రెవెన్యూశాఖామాత్యులు ధర్మాన ప్రసాదరావు
శ్రీకాకుళం: వంశధార రిజర్వాయర్ తో శివారుకు సాగు నీరు అందిస్తామని రెవెన్యూ శాఖామాత్యులు ధర్మాన ప్రసాదరావు అన్నారు. సోమవారం మంత్రి నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి ధర్మాన మాట్లాడుతూ..వ్యవసాయం కోసం ఏమీ తెలియని రాజకీయ పార్టీల నాయకులు ఏవేవో మాట్లాడుతున్నారు. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల కన్నా గొప్పగా ఏపీ ప్రభుత్వం రైతులను ఆదుకుంటోంది. అక్కున చేర్చుకుంటోంది. పంట ప్రారంభంలో విత్తనాల పంపిణీ దగ్గర నుంచి పంట చేతికి వచ్చినంత వరకూ ప్రభుత్వమే అన్ని విధాల సాగుదారులకు తోడుగా ఉంటోంది. ఈ విధంగా మన ఆంధ్ర రాష్ట్రంలోనే పాలన ఉంది. ఇవాళ ఎక్కడైనా విత్తనం,ఎరువు అందలేదు అనే వార్త చూశారా అని ప్రశ్నిస్తున్నా ? రైతుల మేలు కోరి సచివాలయం,ఆర్బీకే వ్యవస్థలు తీసుకు వచ్చాం. పండిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నాం. చిన్నా,పెద్దా అన్న తేడా లేకుండా అందరి రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నాం. అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులకూ ప్రాధాన్యం ఇచ్చి,వాటికి నిధులు కేటాయించి పూర్తి చేస్తున్నాం.
టీడీపీ అధికారంలో ఉన్నంత వరకూ వ్యవసాయం రంగంలో ఉత్పత్తి – 6.5 శాతం ఉంటే..ఈ రోజు ఉత్పత్తి + 5.56 శాతం ఉంది. విపక్ష నేత చంద్రబాబుకు వ్యవసాయం అంటే చిన్న చూపు. ఒక సందర్భంలో వ్యవసాయం దండగ అని అన్నారు. దేశంలో 65 శాతం ప్రజలు వ్యవసాయ రంగం ఆధారితంగానే జీవిస్తున్నారు. వైఎస్ఆర్ హయాంలో ఆ రోజు ప్రభుత్వం తరఫున ఉచిత విద్యుత్ ఇస్తాం అంటే..చంద్రబాబు హేళన చేస్తూ..మాట్లాడారు. సకాలంలో విద్యుత్ అందదని,కరెంటు తీగలపై బట్టలు ఆరబెట్టి కోవాలి అని అన్నారు. అనాలోచిత విమర్శలు చేశారు. చంద్రబాబు ఫక్తు వ్యాపార దృక్పథం కలిగిన వ్యక్తి. రైతుల విషయంలో ఆయన ఏనాడూ ఏమీ చేసిన దాఖలాలు లేవు. అలానే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ఏ రోజైనా ఇచ్చిన మాటకు కట్టబడి ఉన్నారా ? రైతులకు ఏ రోజైనా తోడుగా ఉన్నారా..? అని ప్రశ్నిస్తున్నాను.
ఇవాళ మధ్యవర్తులు లేకుండా రైతులకూ,ఇతర లబ్ధిదారులకూ నేరుగా పథకాలు అందిస్తున్నాం. 14 ఏళ్ళు సీఎంగా చంద్రబాబు ఉన్నారు. ఏ రోజైనా రైతుకు అండగా నిలిచారా ? రైతు సంతోషంగా ఉండాలి అని ఉద్దేశిస్తూ చేసిన కార్యక్రమం ఒక్కటైనా ఉందా ? మన శ్రీకాకుళం జిల్లాలో ఏ సాగునీటి ప్రాజెక్ట్ ను పూర్తి చేశారో చెప్పగలరా ? కేంద్రం ఇచ్చిన అభివృద్ధి సూచీల్లో గతం కంటే మెరుగ్గా ఉంది. గతం కంటే ఇవాళ ఆంధ్ర రాష్ట్రం ముందుంది. ఇదొక శుభ పరిణామం. ఆ రోజు చంద్రబాబు ఏ రంగాన్నీ ఉద్ధరించింది లేదు. మాయ మాటలు చెప్పడం తప్ప..! సాగు రంగానికి ఏమీ చేయని చంద్రబాబు.. ఇవాళ రైతుల కోసం మాట్లాడడం విడ్డూరంగా ఉంది. ఆ రోజు ఎన్నికల ముందు రైతులకు ఉన్న బకాయిలు తీరుస్తా అన్నారు. ఐదేళ్లు కాలయాపన చేసి మోసం చేశారు. అదే వైయస్ జగన్ కు అధికారం ఇస్తే ఎన్నికల ముందు పాదయాత్రలో చెప్పిన విధంగానే రైతులకు ఉన్న బకాయిలు చెల్లించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.
వర్షపాతం గడిచిన ఏడాది కన్నా తక్కువ నమోదు అయ్యింది. గడిచిన నాలుగేళ్ల కన్న తక్కువ పంటలు పండాయి. శివారు ప్రాంతం అయిన నందిగాంలో పంటలు ఎక్కువ లేవు. వర్షాభావ పరిస్థితులను అధిగమించేందుకు,రైతుకు సాగునీటి వెతలు తీర్చేందుకు వీలుగా వంశధార రిజర్వాయర్ పూర్తి చేసి శివారు ప్రాంతాలకు నీరు అందిస్తాం. కాలువలకు సిమెంట్ లైనింగ్ వేస్తేనే నీరు అందుతుంది. ఒకసారి రిజర్వాయర్ లో 19 టీఎంసీల నీరు అందితే 2.5 లక్షల ఎకరాలు సస్యశ్యామలం అవుతుంది.
వంశధార ప్రాజెక్టుకు ఆయువుపట్టుగా నిలిచే నేరేడి బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి ఒడిశా ముఖ్యమంత్రితో సీఎం జగన్, దాసన్న ఇదివరకే మాట్లాడారు. ఇరు రాష్ట్రాల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఈలోగా గొట్టా వద్ద లిఫ్ట్ పెట్టి,రిజర్వాయర్ నింపాలి. సంబంధిత పనులు జరుగుతున్నాయి. మరో 6 మాసాలులో పనులు పూర్తికావస్తాయి. వచ్చే ఖరీఫ్ నాటికి పనులు పూర్తయితే నీరు అందిస్తాం. వంశధార ప్రాజెక్టుకు సంబంధించి కాలువలు కట్టి 60 ఏళ్ళవుతుంది..టైల్ ఎండ్-లో సిమెంట్ లైనింగ్ అయితేనే నీరు అందుతుంది. ఇందుకు సంబంధించిన పనులు చేపట్టాల్సి ఉంది. జిల్లాకు సంబంధించి ఏ సాగునీటి ప్రాజెక్టు అయినా పూర్తి చేసింది,సత్వర చర్యలు చేపట్టింది మా ప్రభుత్వమే అని మంత్రి ధర్మాన పునరుద్ఘాటించారు.