-మూడు రాజధానులు… ఆరు రాజధానులనీ అమాత్యులంటే కోర్టు ధిక్కారం
-విద్యా దీవెన నిధులను నేరుగా కాలేజీ యాజమాన్యం ఖాతాలో చేర్చాలి
-గతంలో వై.ఎస్, బాబు నేరుగా ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించారు
-ఇప్పుడు అదే విధానాన్ని అమలు చేయమని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరాలి
-పీజీ విద్యార్థి ఫీజు రియంబర్స్మెంట్ తల్లి ఖాతాలో వేయడం ఏమిటి?
-సీబీఐపై సాక్షి ఎందుకింత అక్కసు??
-చిన్నాన్న, సోదరిపై సీఎం జగన్ కు ప్రేమ లేదా?
-అతి ప్రేమ ఉంటే ఇలాగే చేస్తారేమో??
-అధికారులు తస్మాత్ జాగ్రత్త…
-తప్పుడు లెక్కలు చెబితే చర్యలు తప్పవు
-జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి తప్పదు
-బాబు సభలకు తండోపతండాలుగా జనం …వెలవెలబోతున్న జగన్ మీటింగులు
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు
ఒకే రాజధానిగా అమరావతి అభివృద్ధి చేయాలని, ఇకనైనా అమాత్యులు మూడు రాజధానులు, ఆరు రాజధానులన్న రాగాలాపన ను మానుకోవాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు హితవు పలికారు. అమరావతిలో కేంద్ర వాణిజ్య శాఖకు కేటాయించిన పది ఎకరాల స్థలాన్ని అభివృద్ధి చేయాలని తాను మంత్రి పియూష్ గోయల్ కు లేఖ రాసినట్లు వెల్లడించారు. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ నుంచి సానుకూల స్పందన లభించిందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ…
ప్రస్తుతం న్యాయస్థానంలో అమరావతి రైతులు వేసిన కోర్టు ధిక్కరణ కేసు కొనసాగుతుందని, ఈ నేపథ్యంలో సత్తిబాబు , ఇతర మంత్రులు ఎవరైనా మూడు రాజధానులు, ఆరు రాజధానులనే ప్రకటనలు చేస్తే దాన్ని అమరావతి రైతులు కోర్టుకు నివేదించే అవకాశం లేకపోలేదన్నారు. దానితో ప్రభుత్వానికి తిప్పలు తప్పవని చెప్పారు.. ఒకే రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేసే సద్బుద్ధిని ముఖ్యమంత్రికి, మంత్రులకు భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.. విద్యా దీవెన పథకంలో భాగంగా ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను నేరుగా కాలేజీ యాజమాన్యాలకు ఖాతాలోకి జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రఘురామకృష్ణంరాజు డిమాండ్ చేశారు.
ఈ మేరకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్రభుత్వానికి లేఖలు రాయాలని సూచించారు. పీజీ చదువుకునే విద్యార్థి కి సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ మొత్తాన్ని తల్లి బ్యాంకు ఖాతాలో జమ చేయడం విచిత్రంగా ఉందన్నారు. పీజీ చదువుకునే విద్యార్థి కాలేజీలకు వెళ్లి … ఆ కాలేజీ బాగున్నది లేనిది..తల్లులు చూడగలరా? అంటూ ప్రశ్నించారు. విద్యా దీవెన పథకంలో భాగంగా లబ్ధిదారులకు సగము నిధులు మాత్రమే అందుతున్నాయని, ఈ పథకంలో పారదర్శకత లోపించిందని విమర్శించారు. భీమవరంలోని ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కు రాష్ట్ర ప్రభుత్వం 70 వేల రూపాయల వార్షిక ఫీజు నిర్ధారించిందని, విద్యార్థి కాలేజీ పూర్తి కావస్తున్నా ఇప్పటివరకు 17 వేల రూపాయలు కూడా ఆ కాలేజీ ఖాతాలో జమ కాలేదన్నారు. దీనితో కాలేజీల యాజమాన్యాలు డిగ్రీ పూర్తిచేసి నప్పటికీ, విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేయడానికి నిరాకరిస్తున్నాయన్నారు.
ఫీజు రియంబర్స్మెంట్ నిధులను నేరుగా కాలేజీ యాజమాన్యాలకు ఖాతాలో జమ చేస్తే, ఒకవేళ నిధుల విడుదల ఆలస్యమయినా, కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేసే అవకాశాలు ఉంటాయన్నారు. గతంలో ముఖ్యమంత్రులు వైయస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబుతో పాటు, రోశయ్య, కిరణ్ కు మార్ రెడ్డిలు ఇదే విధానాన్ని పాటించారని గుర్తు చేశారు. ప్రస్తుత జగన్ సర్కార్ వ్యక్తిగత ఎజెండాతో, అర్థంలేని ఆలోచనలతో ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేసి, కాలేజీ యాజమాన్యాలను బాధ్యత నుంచి తప్పించిందని విమర్శించారు. గతం లో ఎస్సీ ,ఎస్టీ విద్యార్థులకు విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులను ఖర్చు చేస్తే, కేంద్రం 60 శాతం నిధులను భరించే దని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. కానీ జగన్ సర్కార్ తీసుకువచ్చిన అమ్మ ఒడి ఈ పథకం వల్ల కేంద్రం నుంచి 60 శాతం నిధులు రాకుండా పోయాయని చెప్పారు. దీనితో ఎస్సీ ఎస్టీ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ప్రభుత్వ యూనివర్సిటీలలో చదువుకుంటేనే, ప్రభుత్వ సహకారం ఉంటుందని జగన్ సర్కార్ తీసుకువచ్చిన జీవో వల్ల, వారికి కేంద్రం చేయూత అందకుండా పోయిందన్నారు..
తప్పుడు లెక్కలు చూపిస్తే తిప్పలు తప్పవు
రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లకు తలొగ్గి కేంద్రానికి తప్పుడు లెక్కల నివేదికలను అందజేసే అధికారులకు తిప్పలు తప్పవని రఘురామకృష్ణంరాజు హెచ్చరించారు. అధికారులు ఇబ్బందులు పడరాదని, పదోన్నతులకు అడ్డంకి కాకూడదన్న ఉద్దేశంతో మెమోలు జారీ చేసినప్పటికీ, జైలుకు వెళ్లక తప్పని పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.. రాష్ట్ర ప్రభుత్వం చూపెడుతున్న అప్పుల కంటే చేసిన అప్పులే ఎక్కువని రఘురామకృష్ణంరాజు తెలిపారు. కార్పోరేషన్ లను గ్యారెంటీ గా చూపించే చేసిన అప్పులెన్ని , గ్యారెంటీ లేకుండానే తీసుకువచ్చిన అప్పులెన్నో చెప్పాలని రఘురామకృష్ణంరాజు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శి రావత్ ఇచ్చిన నివేదికలను కేంద్రం వెనక్కి పంపిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రుణాల పై సమగ్ర నివేదికలను అందజేయాలని కేంద్ర ఆర్థిక శాఖ సి ఎస్ కు లేఖ రాసిన విషయాన్ని ఈ సందర్భంగా రఘురామకృష్ణంరాజు గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అప్పులపై కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి తాను ఉన్నది ఉన్నట్లుగా తెలియజేస్తూ లేఖలు రాశానని పేర్కొన్నారు.. ఒకవైపు తప్పుడు పనులు చేసే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షాలపై, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 మీడియా సంస్థలపై, తనపై నిందలు వేయడం సరికాదన్నారు.
సిబిఐ స్వతంత్రంగా వ్యవహరించడం లేదా?
సి.బి.ఐ స్వతంత్రంగా వ్యవహరించడం లేదని సాక్షి దినపత్రికలో పెద్ద ఎత్తున కథనాన్ని రాయడం పట్ల రఘురామకృష్ణంరాజు విస్మయం వ్యక్తం చేశారు.. మూడేళ్ల క్రితం హత్యకు గురైన తన చిన్నాన్న పై, సోదరిపై జగన్మోహన్ రెడ్డికి ప్రేమ లేదా?, ఒకవేళ అధిక ప్రేమ అంటూ ఉంటే ఇలాగే ఉంటుందా ??అంటూ సాక్షి దిన పత్రిక కథనాన్ని మీడియా ప్రతినిధులకు ప్రదర్శించారు. వివేకా హత్య కేసు నిందితులకు బెయిల్ ఇవ్వొద్దంటూ సిబిఐ కోరుతుందని, అలాగే వివేకా కూతురు కూడా అదే డిమాండ్ చేస్తుందని చెప్పారు. నిందితులకు బెయిలు ఇవ్వొద్దని అంశంపై సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు తనని ఇంప్లీడ్ చేయమని కోరుతున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. అలాగే రెండున్నర నెలలుగా తాను దాఖలు చేసిన పిటిషన్ హియరింగ్ కు రాకుండా అడ్డుకుంటున్న వారెవరో అందరికీ తెలుసునని చెప్పారు.. చట్టంలోని 124 ఏ ను రద్దు చేయాలని, కక్షసాధింపు కోసం పాలక పక్షాలు దీన్నొక ఆయుధంగా వాడుకుంటున్నాయని తెలిపారు.