Suryaa.co.in

Andhra Pradesh

యువగళం కాదది..మూగయాత్ర

– పాదయాత్ర లక్ష్యం చెప్పలేని పిల్లాడు లోకేశ్‌
– జనంలేని అట్టర్‌ఫ్లాప్‌ యాత్ర చేస్తున్నాడు
– పాదయాత్రకు రోల్‌మోడల్‌ మహానేత వైఎస్‌ఆర్‌
– ప్రజలతో నేరుగా మాట్లాడి కష్టాల్ని తెలుసుకున్న మహనీయుడు
– 2004లో అధికారంలోకి రాగానే పాదయాత్ర హామీల్ని నెరవేర్చారు
– కనుకనే 2009లో కూడా మళ్లీ అధికారం కట్టబెట్టారు
– గుర్తుచేసిన మంత్రికాకాణి గోవర్థన్‌రెడ్డి

కావలి వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే..

జనం లేని మూగయాత్రః

నెల్లూరు జిల్లాలో గత మూడు నాలుగురోజులుగా లోకేశ్‌ పాదయాత్ర గురించి టీడీపీ ప్రచారహోరు మార్మోగింది. పచ్చమీడియాతో పాటు సోషల్‌మీడియాలో కూడా పుంఖాను పుంఖానులుగా కథనాల్ని రాసుకున్నారు. ఇంకేముంది లోకేశ్‌ నెల్లూరు రాకతో మిగతా రాజకీయ పార్టీల పని అయిపోవడమేనన్నారు. సరేలే, అదంతా టీడీపీ శ్రేణుల్లో జోష్‌ నింపడానికి ప్యాకేజీ ప్రయోగాలనుకున్నారు. అందరూ లోకేశ్‌ యాత్రపై ఆసక్తిగా ఎదురుచూశారు. తీరాచూస్తే.. ఆ యాత్ర ఇక్కడకు రాగానే యువగళం యాత్ర కాస్తా అట్టర్‌ప్లాప్‌ యాత్రగా మారింది.

ఈ విషయాన్ని మేమేదో వ్యంగ్యంగా చెబుతున్నది కాదు. నెల్లూరు జిల్లాకు సంబంధించి దాదాపుగా 24 లక్షల మంది ఓటర్లు ఉంటే, అందులో కనీసం ఒక్కటంటే ఒక్కశాతం ప్రజలన్నా వస్తారనుకున్నా.. 24వేల మంది జనం లోకేశ్‌కు బ్రహ్మరథం పట్టాలికదా..? ఆయనకు నిజంగా ప్రజల్లో బాగా క్రేజ్, ఆదరణ ఉన్నట్లయితే అంతమందైనా రావాలి కదా..? మరి, ఎందుకు రాలేదు.
నెల్లూరుకు పైజిల్లాల నుంచి ఆయనకు వీడ్కోలు పలికేందుకు వచ్చినవారు.. ఈ జిల్లాకు సంబంధించి స్వాగతం పలకడానికి వెళ్లిన వారంతా కలిపి మొత్తంగా రెండుమూడు వేల మంది కూడా అక్కడ లేరు. దీన్నిబట్టి చూస్తే టీడీపీ పరిస్థితేంటో అర్థమౌతుంది. ఆ పార్టీ నాయకులపై జనాదరణ సంగతి దేవుడెరుగు.. కనీసం, జనసమీకరణ చేసే సత్తాగల నాయకత్వం కూడా ఆ పార్టీలో లేదేమో అనిపిస్తుంది. ఏదిఏమైనా నెల్లూరు జిల్లాకొచ్చేసరికి లోకేశ్‌ యువగళం పాదయాత్ర కాస్తా మూగ యాత్రగా మారిందని చెప్పాలి.

లోకేశ్‌కు ప్రజామద్ధతు నిల్ః

సాధారణంగా ఇప్పటిదాకా యువగళం పాదయాత్ర కొనసాగిన జిల్లాల్లో లోకేశ్‌ మాట్లాడుతూ.. తనను అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ, ప్రజలు తండోపతండాలుగా వచ్చి హారతులు పడుతున్నారంటూ డబ్బాలు కొట్టుకున్నాడు. మరి, ఈ నెల్లూరు జిల్లాలో ఏ ఒక్క నాయకుడు కూడా నీ పాదయాత్రను, నిన్ను అడ్డుకునే ప్రయత్నాలేమీ జరగలేదు కదా.. మరి, ఎందుకని నీ యాత్రకు ప్రజల మద్ధతు లభించలేదు..? అని ప్రశ్నిస్తున్నాను. దీనిపై నువ్వు గానీ, నీ పార్టీ నాయకులు గాని సమాధానం చెబుతారా..? ఆయనకొచ్చే జనప్రభంజనాన్ని ఎక్కడా ఎవరూ అడ్డుకోకపోయినా.. జనం ఎందుకు రాలేదో అందరూ ప్రధానంగా గుర్తించాల్సిన విషయం.

పాదయాత్రకు రోల్‌మోడల్‌ మహానేత వైఎస్‌ఆర్ః

ఎవరైనా పాదయాత్ర చేస్తే ఒక ఉద్దేశం, లక్ష్యంతో చేస్తారు. మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి గారు కూడా ఒక సంకల్పంతో లక్ష్యసాధనకు పాదయాత్ర చేపట్టారు. యావత్‌ భారతదేశంలోనే ఎవరు పాదయాత్ర చేయాలనుకున్నా ఆయన్నే రోల్‌మోడల్‌గా తీసుకుంటున్నారు. మా మహానేత వైఎస్‌ఆర్‌ పాదయాత్రలో పేద, బడుగు, బలహీనవర్గాల్ని కలవడం, రైతులు, శ్రామికులతో మాట్లాడటం.. వారి కష్టనష్టాల్ని తెలుసుకోవడం.. పలు సమస్యల పరిష్కారానికి హామీలివ్వడం తద్వారా 2004లో ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టగానే అప్పుడిచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చడం ఉమ్మడి ఆంధ్రరాష్ట్రంలో ప్రతీ గడప చూసిందే. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు కనుకనే తిరిగి 2009లో మహానేత వైఎస్‌ఆర్‌ అధికారంలోకి రావడం జరిగింది.

నమ్మించి వంచించిన బాబు పాదయాత్రః

ఇదిలాఉంటే, పులిని చూసి నక్క వాత పెట్టుకున్న చందంగా నేను పాదయాత్ర చేస్తాను. మోసాల్ని, అబద్ధాల్ని చెప్పి ప్రజల్ని నమ్మించి వంచన చేస్తాననే ఉద్దేశంతో చంద్రబాబు కూడా పాదయాత్ర చేశాడు. 2014లో అధికారపగ్గాలు పట్టుకోగానే తన పాదయాత్రలో తాను చూసినటువంటి ప్రజల కష్టాల్ని మరిచిపోవడం.. తాను ప్రకటించిన మ్యానిఫెస్టో హామీల్ని బుట్టదాఖలా చేయడంతో.. చంద్రబాబు తమను దారుణంగా మోసం చేశాడనే నిర్ణయానికి ప్రజలొచ్చారు. నమ్మించడం.. వంచించడమే గానీ మంచి చేసే ఉద్దేశమేలేని పాదయాత్ర చంద్రబాబు చేశాడని గ్రహించి ఆయన్ను 2019 ఎన్నికల్లో ఓడించి మూలనకూర్చొ బెట్టారు.

99.5 శాతం హామీల్ని నెరవేర్చిన పాదయాత్ర జగన్‌దిః

అదేవిధంగా 2019 ఎన్నికలకు ముందు మా పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడా పాదయాత్ర చేసి అన్నివర్గాల్ని కలవడం.. ప్రతీ సమస్యను తెలుసుకోవడం దాన్ని మేం అధికారంలోకి రాగానే పరిష్కరిస్తాం అన్నారు. అంటే, జగన్‌ తన పాదయాత్ర ఉద్దేశాన్ని చెప్పారు. తన లక్ష్యాల్ని నిర్దేశించుకున్నారు. ఆ ప్రకారం ఎన్నికల మ్యానిఫెస్టోను కూడా ప్రకటించారు. ప్రజలు ఆయన్ను నమ్మారు. ఆదరించారు కనుక జగన్‌ కి అధికారాన్ని అప్పగించారు. ఆమేరకు మా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రజలకు ఆనాడు చెప్పిన వాగ్దానాలన్నింటినీ.. మ్యానిఫెస్టోను పవిత్రగ్రంథంగా చూస్తూ ఇప్పటికే 99.5 హామిల్ని నెరవేర్చడం జరిగింది.

వాకింగ్‌ పిల్లాడు లోకేశ్ః

సరే, రాజకీయాల్లో సుదీర్ఘకాలం ఉన్నవారు చేసిన పాదయాత్రలు ఎలా జరిగాయనేది ప్రజలందరికీ తెలిసిన విషయాలే.. మరి, ఈ పిల్లాడు లోకేశ్‌ మాత్రం పాదయాత్ర అంటే సాయంత్రం నాలుగు తర్వాతనే అంటున్నా డు. మధ్యాహ్నం దాకా టెంటులో పడుకోవడం.. బాగా ఎండగా ఉందిలే అని సాయంత్రమెప్పుడో నాలుగు గంటలకు బయటకు వస్తున్నాడట.. అక్కడ ఆయన సెల్ఫీల కార్యక్రమం పూర్తికాగానే పరుగునా రయ్యిమంటూ నడుచుకుంటూ పోవడమంట. దీన్నిబట్టి చూస్తే లోకేశ్‌ చేసేది వాకింగ్‌ అనుకోవాల్నా.. పాదయాత్ర అనుకోవాల్నా..? ఏ ఒక్కర్నీ పలకరించేది లేదు. ప్రజల సమస్యల్ని తెలుసుకునేది లేదు. అలా చేసినప్పటికీ, టీడీపీని భుజానెత్తుకుని మోసే పచ్చమీడియా మాత్రం అహాఓహో అని కథనాలు రాసేయడం.. మహా అయితే, ఈ జిల్లాకు చెందిన వారిని కాకుండా ఏ ఇతర ప్రాంతాలోళ్లను కూలీకి పిలిపించి ఆ వ్యక్తితో ఆలింగనం ఫొటో పచ్చమీడియాలో ప్రచురించడం.. ప్రజలంతా ఇదే తంతును అదేపనిగా చూస్తూనే ఉన్నారు.

నీయాత్ర ఉద్దేశం, లక్ష్యమేంటి లోకేశ్‌..?ః

మరి, ఈ పిల్లవాడు లోకేశ్‌కు పెద్దగా రాజకీయ అవగాహన, పరిజ్ఞానం లేదు. రాజకీయాలపై ఆ పిల్లాడు ఏం మాట్లాడుతున్నాడో అతనికే సరిగ్గా అర్థంకాదు. అలాంటోడి పాదయాత్రకు ఒక ఉద్దేశం, లక్ష్యం ఉంటుందని మనమెవరం ఆశించకూడదు. ఏదైనా విషయపరిజ్ఞానం ఉన్నోడితోనైతే మాట్లాడొచ్చు గానీ.. అసలు విషయమే లేనోడితో మనకి పనేంటి..? నా స్థాయి కూడా అదిగాదు. కాకపోతే, ఈ పిల్లాడు లోకేశ్‌ నెల్లూరు జిల్లాకు ఎందుకు వస్తున్నాడు.. ? ఏ ఉద్దేశం, ఏ లక్ష్యం పెట్టుకుని వస్తున్నాడో అనేది ప్రజలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరముంది కదా..?

ఒకపక్క నువ్వేమో అసలు నీ పాదయాత్ర ఉద్దేశమేంటో.. నీ లక్ష్యమేంటో తెలియకుండా పాదయాత్ర చేస్తుంటే.. మీ నాన్న చంద్రబాబు మాత్రం అక్కడెక్కడో మ్యానిఫెస్టోను విడుదల చేస్తారు. పోనీ, బాబు ప్రకటించిన మినీ మ్యానిఫెస్టోలోనైనా టీడీపీ పేటెంట్‌ అజెండా ఉంటుందా..? అంటే, అందులో ఉన్నవన్నీ కర్ణాటక కాంగ్రెస్‌ హామీలు కొన్ని.. జగన్‌గారు ఇప్పటికే రాష్ట్రంలో అమలు చేస్తున్న హామీలు కొన్ని ఉన్నాయి.

అంతా కాపీపేస్ట్‌ మ్యానిఫెస్టో అని చెప్పుకోవాలి. నిన్నటిదాకా చంద్రబాబు ఏమన్నాడు..? బటన్‌ నొక్కడం.. పరిపాలన అంటే పంచిపెట్టడమా..? అని అన్నాడు. ఇప్పుడు మాత్రం యూటర్న్‌ తీసుకుని ఆల్‌ఫ్రీ బాబా అవతారం ఎత్తాడు. అసలు, లోకేశ్‌ ఏ ఉద్దేశం, లక్ష్యంతో పాదయాత్ర చేస్తున్నాడో.. ఏ సమస్యను పరిష్కారం చేయడానికి లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాడో ఈ యాత్రలో చెప్పాలికదా..?

సిగ్గుపడుతూ సెల్ఫీతీసుకో లోకేశ్ః

లోకేశ్‌ పాదయాత్రలో ఏవేవో సెల్ఫీలు దిగడం కాదు. నెల్లూరు జిల్లాలో శ్రీసిటీ దగ్గర నిల్చొని మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చేతులమీదుగా ప్రారంభమైందని..ఇలాంటి మంచి ఆలోచన రానందుకు నేను, మా నాన్న చంద్రబాబు సిగ్గుపడాలని అక్కడ ఒక సెల్ఫీ తీసుకో.. ఆ తర్వాత నేరుగా గూడురు – నెల్లూరుకు మధ్య రహదారిపై నడిచి నా తండ్రి చంద్రబాబు హయాంలో కురిసిన అధికవర్షాలకు రోడ్డు కొట్టుకుపోయిందని అక్కడ కూడా ఒక సెల్ఫీ తీసుకో.

అధికారంలో ఉండగా మా నాయన బాబు ఈరోడ్డుకు మరమ్మత్తులు చేయకపోయినా.. జగన్‌గారు ముఖ్యమంత్రి కాగానే బ్రహ్మండంగా రహదారి నిర్మించారు అని సిగ్గుతో తలదించుకుంటున్నాను అని ఒక సెల్ఫీ తీసుకో. అక్కడ్నుంచి నేరుగా సంగం నెల్లూరు బ్యారేజీ దగ్గర నిలబడి మా నాయన బాబు ఇది కట్టలేకపోయాడని.. జగన్‌గారు అధికారంలోకి రాగానే కట్టారని సిగ్గుపడి అక్కడ కూడా సెల్ఫీ దిగు. చాలా బాగుంటుంది. ప్రజలు కూడా లోకేశ్‌ పిల్లవాడైనా మంచి సంస్కారం కలిగినోడని పొగుడుతారు అని హితవుపలుకుతున్నాను.
యువగళంలో అంతా ముసలాళ్లేనా..?

లోకేశ్‌ చేసే యాత్రకు పేరు యువగళమన్నారు. కానీ, అక్కడ అందరూ తెల్ల వెంట్రుకలు ఉన్నోళ్లే కనిపిస్తున్నారు గానీ యువకులు ఒక్కరూ కూడా కనిపించలేదు. సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి యువకుడా..? యువగళంలో యువకులకు ఏమైనా చెప్పాలనుకున్నారా.. లేదంటే, యువతను అడ్డంపెట్టుకుని అదే పాత వయసైపోయిన నాయకులు, పాత రాజకీయాలే అనుకున్నావా లోకేశ్‌..? అసలు, యువకుల సమస్యలు నీకేం తెలుసునని వారికి చెబుతావు..? నువ్వు చెబితే, అమెరికాలో స్విమ్మింగ్ ఫూల్‌ లోతెంత చెబుతావు. విదేశాల్లో నీ అనుభవాన్ని చెప్పగలుతావు. అసలు, నేను ఒక సగటు నెల్లూరు జిల్లా వాసిగా అడుగుతున్నాను. నీ పాదయాత్రకు ఎందుకు రావాలి..? అని నిన్ను నిలదీస్తున్నాను. సమాధానం చెప్పు. చంద్రబాబు కొడుకువి కావడమే నీ క్వాలిఫికేషన్‌ మినహా లోకేశ్‌ ఎవరు..? రాజకీయాల్లో ఆయనకెందుకంత అర్హత ఉంది..? ప్రశ్నిస్తున్నాను.

రాజకీయాల్లో అడ్రస్‌ లేని వ్యక్తి లోకేశ్ః

లోకేశ్‌ను చూస్తే ఎవరో భయపడతారంట.. ఆయన మాట్లాడితే దడుసుకుంటారంట. ఇంతకీ, ఈయనెవరు అని అడుగుతున్నాను. రాజకీయాల్లో కేరాఫ్‌ అడ్రస్‌ లేని వ్యక్తి నారా లోకేశ్‌ అంటున్నాను. మంగళగిరిలో పోటీచేసి గెలవలేని వ్యక్తివి.. అప్పన్నంగా తండ్రి నిన్ను మంత్రిని చేస్తే కమీషన్ల దందాకు నిలయంగా మార్చిన నీచుడువి నువ్వు..? అని లోకేశ్‌ను హెచ్చరిస్తున్నాను. చంద్రబాబు కొడుకైనంత మాత్రానా లోకేశ్‌ను చూడనవసరం లేదని ప్రజలు గుర్తించారు కనుకనే అతని యువగళంకు ప్రజల మద్ధతులేదని స్పష్టంచేస్తున్నాను.

మాకు ఏపార్టీతో సంబంధాలండవని జగన్‌ గతంలోనే చెప్పారుః
గతంలో బీజేపిని నానారకాల మాటలన్న చంద్రబాబు ఈరోజు మళ్లీ బీజేపీతో చేతులు కలపడానికి తహతహలాడుతున్నాడు. గతంలో దేశాన్ని ఏకం చేసి మోదీని దించేస్తా అని చంద్రబాబు అనగానే.. 2019లో ఆయన్ను ప్రజలు దించేసి పక్కనబెట్టారు. మేము బీజేపీతో పొత్తుపెట్టుకోవాలనే ఆలోచన మేమేమీ చేయలేదుకదా.. బీజేపీతో జతకట్టతామని చెప్పలేదుకదా..? మా నాయకుడు జగన్‌గారు చెప్పిన మాట ఒక్కటే.. అదేమంటే, మేము ఒంటరిగా పోటీచేస్తాం. మాకెవరితో పొత్తులుండవు. ఎవరితో సంబంధాలుండవు. ఎవరైనా మాపై దురుద్దేశంతో సంబంధాల్ని అంటగట్టాలని చూడటమే తప్ప.. మేం మాత్రం ఆంధ్ర ప్రజల ఆశయాలు, ఆలోచనలకు తగినట్లు నడుచుకుంటాం.. అని మా జగన్‌గారు స్వయంగా మోదీ హాజరైన బహిరంగ సభలోనే స్పష్టంగా చెప్పారు.

ప్రజాదరణే వైఎస్‌ఆర్‌సీపీ బలంః

ఈరోజు రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌సీపీ ఎంత బలంగా ఉందంటే.. అటు టీడీపీ, జనసేనతో పాటు వామపక్షాలు విమర్శిస్తుంటే.. మరోవైపు ఇప్పుడు బీజేపీ కూడా మా పార్టీపై దుమ్మెత్తిపోస్తుంది. అంటే, వైఎస్‌ఆర్‌సీపీ ఈ రాష్ట్రంలో ఏమేరకు ప్రజాదరణతో ముందుకెళ్తుందనేది అర్థం చేసుకోవాలి. ఈ విధంగా మూకుమ్మడి దాడితో ఏదోవిధంగా అధికారంలోకి రాకపోతే.. భవిష్యత్‌ రాజకీయాల్లో ఆయా పార్టీలకు మనుగడనేది ఉండదని ఆ పార్టీల నాయకుల్లో వణుకు మొదలైంది. ప్రజలు మాత్రం ఎవరెన్ని చెప్పినా.. మాకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చిన జగన్‌గారి వెంటే నడవడానికి సిద్ధమని తేల్చిచెబుతున్నారు.

రెండునాల్కల నైజం బాబుకు అలవాటుః

ఢిల్లీ పర్యటనకు వెళ్లినప్పుడల్లా చంద్రబాబు మాదిరిగా తన ఓటుకు నోటు కేసు మాఫీ చేయమని.. రామోజీరావును మార్గదర్శి కుంభకోణం నుంచి బయటపడేయాలని సాగిలపడినట్లు ఇతర పార్టీల నాయకులు కూడా అలా చేస్తారని చంద్రబాబు అనుకుంటున్నారు. మా నాయకుడు జగన్‌ గారు ఢిల్లీకి వెళ్లిన ప్రతీసారి ఏదైతే బాబు హయాంలో రాష్ట్ర అవసరాలపై అడగడానికి ధైర్యం చేయలేకపోయాడో.. వాటన్నింటిపై చర్చించి సాధించుకుని వచ్చాడు. మొన్నటిమొన్న రూ.10వేల కోట్ల రెవెన్యూలోటు మొత్తాన్ని, పోలవరం ప్రాజెక్టు సంబంధించిన నిధులను కేంద్రం విడుదల చేసేందుకు జగన్‌ కృషిచేయడం జరిగింది. ఇది మా నాయకుడు ఢిల్లీ పర్యటన విజయాలు.

2024లో 175 స్థానాలు వైఎస్‌ఆర్‌సీపీవేః

చంద్రబాబులాగా పూటకోమాట చెప్పే నైజం మా నాయకుడు జగన్‌గారిది కాదు. బీజేపీని తిట్టిన నోటితోనే దాన్ని మళ్లీ పొగిడి అందింతే జుట్టు అందకపోతే కాళ్లు అంటూ సాగిలపడే రాజకీయాలు మావి కావని మరోమారు స్పష్టంచేస్తున్నాను. ఏదేమైనా టీడీపీ ఎన్ని యాత్రలు చేసినా.. ఎన్ని మ్యానిఫెస్టోలు విడుదల చేసినా.. ఎంతమందిని కూటమిగా చేసుకుని వైఎస్‌ఆర్‌సీపీపై దాడులు చేసినా ప్రజల మద్ధతు మాత్రం జగన్‌గారికే ఉంటుందని.. రాబోయే ఎన్నికల్లో 175 స్థానాలకు 175 మేం కైవసం చేసుకుంటామని స్పష్టంచేస్తున్నాను.

 

LEAVE A RESPONSE