యువశక్తి తలచుకుంటే కానిదంటూ ఏది ఉండదు. అది సమాజంలో అసమానతలపై పోరాటమైనా.. ఈ దేశానికి వివిధ స్థాయిల్లో గొప్ప పేరు తీసుకురావాలన్నా యువతే కారణం. దేశ భవిష్యత్తు యువతపైనే ఆధారపడి ఉంది. కానీ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల వల్ల యువశక్తి బలవుతోంది. ప్రభుత్వాలను పాలించే పాలకుల తీరు వల్ల ప్రతిభ ఉన్నా అనేక మంది యువత నేడు నిస్సాహయులుగా మిగిలిపోతున్నారు. యువతను ప్రోత్సహించాల్సిన ప్రభుత్వాలు పూర్తిగా యువశక్తిని పట్టించుకోకపోవడంతో ఏమి చేయలేని దుస్థితి నెలకొంది భారతదేశంలో. మన దేశంలో ముఖ్యంగా దేశ జనాభాలో యువత ఎక్కువే అయినప్పటికీ యువకులకు ఆయా రంగాల్లో అవకాశాలు కల్పించి వారి ప్రతిభను గుర్తించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి.
దేశ రక్షణలో, పోలీసు శాఖలో తదితర ఉద్యోగాల్లో ముఖ్యంగా బార్డర్ లో పనిచేసేది యువతే. బాహ్య శత్రువులను ఎవరు మన దేశంలోకి రాకుండా దేశం నలుమూలల పహారా కాస్తూ అనేక మంది వారి విధి నిర్వాణలో అమరులైన యువ ఉద్యోగులు ఉన్నారు. కేవలం రెండు, మూడు శాఖలకు సంబందించిన వాటిలోనే యువతకు అవకాశాలు ఉంటున్నాయి. యువశక్తిని సంపూర్ణంగా వినియోగించుకునే అవకాశాన్ని పాలకులు తీసుకోలేకపోతున్నారు. దీంతో ప్రతిభ ఉన్నా యువశక్తి ఏమి చేయలేక బలైపోతున్నారు. ఏ దేశానికి అయినా యువత అనే వారు సంపద వంటి వారు అటువంటి యువశక్తిని వారిలోని నైపుణ్యాన్ని వెలికితీయాల్సిన ప్రభుత్వాలు మన దేశంలో అంత ప్రాధాన్యత ఇవ్వడం లేదు.
ముఖ్యంగా భారతదేశంతో పాటు ఇటు రాష్ట్రంలో యువతను ప్రోత్సహించే వారు కరువయ్యారు. ప్రస్తుతం భారతదేశంలో ప్రభుత్వం అనేకమైన ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయడం వల్ల యువకులకు ప్రతిభ ఉన్న వారికి కొలువులు దొరకడం లేదు. దీంతో అనేక మంది యువకులు నిరుద్యోగ సమస్యతో ఆత్మబలిదానాలు చేసుకుంటున్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో యువకులకు అవకాశాలు లభించకపోవడంతో యువశక్తి నిర్వీర్యం అవుతోంది. ప్రభుత్వాలు యువశక్తిని యువకులను అన్ని రంగాల్లో ప్రోత్సహించాల్సి ఉన్నా వారి శక్తి సామర్థ్యాలను పట్టించుకోవడం లేదు. ఫలితంగా అనేక మంది నైపుణ్యం కలిగిన యువత దేశానికి ఉపయోగపడే సత్తా కలిగిన వారు కుటిల రాజకీయాల వల్ల వారి ప్రతిభ వెలుగులోకి రాకుండా పోతుంది.
సమాజం కోసం జరిగే ఏ పోరాటంలోనైనా యువ భాగస్వామ్యం కోసం చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే దేశానికి సంబందించి ప్రపంచ క్రీడల్లో, అనేక అంతర్జాతీయ వేదికల మీదుగా ఎన్నో గౌరమైన పతకాలు సాధించేది యువతనే అటువంటి యువత పట్ల స్వార్థాన్ని నింపుకున్న పాలకవర్గం యువకులకు నామమాత్రపు అవకాశాలో లేదా పరిమిత స్థానాలకు పరిమితం చేయడంతో యువ ఆలోచనలు, నైపుణ్యం వెలుగులోకి రాకుండా పోతుంది.
ముఖ్యంగా రాజకీయపరమైన విధాన నిర్ణయాల్లో యువతను భాగస్వాములను చేయాల్సిన అవసరం ఉంది. అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా అన్ని రంగాల్లో యువతను క్రియాశీలకంగా చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్న మన దేశం బలమైన దేశంగా రూపుదిద్దుకోవాలంటే.. యువశక్తికి అన్ని విషయాల్లో ప్రోత్సాహాన్ని అందించాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో భారతదేశం మరింత బలమైన దేశంగా మారాలంటే యువత బలికాకుండా చూసి..వివిధ వేదికల మీద యువతకు అవకాశం ఇచ్చి గొప్ప మార్పుకు ఈ యువతరంతో శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది.
