-
నామినేషన్‌కు వైవి సుబ్బారెడ్డి డుమ్మా
-
మాజీ మంత్రి అవంతి, మాజీ ఎంపి సత్యనారాయణ గైర్హాజరు
-
బొత్స అభ్యర్ధిత్వం వైవికి ఇష్టం లేదా?
-
వైవికి చెప్పకుండానే జగన్ బొత్స పేరు ప్రకటించారా?
-
బొత్స నామినేషన్‌లో అసమ్మతి
-
సుబ్బారెడ్డిపై బీసీల ఆగ్రహం
( అన్వేష్)
విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో వైసీపీ అభ్యర్ధిగా బరిలోకి దిగిన మాజీ మంత్రి, సీనియర్ నేత బొత్స సత్యనారాయణకు ఆదిలోనే హంసపాదు ఎదురయింది. వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్చార్జి, ఎంపి వైవి సుబ్బారెడ్డి నామినేషన్ రోజు బొత్సకు ఝలక్ ఇచ్చారు. నామినేషన్ రోజున జిల్లా కలెక్టర్ ఆఫీసు వరకూ వచ్చి, హటాత్తుగా వెనక్కివెళ్లిపోయిన సుబ్బారెడ్డి వైఖరి వైసీపీలోని బీసీ వర్గాలను ఆగ్రహపరిచింది.
విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల వ్యవహారం ఉత్తరాంధ్ర వైసీపీ అంతర్గత కుమ్ములాటను బట్టబయలుచేసింది. వైసీపీ అధినేత జగన్ ఆదేశాలతో, పార్టీ అభ్యర్ధిగా సోమవారం నామినేషన్ వేసిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు.. సొంత పార్టీలోనే ఎదురుదెబ్బ తగిలింది.
ఉత్తరాంధ్ర పార్టీ ఇన్చార్జి వైవి సుబ్బారెడ్డి, ఆయన మద్దతుదారులయిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, మాజీ ఎంపి సత్యనారాయణ నామినేషన్ కార్యక్రమానికి ముఖం చాటేయడం పార్టీ వర్గాల్లో కలకలం రేపింది. పార్టీకి చెందిన స్థానిక సంస్థల సభ్యులను ఏకం చేయాల్సిన సమయంలో.. స్వయంగా పార్టీ ఇన్చార్జి సహాయ నిరాకరణ చేశారన్న సంకేతాలు, అధికార పార్టీకి వరంగా మారతాయన్న ఆందోళన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
దానికితోడు బీసీకి టికెట్ ఇవ్వడం సుబ్బారెడ్డికి ఇష్టం లేదని, అందుకే ఆయన నామినేషన్ రోజున విశాఖలో ఉన్నప్పటికీ కార్యక్రమానికి హాజరుకాలేదన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. నిజానికి ఆయన అగ్రకులానికి చెందిన మరో నేతకు టికెట్ ఇప్పించాలని భావించగా, ఈ విషయంలో జగన్ నేరుగా రంగంలోకి దిగి బలమైన నేత బొత్సను ఎన్నిక బరిలోకి దింపినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అభ్యర్ధి ఎంపిక అంశంపై తనను సంప్రదించకపోవటం, ఎవరినీ లెక్కచేయని బొత్సను అభ్యర్ధిగా ఎంపిక చేయడాన్ని సుబ్బారెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారని వైసీపీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ఒకవేళ బొత్స విజయం సాధిస్తే, ఇక ఉత్తరాంధ్రలో తన ప్రాధాన్యం ఉండదన్న మరో ఆందోళన కూడా సుబ్బారెడ్డి అసంతృప్తికి ప్రధాన కారణమంటున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ఎంపి సత్యనారాయణ, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వర్గీయులైన వైసీపీ స్థానిక సంస్థల సభ్యులు బొత్స విజయానికి సహకరించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నిజానికి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఎన్నికల తర్వాత పార్టీలో అంటీముట్టనట్లు వ్యవహరిస్తుండగా, మాజీ ఎంపి సత్యనారాయణ భూముల కేసుల్లో పీకల్లోతు మునిగిపోయారు. ఇదిలాఉండగా ఎమ్మెలీ ఎన్నికలో 838 ఓట్లు ఉండగా, వైసీపీకి 530 ఓట్లు ఉన్నాయి. వైసీపీ నుంచి టీడీపీ-జనసేనలోకి చేరికలు జరిగినప్పటికీ.. ఇంకా 250 ఓట్లు కూటమి అభ్యర్ధికి అవసరం ఉంది.