నెల్లూరు : నెల్లూరు జిల్లాలోని పొదలకూరులో దారుణం చోటుచేసుకుంది. తమ ప్రేమకు కుటుంబసభ్యులు అంగీకరించలేదనే కారణంతో ప్రేమించిన యువతిపై యువకుడు తుపాకీతో కాల్పులు జరిపాడు. ఆ తర్వాత అదే తుపాకీతో తాను కూడా కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
పొదలకూరు మండలం తాటిపర్తికి చెందిన సురేశ్‌రెడ్డి, కావ్య బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. వారు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ ప్రస్తుతం వర్క్‌ఫ్రమ్ హోం కావడంతో స్వగ్రామం తాటిపర్తి నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు. సురేశ్, కావ్య వారి ప్రేమ విషయం ఇటీవల వారి ఇళ్లలో చెప్పారు.
అయితే సురేశ్‌తో పెళ్లికి కావ్య కుటుంబసభ్యులు అంగీకరించలేదని సమాచారం.ఈ నేపథ్యంలో ఇవాళ సురేశ్ తుపాకీతో వెళ్లి కావ్యపై కాల్పులు జరిపాడు. అనంతరం తానూ తలపై కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొనఊపిరితో ఉన్న కావ్యను స్థానికులు హుటాహుటిన నెల్లూరు ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యంలో ఆమె మృతిచెందింది.
సమాచారం మేరకు పోలీసులతో కలిసి పొదలకూరు తహసీల్దార్ సుధీర్‌బాబు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. ప్రేమించిన యువతిపై సురేశ్ కాల్పులు జరపడానికి గల కారణాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.