Suryaa.co.in

Andhra Pradesh

బుగ్గన బంధువుకు భూమిని కట్టబెట్టిన రెవెన్యూ అధికారులు!

• వైసీపీ నేతలకు తొత్తులుగా నాటి ఉద్యోగుల వైఖరి
• అప్పు ఇచ్చిన డబ్బులు అడుగుతుంటే ప్రాణాలు తీస్తామని బెదిరింపులు
• పని కల్పిస్తానని విదేశాలకు తీసుకెళ్లి చిత్రహింసలు
• గ్రీవెన్స్‌లో నేతలకు మొరపెట్టుకున్న బాధితులు

మంగళగిరి: వైసీపీ నేతలకు సహకరిస్తూ.. తమ భూమిని అప్పటి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బంధువు బీఆర్సీ బుగ్గారెడ్డికి అక్రమంగా రెవెన్యూ అధికారులు ఆన్ లైన్ చేశారని.. దీనిపై నాడు ప్రశ్నిస్తే పోలీసులతో బెదిరించారని.. వారికి అక్రమంగా ఆన్ లైన్ చేసిన 14 సెంట్లను రద్దు చేసి ఈ అక్రమాలకు సహకరించిన అధికారిపై చర్యలు తీసుకోవాలని నంద్యాల జిల్లా పాణ్యం మండలం గోరుకల్లు గ్రామానికి చెందిన సురేష్ బాబు మంగళవారం తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కేంద్ర కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ లో నేతలకు ఫిర్యాదు చేశారు. మంత్రి ఎన్ఎండీ ఫరూక్, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, మాజీ శాసన మండలి ఛైర్మన్ ఎంఏ షరీఫ్, బుచ్చిరాంప్రసాద్ లు అర్జీని స్వీకరించి న్యాయం చేస్తామని బాధితుడికి హామీ ఇచ్చారు.

అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమని అడుగుతుంటే.. తనను, తన కుటుంబ సభ్యులను చంపేస్తామని చింతల చెరువు వెంకటేశ్వరరెడ్డి అనే వ్యక్తి బెదిరిస్తున్నాడని.. అవసరం అంటే ఇంటి కాగితాలు తాకట్టు పెట్టి రూ.32 లక్షలు అప్పుగా ఇచ్చానని, ఇప్పుడు డబ్బులు ఇవ్వను ఏం చేసుకుంటావో చేసుకోమంటున్నాడని తనకు వెంకటేశ్వరరెడ్డి నుండి రావాల్సిన డబ్బులు ఇప్పించి ఆదుకోవాలని విజయవాడకు చెందిన యక్కంటి కృష్ణారెడ్డి నేతల ముందు ఆవేదన వ్యక్తం చేశారు.

పనిచూపిస్తానని తన భార్యను మస్కట్ తీసుకెళ్లి అక్కడ పనికల్పించకుండా.. తనకు తిండి పెట్టకుండా ఏజెంట్ ఇబ్బంది పెడుతున్నాడని.. తన భార్యను ఇండియాకు తిరిగి పంపించమని అడిగితే డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని.. ఏజెంట్ మల్లీడి సుబ్రహ్మణ్యంపై పాలకొల్లు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని.. తల్లి కోసం పిల్లలు బెంగ పెట్టుకున్నారని అంతేకాకుండా మస్కట్ లో ఉన్న తన భార్య ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని.. తనను ఎలాగైనా ఇండియాకు రప్పించాలని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన టి.రాజశేఖర్ నేతలకు విన్నవించుకొన్నాడు.

తన పొలాన్ని వైసీపీ నేతల కబ్జా చేస్తే.. న్యాయం కోసం పోలీసులు, అధికారులు చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పట్టించుకోవడంలేదని.. తిరిగి తనపైనే దాడులకు దిగుతున్నారని కృష్ణా జిల్లా జి.కొండూరుకు చెందిన మేరెడ్డి సామ్రాజ్యం అనే మహిళ నేతలకు ఫిర్యాదు చేశారు. విచారించి తనకు న్యాయం చేసేలా చూడాలని కోరారు.

కేంద్రం నుండి రిటైర్డ్ అయిన మాజీ ఉద్యోగులు తమ ఆరోగ్య సమస్యలపై ఆసుపత్రులకు వెళ్లాలంటే నెల్లూరులో ఉండే సీజీహెచ్‌సీ కు వెళ్లవలసి వస్తోందని.. దూరాభారంతో వృద్ధాప్యంలో ఇబ్బందులు పడాల్సి వస్తోందని.. కర్నూలులో మరో ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని టీడీపీ రాష్ట్ర క్రిస్టియన్ సెల్ వైస్ ప్రెసిడెంట్ ఏవైన్ బాబు రాజ్ నేతలను కోరారు.

ప్రకాశం జిల్లా చిన్నగుడిపాడుకు చెందిన రమణబాబు అనే వ్యక్తి నేతలకు అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. దాదాపు నాలుగు తరాలుగా తమ పూర్వికుల పండిచుకుని అనుభవంలో ఉన్న భూమిని… కరువు రీత్యా ఉపాధి కోసం మరో ఊరికి వెళ్లగా.. అప్పటి నేతల చర్యలతో ప్రభుత్వం ఆ భూమిని వేరొకరికి కేటాయించిందని.. వారికి కేటాయించిన భూమిని రద్దు చేసి తమకు భూమిపై హక్కులు కల్పించాలని.. అలాగే ప్రభుత్వం ఎవరికైతే భూమి కేటాయించిందో వారికి న్యాయం జరిగేలా మరొక చోట భూమి కేటాయించాలని అలా కుదరని పక్షంలో తమకు మరొక చోట అంతే భూమిని కేటాయించాలని విన్నవించుకున్నారు.

పలువురు సీఎం ఆర్ఎఫ్ సాయం కోసం అర్జీలు తీసుకురాగా.. మరికొందరు నామినేటెడ్ పదవులు ఆశిస్తూ.. నేతలు అర్జీలు ఇచ్చారు. వివిధ సమస్యలపై తమకు న్యాయం చేయాలంటూ పలువురు నేతలను వేడుకున్నారు.

LEAVE A RESPONSE