పద్యాలలో పొందుపరచి ఊరూరా ప్రభోధించారు. ఆత్మ సంస్కారాన్ని, కుల సంస్కారాన్ని, ఆర్ధిక సంస్కారాన్ని ప్రబోధించారు. గురువుల కపటత్వాన్ని నిరసించారు. జీవితంలో, తత్వంలో, దాని ఆచరణలో అంతగా సాధన చేసి బోధించినవారు అరుదు. ఆనాటి దురాచారాలను మూఢ నమ్మకాలను తూర్పారబట్టారు.
విప్రులెల్ల జేరి వెర్రి కూతలు కూసి
సతి పతులను గూర్చి సమ్మతమున
మును ముహూర్త ముంచ ముండెట్లు మోసెరా ?
విశ్వదాభిరామ! వినురవేమ!

వేమన కవి కాదు ఎందుకంటే అతను ప్రభందాలు రాయలేదు , సంస్కృత పురాణాలు , రాజులను కీర్తిస్తూ కవిత్వం రాయలేదు. అతి సామాన్య ప్రజానీకానికి సులభమైన తెలుగు చాటు పద్యాలలో తత్వాన్ని -సమాజములో ఉన్న ముఱికిని , తేటతెల్లం చేసిన ప్రజాకవి. సంఘ సంస్కరణ కోసం కాల్పనిక సాహిత్యాన్ని ఎన్నుకోలేదు. ఏ విద్యా గురువు వద్ద సాంప్రదాయ విద్య అభ్యచించలేదు.వేమన ఎంచుకున్న జీవిత సత్యాలు యోగ పరం , జ్ఞానం ,నీతిదాయక పదాలు. వేమన యోగి వేమన కాని కవి వేమన కాడు. వేమన మాట వేదముల మూటగ చెప్పబడింది.సర్వ సుఖాలు అనుభవించి కుటుంభ ఆస్తులను హరింపచేసుకొని ప్రాపంచిక సుఖాలను వదిలి తత్వాన్ని ఫిలాసఫీ అందుకుని ” కామి గాక మోక్షగామి కాడని తన మొదటి పద్యం రాసుకున్నాడు.మానవుని హీనస్థితికి కారణమైన వ్యవస్థలపై తిరుగుబాటు చేశాడు. దీనికి ఆయనవాడిన ఆయుధం హేతువు లేక తర్క శీలత్వం.

మానవతా ధర్మంచంపదగినయట్టి శత్రువు తనచేత
చిక్కెనేని కీడు సేయరాదు
పొసగ మేలు చేసి పొమ్మనుటే మేలు
విశ్వదాభిరామ వినుర వేమసర్వమానవ సమానత్వంఉర్వివారికెల్ల నొక్క కంచముబెట్టి
పొత్తుగుడిపి పొలము కలయజేసి
తలను చెయ్యిబెట్టి తగనమ్మజెప్పరా
విశ్వదాభిరామ వినుర వేమ
కులవిచక్షణలోని డొల్లతనం గురించిమాలవానినంటి మరి నీటమునిగితే
కాటికేగునపుడు కాల్చు మాల
అప్పుడంటినంటు ఇప్పుడెందేగెనో
విశ్వదాభిరామ వినుర వేమ
నైతికత్వం గురించిఇంటియాలి విడిచి ఇల జారకాంతల
వెంటదిరుగువాడు వెర్రివాడు
పంటచేను విడిచి పరిగె ఏరినయట్లు
విశ్వదాభిరామ వినుర వేమ
మూఢనమ్మకాల ఖండనపిండములను జేసి పితరుల దలపోసి కాకులకును పెట్టుగాడ్దెలార పియ్యిదినెడుకాకి పితరుడెట్లాయరా
విశ్వదాభిరామ వినుర వేమ
సంఘసంస్కరణ ప్రబోధించే సర్వమానవ సమానత్వం,అస్పృస్యత ఖండన, నైతిక ప్రభోధం, మూఢనమ్మకాల ఖండన, ఆర్ధిక భావాలు సూచించే పై పద్యాలను బట్టి వేమనను మానవతావాదిగా చెప్పవచ్చు.

డాక్టర్ యం.సురేష్ బాబు, అధ్యక్షులు, ప్రజా సైన్స్ వేదిక

LEAVE A RESPONSE