– ఆటో డ్రైవర్లు ఆ రోజు దొంగల మాటలు నమ్మి మోసపోయారు
– ఒక్కసారి తప్పు చేస్తే భరించాల్సిందే
– రేవంత్ రెడ్డికి పోలీసులపై నమ్మకం లేదు
– ఉచిత బస్సు ప్రయాణానికి బీఆర్ఎస్ వ్యతిరేకం కాదు
– ఆటో డ్రైవర్ల సంక్షేమానికి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి
– ఆటో డ్రైవర్ల మహాధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్ ‘‘ఆటో డ్రైవర్ల సత్తా మాకు తెలుసు. గత ఎన్నికల్లో మమ్మల్ని ఓడించడంలో మీ పాత్ర కూడా ఉంది. మీరు తలుచుకుంటే భాషా సినిమాలో రజనీకాంత్‌లా 50 వేలమందిని తీసుకురాగలరు. ఆటో డ్రైవర్లు ఆ రోజు దొంగల మాటలు నమ్మి మోసపోయార ’’ ని, ఇందిరాపార్క్ వద్ద నిర్వహించిన ఆటో డ్రైవర్ల మహాధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆటో డ్రైవర్లను ఉద్దేశించి అన్నారు.
ఈ సినిమా ఇంకా నాలుగేళ్లు ఉంది. ఒక్కసారి తప్పు చేస్తే భరించాల్సిందే. అయితే తమను ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా, జైల్లో పెట్టినా మీ తరఫున కొట్లాడుతామని, మన హక్కుల గురించి మనం కొట్లాడితే తప్పులేదన్నారు.
మార్పు మార్పు అని కాంగ్రెస్ అంటే ఆటో డ్రైవర్లతో పాటు యావత్ తెలంగాణ నమ్మి మోసయాపోరు. రాహుల్ గాంధీ అశోక్ నగర్ వచ్చి ఛాయ్ తాగి ఫోజు కొట్టి, ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. కానీ దానిని నెరవేర్చలేదు. రైతుబంధు రూ.15 వేలు, వృద్ధులకు పెన్షన్ల పెంపు… ఇలా ఏ హామీని అమలు చేయలేదు అని విమర్శించారు.
ఎంతోమంది ఆటో డ్రైవర్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఉచిత బస్సు ప్రయాణానికి బీఆర్ఎస్ వ్యతిరేకం కాదు. కానీ హామీ మేరకు ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని, ఆటో డ్రైవర్ల సంక్షేమానికి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, ఇందుకోసం రానున్న బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని, ఉచిత ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.
420 హామీలు ఇచ్చి, అడ్డగోలు గ్యారెంటీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీపై ఒత్తిడి చేసేందుకు అన్ని పార్టీలు ఒక్కటి కావాలని పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డికి పోలీసులపై నమ్మకం లేదని, కాంగ్రెస్ పాలనలో పోలీసు పరిస్థితి కూడా ఏమీ బాగా లేదన్నారు. పోలీసులతోనే బెటాలియన్ పోలీసుల కుటుంబాలను కొట్టించారని ఆరోపించారు. ఆటో డ్రైవర్ల ధర్నా గురించి, వారి డిమాండ్ల గురించి తాము అసెంబ్లీలో, బయటా కొట్లాడుతామన్నారు.
ఇందిరా పార్క్ వద్ద ఆటో డ్రైవర్ల మహా ధర్నా ప్రాంతానికి కేటీఆర్ ఆటోలో చేరుకున్నారు. కేటీఆర్ మొదట తన నివాసం నుంచి కారులో బయలుదేరారు. ఆ తర్వాత కొందరు సీనియర్ నాయకులతో కలిసి ఆటో ఎక్కిన కేటీఆర్ మహాధర్నా వద్దకు చేరుకున్నారు. ఆటో డ్రైవర్‌తో కేటీఆర్ కాసేపు ముచ్చటించారు.