Suryaa.co.in

Andhra Pradesh

పేదవారికి యువ లాయర్లు న్యాయం చేయాలి

వైయస్‌ఆర్‌ లా నేస్తం కార్యక్రమంలో సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి

కొత్తగా లా గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన యువ లాయర్లు వృత్తిలో నిలదొక్కుకునేలా మూడేళ్లపాటు ఒక్కొక్కరికి ఏడాదికి రూ.60 వేల చొప్పున.. మూడేళ్లకు మొత్తం రూ.1.80 లక్షలు ఇస్తోంద‌ని, ఏడాదికి రెండుసార్లు నిధులు వారి ఖాతాల్లో జమచేస్తున్నామ‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో యువ లాయ‌ర్లు పేద‌వారికి న్యాయం చేయాల‌ని, మాన‌వ‌తాదృక్ప‌థంతో వ్య‌వ‌హ‌రించాల‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ సూచించారు. రాష్ట్రంలో జూనియర్‌ న్యాయ­వాదులకు అండగా ఉంటున్న రాష్ట్ర ప్రభుత్వం 2023–24 సంవత్సరానికి సంబంధించి రెండోవి­డత వైయ‌స్ఆర్‌ లా నేస్తం నిధులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో బటన్‌ నొక్కి విడుదల చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా 2,807 మంది అర్హులైన జూనియర్‌ న్యాయవాదులకు నెలకు రూ.5,000 స్టైఫండ్‌ చొప్పున ఈ ఏడాది జూలై నుంచి డిసెంబర్‌ వరకు ఆరునెలలకు ఒక్కొ­క్కరికి రూ.30 వేల వంతున మొత్తం రూ.7,98,95,000ను వారి ఖాతాల్లో జమచేశారు. నేడు ఇస్తున్న సాయంతో కలిపి ఇప్పటివరకు 6,069 మంది యువ న్యాయవాదులకు ఈ నాలుగున్నరేళ్లలో మొత్తం రూ.49.51 కోట్ల ఆర్థికసాయం అందించింది. న్యాయవాదుల సంక్షేమం కోసం అడ్వకేట్‌ జనరల్‌ ఆధ్వర్యంలో లా, ఫైనాన్స్‌ సెక్రటరీలు సభ్యులుగా రూ.100 కోట్లతో అడ్వకేట్స్‌ వెల్ఫేర్‌ ట్రస్ట్‌ ఏర్పాటు చేసింది. ఈ సంద‌ర్భంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆయా జిల్లాల్లోని యువ న్యాయ‌వాదుల‌తో వ‌ర్చువ‌ల్‌గా ప్ర‌సంగించారు.

ఈ సందర్భంగా సీఎం వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే….:
ఈ రోజు దేవుడి దయతో మరోమంచి కార్యక్రమానికి ఇవాళ ఇక్కడ నుంచి శ్రీకారం చుడుతున్నాం. వరుసగా గత నాలుగు సంవత్సరాలుగా వైఎస్సార్‌ లా నేస్తం కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. లా పూర్తి చేసుకుని తమ వృత్తిలో తాము నిలబడే సమయంలో వారికి ప్రోత్సహకంగా ఉండేందుకు, గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసుకున్న తర్వాత వాళ్లందరికీ…నెలకు రూ.5వేలు స్టైఫండ్‌ చొప్పున, సంవత్సరానికి రూ.60 వేలు, మూడేళ్లకు రూ.1.80 లక్షలు ఇస్తూ.. వాళ్ల కాళ్లమీద వాళ్లు తోడుగా నిలబడేందుకు వారికి తోడుగా ఉండే మంచి కార్యక్రమం జరుగుతుంది.

మనం చేస్తున్న ఈ కార్యక్రమం ద్వారా ఈ ఏడాదికి సంబంధించి రెండో విడతలో 2,807 మంది అడ్వొకేట్‌ చెల్లెమ్మలు, తమ్ముళ్లకు ఇవాళ మంచి చేస్తూ… దాదాపు 8 కోట్లు బటన్‌ నొక్కి ఒక్కొక్కరికి 30 వేల చొప్పన వారి బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తున్నాం.

ఈ నాలుగేళ్లలో మొత్తంగా వైఎస్సార్‌ లా నేస్తం ద్వారా 6,069 మంది జూనియర్‌ అడ్వొకేట్లకు మంచి చేస్తూ… మనందరి ప్రభుత్వం ఖర్చు చేసిన అమౌంట్‌ రూ.49.51 కోట్లు.

ఇది మంచి కార్యక్రమం. కారణం ఇటువంటి అడ్వొకేట్లకు వాళ్ల వృత్తిలో ఇనీషియల్‌ స్టేజ్‌లో నిలదొక్కుకొనేందుకు ప్రభుత్వం మంచి చేస్తూ అడుగులు ముందుకేస్తోంది.

ఈ కార్యక్రమం ద్వారా వాళ్ల వృత్తిలో వాళ్లు నిలదొక్కుకుంటారు. ఆ తర్వాత ఇదే మంచిని జ్ఞాపకం ఉంచుకొని పేదవాళ్ల పట్ల వీళ్లు కూడా అదే ఔదార్యం చూపించే మంచి సంస్కృతికి మనం చేసే ఈ కార్యక్రమం మంచి ముందడుగు అవుతుంది.

అడ్వొకేట్లందరూ బాగుండాలని, వారి కోసం మనసారా ఆలోచనలు చేసి మంచి జరగాలని తపిస్తూ వాళ్ల కోసం వైయస్సార్‌ లా నేస్తమే కాకుండా రూ.100 కోట్లతో అడ్వొకేట్స్‌ వెల్ఫేర్‌ ట్రస్టును స్థాపించాం.
అడ్వొకేట్‌ జనరల్‌ ఆధ్వర్యంలో, లా సెక్రటరీ, ఫైనాన్స్‌ సెక్రటరీ ఇద్దరినీ సభ్యులుగా ఆ ట్రస్టులో ఉంచుతూ రూ.100 కోట్లు కేటాయింపు చేశాం.

ఆ కేటాయింపు వల్ల కోవిడ్‌ సమయంలో వీళ్లందరికీ చాలా మంచి జరిగింది. కోవిడ్‌ సమయంలో ఆడ్వోకేట్‌లను ఆదుకునేందుకు ప్రభుత్వం తరపును వేగంగా అడుగులు పడ్డాయి. వీళ్లలో 643 మందికి కోవిడ్‌ సమయంలో వీళ్ల కుటుంబాలకు రూ.52 లక్షలు డబ్బులు ఇవ్వడం జరిగింది. ఆ టైంలో ఇబ్బందుల్లో ఉన్న అడ్వొకేట్స్‌ను ఆదుకుంటూ మరో 7,733 మందికి రూ.11.56 కోట్లు రుణాలు ఇవ్వడం జరిగింది.

మరో 14,848 మంది అడ్వొకేట్లకు మెడిక్లెయిమ్‌ పాలసీ కింద మరో రూ.11.41 కోట్లు చెల్లించాం. అదే టైంలో దాదాపు రూ.25 కోట్లు ఈ ఫండ్‌ నుంచి అడ్వొకేట్‌ కమ్యూనిటీకి ఇచ్చి.. వారికి తోడుగా నిలబడగలిగాం.

ఇవన్నీ మనసు పెట్టి, వీరికి మంచి జరగాలని ఆలోచన చేసి ఇవ్వగలిగాం. నా పాదయాత్రలో నా దగ్గరకొచ్చి వీళ్లంతా వినపతిపత్రం ఇచ్చినప్పుడు మాట ఇచ్చాను. ఆ మేరకు వాళ్లందరికీ తోడుగా ఉంటూ ఈ నాలుగు సంవత్సరాలుగా అడుగులు వేశాం అని సంతోషంగా చెబుతున్నాను.

ఒక స్నేహితుడిగా, ఒక అన్నగా ప్రతి అడ్వొకేట్‌కు నా తరపున ఒకే ఒక రిక్వెస్ట్‌. కచ్చితంగా గుర్తుపెట్టుకొండి. ప్రభుత్వం ఏ రకంగా మీకు తోడుగా నిలబడుతోందో, జరిగిస్తున్న ఈ మంచిని.. పేద వాడి పక్షాన మీరు కూడా అంతే ఔదార్యం చూపిస్తూ, అంతే మంచి చేసే విషయంలో మానవతాదృక్ఫథం చూపించాల్సిందిగా ప్రతి అడ్వొకేట్‌ సోదరుడిని, చెల్లెమ్మను ప్రభుత్వం తరపున మీ అన్నగా, మీ అందరికీ మంచి స్నేహితుడిగా అభ్యర్థిస్తున్నాను.

దేవుడి దయతో మీ అందరికీ మంచి జరగాలని మనసారా కోరుకుంటూ, ఇంకా మంచి చేసే అవకాశాలు, పరిస్థితులు రావాలని మనసారా ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను అని సీఎం తన ప్రసంగం ముగించారు.

LEAVE A RESPONSE