ప్లీనరీని ప్రారంభించిన జగన్
వైసీపీ ప్లీనరీ ప్రాంగణానికి ఆ పార్టీ అధినేత జగన్, గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ చేరుకున్నారు. ఇడుపులపాయలో వైయస్ సమాధి వద్ద జగన్, ఇతర కుటుంబసభ్యులందరూ నివాళి అర్పించారు. అక్కడి నుంచి జగన్, విజయమ్మ గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుని, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ప్లీనరీ వేదిక వద్దకు వచ్చారు. వీరికి పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. ప్లీనరీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వైయస్ విగ్రహానికి పూలమాల వేసి జగన్ నివాళి అర్పించారు. పార్టీ జెండాను ఎగురవేశారు. ప్లీనరీని ప్రారంభించారు. మరోవైపు భారీ సంఖ్యలో తరలి వచ్చిన పార్టీ శ్రేణులతో ప్రాంగణమంతా నిండిపోయింది.
రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన లక్షలాది మంది వైయస్‌ఆర్ సీపీ శ్రేణుల సమక్షంలో అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించి ప్లీనరీ సమావేశాలను ప్రారంభించారు. జోహార్ వైయస్‌ఆర్.. జై జగన్.. జై వైయస్‌ఆర్ సీపీ నినాదాలతో ప్లీనరీ ప్రాంగణం దద్దరిల్లింది. ప్లీనరీ సమావేశాలకు హాజరైన లక్షలాది మంది నాయకులు, కార్యకర్తలకు పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్ అభివాదం చేస్తూ.. దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.