– సర్కారు దిద్దుబాటు
– ఫలించిన యువ ఎంపి సానా సతీష్ ఒత్తిడి
– దానివల్ల బలిజలకు వచ్చే ప్రయోజనాలు దెబ్బతింటాయని సర్కారుకు సానా లేఖ
– జీఓ వచ్చిన నాటి నుంచి సర్కారుపై ఒత్తిడి పెంచిన సానా
– సానా అభ్యర్ధనకు సానుకూలంగా స్పందించిన నారా లోకేష్
– తాజాగా ఆ జీఓపై స్టేటస్ కో ఇస్తూ ఉత్తర్వులు
– స్టేటస్ కోపై కాపు నేతల హర్షం
– బాబు, పవన్, సానా, సవితకు కాపు సంఘాల కృతజ్ఞతలు
– కాపు సమస్యలపై స్పందిస్తున్న సానాకు కాపు-బలిజ సంఘాల అభినందన
– బలిజల ఆత్మగౌరవం నిలిపారంటూ సానాకు కాపునాడు కన్వీనర్ ఓవి రమణ కృతజ్ఞత
– కుల సమస్యలపై చొరవ తీసుకోవాలని సూచన
– ఆ జీఓ రద్దు చేయాలని కాపు-బలిజ సంఘాల సూచన
– ‘సూర్య’ ఎఫెక్ట్
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఏపీలో వెనుకబడిన దొమ్మర కులానికి చెందిన వారిపై జరుగుతున్న వివక్ష కారణంగా వారి కులాన్ని ‘గిరి బలిజ’గా మారుస్తూ.. ప్రభుత్వం ఆగస్టు 14న ఇచ్చిన జీఓ నెం 5పై తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకూ, జీఓ 5 విడుదలకు ముందున్న యధాతథ స్థితి (స్టేటస్కో) కొనసాగేలా ప్రభుత్వం జీఓ నెం 7ను విడుదల చేసింది.
కాగా దొమ్మరలను గిరి బలిజగా మారుస్తూ ప్రభుత్వ అధికారులు ఇచ్చిన జీఓపై బలిజ-కాపు సంఘాల్లో వ్యక్తమైన ఆగ్రహాన్ని విశ్లేషిస్తూ, ‘సూర్య’లో ప్రత్యేక కథనం వెలువడిన విషయం తెలిసిందే. దానితో బలిజ-కాపు సంఘాలు ఆ జీఓలు నిలుపుదల చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ చేశాయి.
జీఓ నెం5పై బలిజ-కాపు సంఘాల్లో పెల్లుబికిన నిరనస-అభ్యంతరాల నేపథ్యంలో.. రాజ్యసభ సభ్యుడు, కాపు యువ నేత సానా సతీష్ రంగంలోకి దిగారు. అంతకుముందు.. బలిజ-కాపు సంఘాలు ఆయనకు, దీనికి సంబంధించి వినతిపత్రాలు సమర్పించాయి. జీఓ నిలుపుదలకు కృషి చేయాలని కోరాయి.
దానికి స్పందించిన సానా.. ప్రభుత్వానికి బలిజ-కాపు సంఘాల మనోవేదనను వివరిస్తూ, ప్రభుత్వానికి లేఖ రాశారు. ముఖ్యంగా దీనివల్ల బలిజలకు వచ్చే ప్రయోజనాలు దెబ్బతింటాయని వివరించారు. బలిజ-కాపు సంఘాల ఆందోళన దృష్టిలో ఉంచుకుని, ఆ జీఓను నిలుపుదల చేయాలని తన లేఖలో పేర్కొన్నారు. ఇదే విషయాన్ని ఆయన యువ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లారు.
దానికి స్పందించిన లోకేష్.. బీసీ సంక్షేమ శాఖ అధికారులకు ఆ జీఓపై స్టేటస్ కో ఇవ్వాలని ఆదేశించారు. అటు మంత్రి సవిత కూడా వెంటనే స్పందించడంతో.. తాజాగా ఆ జీఓపై స్టేటస్కో విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
కాగా ఒక కులానికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన జీఓను.. కేవలం కొద్దిరోజుల్లోనే నిలుపుదల చేయడం, గతంలో ఎప్పుడూ జరిగిన దాఖలాలు లేవు. దీనితో కూటమి ప్రభుత్వం బలిజ-కాపుల మనసు మరోసారి గెలుచుకున్నట్లయింది. తొలి నుంచి కూటమి సర్కారు కాపు-బలిజలకు దన్నుగా ఉన్న విషయం తెలిసిందే. కాకపోతే అత్యంత సున్నితం- బలిజల ఆత్మగౌరవానికి సంబంధించిన ఈ అంశం వివాదంగా మారి.. పెరిగి పెద్దది కాకుండా ఎంపి సానా సతీష్ చాపకిందనీరులా పనిచేసి, సమస్యకు తెరదించారు.
నిజానికి యువనేత లోకేష్‌కు అత్యంత సన్నిహితుడైన ఎంపి సానా సతీష్.. గత కొంతకాలం నుంచి, కాపు-బలిజ సమస్యలపై
వెంటనే స్పందిస్తున్నారు. ఆ సమస్యలు తన దృష్టికి వచ్చిన వెంటనే కుల సంఘాల నాయకులతో యుద్ధప్రాతిపదికన భేటీ అవుతున్నారు. ఆ మేరకు వారికి తగిన హామీలిస్తున్నారు. ఫలితంగా గతంలో మాదిరిగా కాకుండా.. కాపు-బలిజ సంఘాల సమస్యలు చర్చల దశలోనే పరిష్కారం అవుతున్నాయి. అయితే వీటికి ప్రచారం ఇచ్చుకోవడం లేదు.
మూడునెలల క్రితం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కాపునాడు సంఘాలు, రిజర్వేషన్ అంశంపై రోడ్డెక్కేందుకు సిద్ధమైన సమయంలో.. ఇదే సానా సతీష్ రంగప్రవేశం చేసి, వారితో చర్చలు జరిపి, నిర్దిష్ట హామీ ఇవ్వడంతో కాపునాడు నేతలు సంతృప్తి చెందారు.
సానా సతీష్ చొరవ అభినందనీయం: బలిజనాడు కన్వీనర్ ఓవి రమణ
తాజా జీఓపై బలిజ-కాపు సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. స్టేటస్- కో కోసం కృషి చేసిన కాపు యువ ఎంపి సానా సతీష్‌కు తమ కృతజ్ఞతలు తెలిపారు. ‘‘బలిజల ఆత్మగౌరవంతోపాటు బలిజ హక్కులను కాపాడిన ఎంపి సానా సతీష్‌కు బలిజలు రుణపడి ఉంటారు. ఆయన చొరవ అభినందనీయం. బలిజలకు సంబంధించిన ఇంకా అనే క సమస్యలపై ఆయన దృష్టి సారించి, వాటి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలి.
ప్రధానంగా తిరుపతి సహా బలిజభవన్ నిర్మాణాల కోసం కృషి చేయాలి. చిన్న వయసులోనే బలిజ-కాపు సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న ఎంపి సానా సతీష్‌కు యావత్ జాతి మద్దతునిస్తుంద’’ని కాపునాడు కన్వీనర్, టీడీపీ నేత, టీటీడీ మాజీ సభ్యుడు డాక్టర్ ఓ.వి.ర మణ వ్యాఖ్యానించారు.
శహభాష్ సానా: కాపునాడు జాతీయ అధ్యక్షుడు గాళ్ల సుబ్రమణ్యం
బలిజల ఆత్మగౌరవానికి సవాలుగా పరిణమించిన జీఓ నెం 5పై స్టేటస్ కో విధిస్తూ, దాని స్థానంలో కొత్త జీఓ ఇచ్చిన కూటమి ప్రభుత్వానికి, దానికోసం నిరంతర కృషి చేసిన కాపు యువ ఎంపి సానా సతీష్‌కు కాపునాడు జాతీయ అధ్యక్షుడు గాళ్ల సుబ్రమణ్యం, రాష్ట్ర అధ్యక్షుడు అర్జా రామకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు.
‘‘ గిరి బలిజల నుంచి బలిజ పదాన్ని తప్పించాలని ఎంపి సానా సతీష్ చేసిన విజ్ఞప్తిన మన్నించిన కూటమి ప్రభుత్వానికి, బలిజ-కాపు సంఘీయుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించిన సానా సతీష్‌కు జాతీయ కాపునాడు అభినందలు’ అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
కాగా ప్రభుత్వంతో ఘర్షణ వైఖరి జాతీయ కాపునాడు విధానం కాదని గాళ్ల స్పష్టం చేశారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఉన్న కూటమిలో కాపు-బలిజ జాతికి ఎప్పటికీ అన్యాయం జరగదన్నది మా నమ్మకం. కొత్త జీఓ జారీ ద్వారా దానిని కూటమి మరోసారి నిరూపించుకుందని గాళ్ల సుబ్రమణ్యం వ్యాఖ్యానించారు.
‘‘ మేం కాపు-బలిజ జాతి ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చి, వాటి పరిష్కారం కోసమే పోరాడతాం. ఆ క్రమంలో కాపు-బలిజ సంఘాల మనోవేదనను వివిధ రకాలుగా వ్యక్తీకరించడం ద్వారా జాతి ప్రయోజనాలు కాపాడే అంతిమ లక్ష్యంతోనే స్వర్గీయ మిరియాల వెంకట్రావు, వంగవీటి మోహనరంగా కాలం నుంచి కాపునాడు దశాబ్దాల నుంచి పోరాడుతోంది. అసలు ఈ పదం చేర్చడం ద్వారా ప్రభుత్వానికి మచ్చ తెచ్చిన అధికారులపై చర్య తీసుకోమని అడిగాం. మా మనోభావాలను గుర్తించి, ప్రభుత్వానికి లేఖ రాసి తన పలుకుబడి ఉపయోగించి పాత జీఓపై స్టేస్ కో ఇప్పించి, కొత్త జీఓకు కారణమయిన ఎంపి సానా సతీష్‌కు కృతజ్ఞతలు. పాత జీఓ స్థానంలో కొత్త జీఓ ఇంత వేగంగా వస్తుందని మేం ఊహించలేదు. దానికి కారణమైన ఎంపి సానా సతీష్‌కు జాతీయ కాపునాడు కృతజ్ఞతలు’’ అని గాళ్ల సుబ్రమణ్యం తన ప్రకటనలో పేర్కొన్నారు.
కూటమికి కృతజ్ఞతలు: కాపు జేఏసీ అధ్యక్షుడు చందు జనార్దన్
జీఓ నెం 5పై స్టేటస్ కో విధిస్తూ ప్రభుత్వం ఇచ్చిన కొత్త జీఓను స్వాగతిస్తున్నామని కాపు జేఏసీ అధ్యక్షుడు చందు జనార్దన్ పేర్కొన్నారు. బలిజ-కాపుల ఆత్మగౌరవం గుర్తించిన సీఎం
చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఎంపి సానా సతీష్, మంత్రి సవిత, బీసీ సంక్షేమశాఖ కార్యదర్శి సత్యనారాయణకు ఆయన కృతజ్ఞత తెలిపారు. అదే విధంగా అసలు ఆ జీఓను రద్దు చేస్తే, తమ జాతి మీ మేలు ఎప్పటికీ మర్చిపోదని చందు అభ్యర్ధించారు. దీనికోసం చేసిన తమ పోరాటానికి మద్దతు తెలిపిన కాపు-బలిజ సంఘాలు, మీడియాకు ఆయన కృతజ్ఞతలు ప్రకటించారు.